Skip to content
జాతీయం వార్తలు

ఈ దేశ మూలవాసులపై జన్యు పరిశోధనలు

Prajapaksham 30 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఈ దేశ మూలవాసులపై జన్యు పరిశోధనలు

Genetic research

డాక్టర్ దేవరాజు మహారాజు, సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్

భారతదేశ మూలవాసులెవరు? ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారెవరు? తేల్చుకోవడానికి కాలక్రమంలో ఇక్కడ కులాలు ఎలా పుట్టాయన్న దానికీ ప్రపంచ వైజ్ఞానికులు కొన్ని ముఖ్యమైన పరిశోధనలు చేశారు. ఇంకా కొందరు చేస్తూనే ఉన్నారు. మైఖేల్‌బమ్‌శద్‌, తూమస్‌ కిమిసిలిడ్‌, బిన్‌.బి. జుర్డేలు జరిపిన పరిశోధన సారాంశాన్ని క్రోడీకరించి ప్రకటించారు. భారత ఉపఖండంలో జీవిస్తున్న 1.417 (2022) బిలియన్‌ ప్రజల మూలాలు గూర్చి తెలుసుకోవడానికి ఈ పరిశోధనలు జరిగాయి.
ఇండో యూరోపియన్‌ భాష మాట్లాడే వారు కొందరు ఉత్తరాన పశ్చిమదిశ నుంచి- యురేషియా(యూరప్‌+ఆసియా) నుంచి వలసలు వచ్చి ద్రావిడ భాషలు మాట్లాడే దక్షిణ భారతీయులతో కలిసి క్రమంగా హిందూ కులవ్యవస్థకు పునాదులు వేశారని మూలవాసుల్ని బలవంతంగా అణగదొక్కి దేవుళ్ల పేరుతో ధర్మ ప్రభోదాలు చేస్తూ.. వారిపై ఆధిపత్యం సాగిస్తూ వచ్చారని పరిశోధకులు తేల్చారు. 3 నుంచి 8 వేల ఏళ్ల మధ్య కాలంలో అనటోలియా, కాకసస్‌ వంటి ప్రాంతాల నుండి యురేషియన్లు వచ్చి ప్రాంతీయ స్థితిగతులపై అవగాహన పెంచుకొని మూలవాసుల భూములు ఆక్రమించుకొని, వారిని బానిసలుగా మార్చి, హిందూ కులవ్యవస్థను ప్రతిష్టాపించి అధికారం చేజిక్కించుకున్నారని ధృవపరిచారు. భారతీయులకు యూరోపియన్లతో, ఆసియా వాసులతో గల సంబంధాలు బయటపడడానికి జన్యు పరిశోధనలే శరణ్యమయ్యాయి. అంతవరకు చారిత్రక సిద్ధాంతాలుగా ఉన్న విషయాలకు వైజ్ఞానిక ఆధారాలను సమకూర్చాయి.
ఎంటి డిఎన్‌ఎ లేక వై పాలిమార్ఫిజంల వల్ల ఈ దేశ జనాభాలో ఆర్యుల మూలాలున్నావారు, ఆసియా నుంచి లేదా యూరప్‌ నుంచి వలస వచ్చినవారేనన్నది నిర్ధారణ అయ్యింది. యురేషియన్లు అంటే ఆర్యులు. ఈ దేశంలోకి వలసలు రావడానికైనా, స్థిరపడడానికైనా నియోలిథిక్‌ యుగం చాలా కీలకమైంది. అలాగే ప్లిస్టోసీన్‌ యుగంలో జరిగిన వలసలు కూడా ముఖ్యమైనవే. బహుశా అప్పుడే ఆఫ్రికా నుంచి పశ్చిమాసియాకు, అక్కడి నుంచి దక్షిణ భారత దేశానికి వలసలు జరిగాయి. యూనివర్సిటీ ఆఫ్‌ ఉట్టా (యుటిఎహెచ్‌) అమెరికా, ఆంధ్రా యూనివర్సిటీ (ఎ.పి.ఇండియా)లలో భారత ప్రభుత్వ సహకారంతో పరిశోధనలు జరిగాయి. ఇంటిపేర్లు, పుట్టినస్థలాలు, వారి వారి కులాలు, వర్ణాలు అన్నీ నమోదు చేయబడ్డాయి. వాటితో పాటు 8మి.లీ. రక్తం, ఐదు తలవెంట్రుకలు కూడా డిఎన్‌ఎ పరీక్షల కోసం సేకరించడం జరిగింది. వృత్తుల, ఆర్థిక, సామాజిక స్థితిగతుల వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఇందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మొదటి మూడు స్థానాల్లో/స్థాయిలలో ఉన్న వీరు రెండు సార్లు జన్మనెత్తిన వారుగా భావిస్తారు. కాపులు, యాదవులు ఒకసారిగా జన్మనెత్తిన వారిగా భావిస్తారు. వీరిది నాలుగో స్థానం. ఇక చివర ఐదో స్థానంలో ఉన్నవారు వీరు అంటరానివారిగా పరిగణించబడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాతృభాషగా గల అన్ని కులాల నుంచి నమూనాలు సేకరించి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరిపి క్రిష్ణన్‌, రెడ్డి అనే ఇద్దరు పరిశోధకులు 1994లో ఫలితాలు ప్రకటించారు.
