Bangladesh Wage Protests: బంగ్లాదేశ్‌లో కార్మికుల ఆందోళనలు హింసాత్మకం.. 500కు పైగా ఫ్యాక్టరీలు మూసివేత.. పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం
Bangladesh Wage Protests
Bangladesh Wage Protests: బంగ్లాదేశ్‌లో ప్రధాన పరిశ్రమ అయిన వస్త్ర తయారీ (Garment Industry) రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల నిరసనలతో దేశంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నెలవారీ కనీస వేతనాన్ని 12,500 టాకాల నుంచి ఏకంగా 30,000 టాకాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రోడ్లపైకి వచ్చారు. దేశ రాజధాని ఢాకా , పారిశ్రామిక ప్రాంతమైన గాజీపూర్‌లలో కార్మికులు నిర్వహించిన ఆందోళనలు హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. నిరసనకారులు పోలీసులతో తలాపడటంతో పాటు పలు చోట్ల రవాణా వ్యవస్థను స్తంభింపజేయడం పారిశ్రామిక రంగాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
ఇటీవల ప్రభుత్వం తమ ఉద్యోగులకు నూతన వేతన విధానాన్ని ప్రకటించి, జీతాలు , ఇతర లబ్ధులను దాదాపు రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురైన వస్త్ర పరిశ్రమ కార్మికులు తమ డిమాండ్లను తెరపైకి తెచ్చారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రస్తుతం తమకు లభిస్తున్న 12,500 టాకాల కనీస వేతనం ఎంతమాత్రం సరిపోవడం లేదని, దానిని తక్షణమే 30,000 టాకాలకు సవరించాలని పట్టుబట్టారు.
నవంబర్ 1న ప్రారంభమైన ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చి ఢాకాలోని మీర్పూర్, అగర్గావ్ , గాజీపూర్‌లోని కొనాబరి, భోగ్రా, నౌజోర్, సఫీపూర్, మౌచాక్ ప్రాంతాలకు విస్తరించింది. మీర్పూర్-10 కూడలిని కార్మికులు దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గాజీపూర్ ప్రాంతంలో ఢాకా-టాంగైల్, ఢాకా-మైమెన్ సింగ్ జాతీయ రహదారులపై టైర్లు, కర్రలను తగలబెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. భద్రతా బలగాలపై నిరసనకారులు రాళ్లు, ఇటుకలు విసరడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి సౌండ్ గ్రెనేడ్లతో వారిని చెదరగొట్టే యత్నం చేశారు.
ఆందోళనలు హద్దులు దాటడంతో కొనాబరి , పరిసర ప్రాంతాల్లోని పలు వస్త్ర తయారీ ఫ్యాక్టరీలకు నిరసనకారులు నిప్పంటించారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనాలను, సిబ్బందిని సైతం అడ్డుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా నివేదించింది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో పోలీస్ అవుట్‌పోస్టులపై దాడులు జరిపి వాహనాలకు నిప్పంటించడంతో పరిస్థితి చేయిదాటింది. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాలైన ‘బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్’ (BGB) బలగాలను రంగంలోకి దించి పారిశ్రామిక ప్రాంతాల్లో కవాతు నిర్వహించింది.