PJ.2.1 Variant: మళ్లీ కరోనా కలవరం.. పలు దేశాలకు విస్తరిస్తున్న కొత్త కరోనా వేరియంట్ PJ.2.1.. ప్రమాదకర లక్షణాలు ఇవే..
Virus
PJ.2.1 Variant: కొవిడ్-19 వైరస్‌కు చెందిన కొత్త వేరియంట్ ‘పీజే.2.1’ (PJ.2.1) ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ను మొదట మే నెలలో కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఇది ఉత్తర అమెరికా, యూరోప్, ఆసియా , ఓషియానియా ఖండాల్లోని అనేక ప్రాంతాలలో విస్తరిస్తుండటంతో, పరిశోధకులు దీని జన్యుపరమైన మార్పులు (Genetic Mutations) , మానవ కణాల్లోకి చొరబడే సామర్థ్యంపై నిశితంగా అధ్యయనం చేస్తున్నారు.
గత నెలలో ప్రముఖ వైద్య పరిశోధనా పత్రిక ‘ఇన్ఫెక్షన్’ (Infection) జర్నల్‌లో ప్రచురితమైన ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఈ పీజే.2.1 వేరియంట్‌కు మానవ కణాల్లోకి సులువుగా ప్రవేశించే సామర్థ్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన క్లినికల్ ఆధారాలు ఇంకా నమోదు కాలేదు. అంతేకాకుండా, ఈ వైరస్‌లోని జన్యు పరిణామాలకు ప్రత్యేకమైన లక్షణాలను శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా గుర్తించలేకపోయారు.
సాధారణ కొవిడ్-19 లక్షణాల మాదిరిగానే ఈ పీజే.2.1 వేరియంట్ సోకిన వారిలో కూడా జ్వరం, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. కాబట్టి కేవలం బాహ్య లక్షణాల ఆధారంగా మాత్రమే అస్వస్థతకు అసలు కారణాన్ని లేదా వేరియంట్‌ను కచ్చితంగా నిర్ధారించడం సాధ్యం కాదని, వైద్య పరీక్షలు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.