CJP Protest 2026: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఆందోళన.. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, తుషార్ గాంధీ సహా పలువురు కీలక నేతల అరెస్టు..
Editorial: మమత, సిపిఐ(ఎం) దగ్గరవటం సాధ్యమా?
CJP Protest 2026: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన నిరసనకు వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీల అగ్రనేతలు, సామాజిక కార్యకర్తలు సంఘీభావం తెలపడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రధాన నగరాల్లో రాజకీయ వేడి తీవ్రస్థాయికి చేరింది. అయితే, ఈ ఆందోళనల్లో పాల్గొనడానికి యత్నించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం అగ్రనేతలు, , మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సహా పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని సౌత్ అవెన్యూ పరిసరాల్లో బస్ స్టాప్ వద్ద టిఎంసి ఎంపీలతో కలిసి నిరసన తెలుపుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు పార్టీ సీనియర్ నాయకులు డెరెక్ ఓ’బ్రియన్, ప్రతిమా మండల్, డోలా సేన్‌లను కూడా పోలీసులు వాహనాల్లోకి తరలించారు. మరోవైపు, నిరసన ప్రదేశానికి బయలుదేరేందుకు 95 లోధి ఎస్టేట్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు అ ఇంటి ముందే అదుపులోకి తీసుకున్నారు. ఆప్ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్ , గోపాల్ రాయ్‌లను కూడా పోలీసులు వేర్వేరు చోట్ల కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే చండీగఢ్‌లో చేపట్టిన ఆందోళన ప్రదర్శనలో పాల్గొన్న ఆప్ నేత మనీష్ సిసోడియాను కూడా స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నిరసన సెగ జంతర్ మంతర్ పరిసరాల్లోనూ స్పష్టంగా కనిపించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ, సీనియర్ నాయకురాలు బృందా కరత్ , వామపక్ష విద్యార్థి విభాగం నాయకురాలు నేహా బోరా కేరళ భవన్ నుంచి జంతర్ మంతర్‌కు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని బస్సుల్లో సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఢిల్లీతో పాటు ముంబైలోనూ నిరసన సెగలు వ్యక్తమయ్యాయి. ‘హమ్ భారత్ కే లోగ్’ సంస్థ అధిపతి, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆయనను బాంద్రాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రధాన విపక్ష నేతలందరినీ ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.