Skip to content
జాతీయం › వార్తలు

Supreme Court: ఢిల్లీ నిరసనలపై ఆంక్షలు.. పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ

Krishna Rao 11 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Supreme Court: ఢిల్లీ నిరసనలపై ఆంక్షలు.. పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ

Supreme Court

Supreme Court: ఢిల్లీలో సీజేపీ నిరసనలపై ఆంక్షలు, మెట్రో రైళ్లు, రైలు సర్వీసుల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగిందంటూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఆదివారం సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ చేపట్టనుంది.


Supreme Court: కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నిరసనల నేపథ్యంలో దేశ రాజధానిలో విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టనుంది. అక్టోబర్‌ 9న మెట్రో, రైలు సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అక్టోబర్‌ 11వ తేదీకి సంబంధించిన కేసుల జాబితా ప్రకారం.. జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.

న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ కుమార్‌, ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (DMRC) చైర్‌పర్సన్‌ డి. తారాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

పౌరుల ప్రాథమిక హక్కులపై దాడి: పిటిషనర్‌

పౌరుల ప్రాథమిక హక్కులపై జరిగిన ఈ దాడి, సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా పట్టించుకోకపోవడం తీవ్రమైన విషయమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో, ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరించాయని ఆరోపిస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఢిల్లీకి వచ్చే రైళ్లను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అక్టోబర్‌ 9న ఇచ్చిన ఆదేశాలను తాజా పిటిషన్‌లో ప్రస్తావించారు.

రైళ్లు, మెట్రో రాకపోకలను పూర్తిగా నిలిపివేయొద్దు

శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బాగ్చి, జస్టిస్‌ మోహనలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. అక్టోబర్‌ 10న ఢిల్లీకి వచ్చే మెట్రో రైళ్లు, ఇతర రైళ్ల రాకపోకలను పూర్తిగా నిషేధించకుండా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. అన్ని రవాణా సేవలను నిలిపివేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

అల్లకల్లోల పరిస్థితులను నియంత్రించేందుకు చట్టాన్ని అమలు చేసే సంస్థలు చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. అయితే, ఆ పేరుతో సామాన్య పౌరులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేయకూడదని వ్యాఖ్యానించింది.

భద్రతా కారణాలతో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 45 మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో ప్రకటించింది.

కోర్టు ఆదేశాలున్నా ఆంక్షలు కొనసాగించారని ఆరోపణ

సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉన్నప్పటికీ.. రవాణా మార్గాలపై విస్తృత ఆంక్షలను అధికారులు కొనసాగించారని పిటిషనర్‌ ఆరోపించారు. అవసరం లేని రైళ్ల రద్దులను కొనసాగించడంతో పాటు, ట్రాఫిక్‌, రవాణా సేవలకు సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని ప్రజలకు అందించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.

ఈ పరిమితుల కారణంగా జాతీయ రాజధాని ప్రాంతంలో సాధారణ ప్రజాజీవనం తీవ్రంగా ప్రభావితమైందని పిటిషన్‌లో తెలిపారు. ఇది న్యాయస్థానం అధికారాన్ని బలహీనపరిచే ప్రయత్నమని ఆరోపించారు. దేశ రాజధానిలో చట్టబద్ధమైన వ్యవస్థ పనిచేయని పరిస్థితులను అధికారులు ఉద్దేశపూర్వకంగా సృష్టించారని పిటిషనర్‌ పేర్కొన్నారు.

అక్టోబర్‌ 9న ఇచ్చిన ఆదేశాలను కావాలనే ఉల్లంఘించారన్న ఆరోపణలపై ప్రతివాదులపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని కోరారు. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ప్రతివాదులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా నోటీసులు జారీ చేయాలని, కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు వారిని ఎందుకు శిక్షించకూడదో వివరించాలని ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

ప్రజా రవాణాపై పూర్తి నిషేధం వద్దన్న సుప్రీంకోర్టు

అక్టోబర్‌ 9న ఇచ్చిన ఉత్తర్వుల్లో, సంబంధిత నోటిఫికేషన్లు ప్రజలకు అవసరమైన రవాణా సేవలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. మెట్రో, రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం, వాటి రాకపోకలను నియంత్రించడం రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేసింది.

ఆంక్షలను మరోసారి సమీక్షించాలని అధికారులను కోరుతామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఇచ్చిన హామీని ధర్మాసనం నమోదు చేసింది. మెట్రో రైళ్ల రాకపోకలపై పూర్తిస్థాయి నిషేధం ఉండకూడదని స్పష్టం చేస్తూనే, తగిన నియంత్రణలతో సేవలను కొనసాగించేందుకు అనుమతించింది.

ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రవాణా సేవల నిర్వహణపై తీసుకునే నిర్ణయాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఆదివారం విచారించనుంది.

ట్యాగ్‌లు: Supreme Court