దీనికి మరింత బలాన్ని చేకూర్చే పరిశోధనలు మన హైదరాబాదు ‘సెంటర్‌ ఫర్‌ సెల్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ’ (సిసిఎంబి)లో జరిగాయి. భారతీయ మూలవాసులు ఎవరన్నది గ్రహించడానికి డాక్టర్‌ తంగరాజ్‌ స్వయంగా అండమాన్‌ నికోబార్‌ తెగలవారి డిఎన్‌ఎ సేకరించి, అధ్యయనం చేసి విశ్లేషించారు. హరియాణాలో రాఖిగర్హి అనే సింధూ నాగరికతకు సంబంధించిన ప్రాంతం ఉంది. అక్కడ దొరికిన 60 అస్థిపంజరాల నుంచి ఒక పూర్తి జన్యు క్రమాన్ని పరిశోధకులు నిర్మించగలిగారు. ఇది అండమాన్‌ నికోబార్‌ తెగల జన్యు క్రమాన్ని పోలి ఉంది. అంటే హరప్పా ప్రజలకు నికోబార్‌లలో ప్రస్తుతం ఉన్న తెగల వారికి (హంటర్‌ గేదరర్స్‌) దగ్గరి సంబంధాలున్నాయి. వీరి పూర్వీకులే ఒకప్పటి హరప్పా వాసులన్న మాట!
ఇరాన్‌, టర్కీల నుంచి ఐదువేల ఏళ్ల క్రితం యూరప్‌ వైపు మాత్రమే కాకుండా ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు కొందరు వలస వచ్చారని తెలిసింది. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం హరప్పా ప్రాంతంలో నివసించిన ఒక వ్యక్తి జన్యు క్రమాన్ని సిసిఎంబి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌, అతని సహచరులు పునర్నిర్మించారు. అలాగే 524 మంది డిఎన్‌ఎను విశ్లేషించారు. కొన్ని వేల ఏళ్ల క్రితం జీవించిన ఇంతమంది వ్యక్తుల డిఎన్‌ఎ విశ్లేషించడం ఇదే ప్రథమం. హరప్పా ప్రాంతంలో 12 వేల ఏళ్ల నుంచి రెండు వేల ఏళ్ల దాకా అంటే ఇనుపయుగం వరకు జీవించి ఉన్న ప్రజల అవశేషాల నుంచి డిఎన్‌ఎ సేకరించగలిగారు. యూరేషియన్లు అంటే సంచార జాతి ఆర్యులు ఇక్కడి మూలవాసులుకాదు అని మైఖేల్‌ బమ్‌శద్‌ బృందం చెప్పిన విషయం. ఇక్కడ డాక్టర్‌ తంగ్‌రాజ్‌ బృందం చెప్పిన విషయం దాదాపు ఒకటే. నాణానికి ఒక వైపున్న విషయం ఒకరు చెబితే, మరొక వైపున్న విషయం మరొకరు చెప్పారు. దేశంలో అప్పటికే సుసంపన్నంగా ఉన్న సింధూ (హరప్పా) నాగరికతను హింసోన్మాద సంచార జాతి ఆర్యులు ధ్వంసం చేశారు. అది అప్పటికి శాంతి నిలయంగా ఉండేది. చివరికి వారు సప్త సింధు ప్రాంతంలో నివాసాలేర్పురుచుకుని, స్థిరపడి అనేక రకాల సాహిత్యం సృష్టించారు. దాని ప్రకారం బ్రహ్మనుదుటి నుంచి పుట్టిన వారు బ్రాహ్మణులని, వారు మాత్రమే పూజలు చేయాలని, క్షత్రియులు రాజ్యాలేలాలని, వైశ్యులు వ్యాపారాలు చేయాలని, శూద్రులు (ప్రస్థుతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు)పై మూడు వర్గాల వారికి సేవలు చేస్తూ ఉండాలని రాసుకున్నారు.
వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించడానికి ‘మనుస్మృతి’ ని సృష్టించుకున్నారు. శూద్రుల్ని బ్రాహ్మణులు దోచుకోవచ్చనీ చెప్పారు. దానికి న్యాయబద్ధతను కల్పించుకున్నారు. అందుకే ఇప్పటికీ బ్రాహ్మణుడు పూజామంత్రాల్లో తప్పనిసరిగా ‘స్వాహా ’ అని అంటుంటాడు. అంటే ‘నీ సంపద అంతా నాకు రానీయ్‌’ అని కోరుకోవడమన్నమాట. మన ఇంట్లో పూజ చేస్తూనే, మన ఎదుటే మన సంపద అంతా తనకు దక్కాలని ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడన్నమాట. అందుకే ఈ దేశంలో చెప్పులు కుట్టడం, డ్రైనేజీ శుభ్రం చేయడం నీచమైన పనులయిపోయాయి. ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజల ఆరోగ్యం కాపాడే పనులు హీనంగా చూడబడుతున్నాయి. దేనికీ పనికిరానివి, మూర్ఖతంలో ముంచే పనులు పిండాలు పెట్టడం, తద్దినాలకి మంత్రాలు చదవడం వంటి పనులు చాలా ఉన్నతమైన పనులుగా చలామణి అవుతున్నాయి. సమాజానికి ఉపయోగపడేవి ఏవో, ఉపయోగ పడనివి ఏవో ఆలోచించుకునే పనే లేదా? ఆర్యులు సృష్టించిన ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ చివరికి మూలవాసులైన బహుజనుల్ని అధికారానికి, ఆర్థిక సంపదకు దూరం చేసింది. విజ్ఞానానికి, సామాజిక హోదాకు దూరం చేసింది. బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థ బంధాన్ని తెంచుకుని, సమానత్వం కోసమని కొందరు ఇతర మతాల్లోకి మారిన మన మూలవాసుల్ని- —బహుజనుల్ని ప్రస్థుతం విదేశీయులుగా ముద్ర వేస్తున్నారు. అంటే మన చేయితోనే మనం మనకన్ను పొడుచుకునే పనిని కుట్ర పూరితంగా మనతోనే చేయిస్తున్నారన్నమాట!
భారత రాజ్యాంగంతో మనువాద బ్రాహ్మణీయ వ్యవస్థను బద్దలు కొట్టి, అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో బతికే ఏర్పాటు జరిగింది. కానీ, రాజ్యాంగంపై నమ్మకం లేని మనువాదులు ప్రస్థుతం ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉండడంతో సామాజిక న్యాయం అందని ద్రాక్షే అయ్యింది. మూలవాసులైన ఈదేశ బహుజనులు విదేశీయులు కాదు. మధ్య ఆసి యా నుంచి దండెత్తి వచ్చిన ఆర్య మనువాద బ్రాహ్మణ వర్గాలే విదేశీయులు! వైజ్ఞానిక పరిశోధనలన్నీ ఈ విషయాన్నే బలపరిచాయి కదా !
సింధూ నాగరికత చిహ్నాలు, ఆదివాసుల్లో, గోండుల్లో ఇప్పటికీ కనిపిస్తాయి. అలాగే గిరిజనులు రావణుడు, మహిషాసురుడు, నరకుడు తమ పూర్వీకులనుకుని పూజించడం ఉంది, బలి చక్రవర్తి రాజ్యం మళ్లీ రావాలని కేరళలో ‘జనం’ పండుగ చేస్తారు. ఆర్యులు వచ్చి, ఇక్కడి తెగల వారిని చంపి, వాటి చుట్టూ కథలల్లి ఆ ఆదిమ జాతి వారసులి శూద్రులుగా పంచములుగా వెలివేశారు. మన పూర్వీకుల చావుల్ని పండగలని నమ్మించి మన చేత వారనుకున్న పండగలు చేయిస్తున్నారు. అనాలోచితంగా బహుజనులు ఆయా పండగలు చేస్తూనే ఉన్నారు. విశ్వాసం ఎంత గట్టి పడితే అది అంత మూఢమవుతుంది. మూఢ విశ్వాసాలు వదిలేసి బయటపడితేనే నిజాలు నిక్కచ్చిగా తెలుస్తాయి.
కులరహిత భారతీయ మానవ సమాజం రూపుదిద్దుకోవాలంటే తమిళనాడు మహిళ స్నేహ పార్దిబ రాజాను ఆదర్శంగా తీసుకోవాలి, ఎంతో సంఘర్షించి, కుల మతాలు లేని తొలి భారతీయ మహిళగా ఆమె ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్‌ తీసుకోగలిగారు. వాస్తవ పరిస్థితుల్ని తెలియజేస్తూ ప్రధాని మోదీకో ఉత్తరం రాసిన మేధావులు మీద రాజద్రోహం కేసు పెడితే ఇక ప్రజలు ఊరికే చూస్తూ ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. కులం మతం వద్దనేది వాటి మీద అక్కసుతో కాదు, అందరం మనుషులమే నన్న విశాలభావంతో ‘మనిషి’ పట్ల ఉన్న గౌరవంతో, ప్రేమతో..

ట్యాగ్‌లు: Breaking News national Today news