Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Cyclone Arnab Landfall: ఏపీని అతలాకుతలం చేస్తూ తీరం దాటిన అర్ణబ్ తుఫాను.. ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ కీలక సూచనలు..

jagan 28 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Cyclone Arnab Landfall: ఏపీని అతలాకుతలం చేస్తూ తీరం దాటిన అర్ణబ్ తుఫాను.. ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ కీలక సూచనలు..

YS Jagan Slams Government

Cyclone Arnab Landfall: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్ణబ్’ అతి తీవ్ర తుపాను బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. సుమారు ఆరు గంటలకు పైగా సాగిన ఈ సుదీర్ఘ తీరం దాటే ప్రక్రియతో కోస్తాంధ్ర ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులు, కొన్ని చోట్ల గరిష్ఠంగా 150 కిలోమీటర్లకు చేరిన ఈదురుగాలులు , కుండపోత వర్షాల ధాటికి కోస్తా జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది.

భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం.. యానాం సమీపంలో ఈ తుపాను తీరాన్ని దాటింది. తీరం దాటిన అనంతరం ఉదయం 8:30 గంటలకు ఇది అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా క్రమంగా బలహీనపడింది. ఉదయం 9:50 గంటల సమయానికి తీరం దాటే ప్రక్రియ సంపూర్ణంగా ముగిసిందని, ఈ తుపాను కేంద్రం ప్రస్తుతం నర్సాపురానికి 20 కిలోమీటర్ల తూర్పున, యానాంకు 40 కిలోమీటర్ల నైరుతిన కేంద్రీకృతమై ఉందని ఐఎండీ బులెటిన్‌లో పేర్కొంది.

తుపాను ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం 8:30 గంటల సమయానికి అత్యధికంగా విశాఖపట్నంలో 315 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, విజయనగరంలో 301 మి.మీ, అనకాపల్లిలో 275 మి.మీ, శ్రీకాకుళంలో 257 మి.మీ , కృష్ణా జిల్లాలో 223 మి.మీ చొప్పున కుంభవృష్టి వర్షం కురిసింది. అలాగే పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని కోరాపుట్‌లో 188 మి.మీ, గంజాంలో 161 మి.మీ వర్షపాతం నమోదైంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలోని ప్రమాదకర తీరప్రాంతాల నుంచి దాదాపు 1.80 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు.

బలమైన గాలుల ధాటికి వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముందుజాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడమే కాకుండా రవాణా వ్యవస్థపై తీవ్ర ఆంక్షలు విధించారు. భోగాపురం విమానాశ్రయానికి చెందిన 28 సర్వీసులతో పాటు గన్నవరం (విజయవాడ), విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి నడవాల్సిన పలు విమానాలను , 100కు పైగా రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

ఈ విపత్తు సమయంపై స్పందించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రాణనష్టాన్ని నివారించడానికే ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని, బాధితులకు పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు , మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నష్టపోయిన రైతులకు పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ శ్రేణులు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు.