Skip to content
తెలంగాణ › వార్తలు

TGSRTC Elections 2026: ముగిసిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్.. అక్టోబర్ 17న తుది ఫలితాలు.. ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న ఈయూ కూటమి..

jagan 10 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
TGSRTC Elections 2026: ముగిసిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్.. అక్టోబర్ 17న తుది ఫలితాలు.. ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న ఈయూ కూటమి..

TGSRTC

TGSRTC Elections 2026: తెలంగాణలో సుదీర్ఘకాలం అంటే దశాబ్ద కాలం తర్వాత అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల తుది ఘట్టం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో కార్మికులు ఉత్సాహం ప్రదర్శిస్తూ ఏకంగా 98 శాతం పోలింగ్‌ను నమోదు చేశారు. బరిలో నిలిచిన ప్రధాన కూటములలో ఏఐటీయూసీ (AITUC) అనుబంధ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (EU) కూటమి విజయమే లక్ష్యంగా దూసుకెళ్తోంది.

మొత్తం 11 రీజియన్లలో ఇప్పటివరకు ఎనిమిదింటిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికాగా, అందులో 5 రీజియన్లలో ఈయూ కూటమి, 3 రీజియన్లలో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ విజయాలు సాధించాయి. ప్రస్తుత సరళి పూర్తిగా తమకే అనుకూలంగా ఉండటంతో ఈయూ కూటమి నాయకులు తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దూర ప్రాంత సర్వీసులకు విధుల్లో ఉన్న సిబ్బంది ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఆ ఓట్ల సంఖ్య వందలలోనే ఉండటం వల్ల ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపబోదని ఈయూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారిక ఫలితాలు ఈ నెల 17న వెలువడనున్నాయి.

ఇదిలా ఉంటే, ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు అందించిన తెలంగాణ వర్కర్స్ యూనియన్‌కు కార్మికులు గట్టి షాక్ ఇవ్వడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అనూహ్య ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఎన్నికల సరళిపై ప్రత్యేక నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం.

ప్రాథమిక నివేదికల ప్రకారం.. కొన్ని జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలను లైట్ తీసుకోవడం, సొంత పార్టీ నేతలే ప్రత్యర్థి యూనియన్‌కు మద్దతు ఇవ్వడం వల్లనే ఈ పరిణామం ఎదురైందని తెలుస్తోంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పెద్దగా పట్టించుకోలేదని విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 26 యూనిట్లలో కేవలం 3 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ బలపడిన యూనియన్ గెలవడంతో అధికార పార్టీలో అంతర్మథనం మొదలైంది.