Russian Diesel Deal: పుతిన్‌కు తలొగ్గిన ట్రంప్.. రష్యా నుంచి డీజిల్ కొనుగోలుకు అమెరికా ఒప్పందం.. ఉక్రెయిన్ నుంచి తీవ్ర విమర్శలు
Russian Diesel Deal
Russian Diesel Deal: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.చమురు సంక్షోభం దూసుకొస్తున్న నేపథ్యంలో రష్యా నుండి డీజిల్ కొనుగోలు చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. నవంబర్ మాసంలో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పెరిగిన ఇంధన ధరలను అదుపు చేసేందుకు ఆయన అత్యవసరంగా ఈ ఇంధన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ద్వారా ఈ వివరాలను వెల్లడించిన ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపిన చర్చలు అత్యంత ఫలప్రదంగా ముగిశాయని స్పష్టం చేశారు.
ఈ నూతన ఒప్పందం ప్రకారం, రష్యా తక్షణమే మూడు లక్షల టన్నుల డీజిల్‌ను అమెరికా, ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేయడానికి అంగీకరించింది. దీనికి తోడు నవంబర్ నెలలో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత 10 లక్షల టన్నులు మరియు తదనంతర కాలంలో మరో 30 లక్షల టన్నుల డీజిల్‌ను దశలవారీగా రష్యా సరఫరా చేయనుందని ట్రంప్ వివరించారు. అమెరికాలో లీటరు డీజిల్ ధరలు దాదాపు 150 మార్కుకు చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని, హార్ముజ్ జలసంధి పరిణామాలు మరియు రష్యాతో కుదిరిన ఈ డీల్ వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు రికార్డు స్థాయిలో వేగంగా తగ్గుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అయితే, గతంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై (ముఖ్యంగా భారత్ వంటి దేశాలపై) భారీ పన్నులు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్, ఇప్పుడు స్వయంగా అమెరికా అవసరాల కోసం రష్యాపై ఆధారపడటం ప్రపంచ రాజకీయంలో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. పుతిన్‌తో కుదుర్చుకున్న ఈ డీల్ శాంతిని పునరుద్ధరించదని, ఇది రష్యాకు ఇచ్చిన పెద్ద బహుమతి లాంటిదని విమర్శించారు. డీజిల్ విక్రయాల ద్వారా వచ్చే నిధులతో రష్యా ఉక్రెయిన్‌పై మరింత భీకరంగా దాడులకు తెగబడుతుందని, ఇది యుద్ధాన్ని ముగించకపోగా మరింత కాలం సాగేలా చేస్తుందని జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.