Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

బిసి రిజర్వేషన్‌లపై ఎపిలో నిందాక్రీడ

Prajapaksham 10 Oct 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
బిసి రిజర్వేషన్‌లపై ఎపిలో నిందాక్రీడ

Supreme Court

స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బిసిలు) రిజర్వేషన్‌ను 24 నుంచి 34 శాతానికి పెంపుదల చేస్తూ తెలుగుదేశం జనసేన బిజెపిలతో కూడిన ఎన్‌డిఎ ప్రభుత్వం జారీచేసిన జిఒపై నెలరోజులపైబడి జరుగుతున్న రాజకీయ రభసకు తెరపడింది. 34 శాతం రిజర్వేషన్‌లు కల్పించటంవల్ల మొత్తం రిజర్వేషన్‌లు 50శాతం మించరాదని సుప్రీంకోర్టు విధించిన లక్ష్మణ రేఖను ఉల్లంఘించినట్లవుతుందని, అందువల్ల ప్రభుత్వం జిఒ చెల్లుబాటుకాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పుచెప్పటంతో రాష్ట్రంలో మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ ఎన్నికల నిర్వహణకు లైన్‌క్లియర్‌ అయింది. శనివారం జరిగే మంత్రివర్గ అత్యవసర సమావేశం ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అయినా బిసి రిజర్వేషన్‌లపై కూటమి ప్రతిపక్ష వైఎస్సార్‌ సిపి మధ్య నిందాక్రీడ కొనసాగుతూనే ఉంది. రెండుపార్టీల మధ్య (టిడిపి రాజకీయ నిందాక్రీడలో బిసి రిజర్వేషన్‌ అంశం ఒకటి. బిసిల ఉద్ధారకులం తామంటే తామని క్లెయిం చేసుకుంటూ ఎదుట
పక్షాన్ని నిందిస్తుంటాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనానంతరం పరిశేష రాష్ట్రంలో 2015లో అధికారంలోకి వచ్చిన టిడిపి చంద్రబాబునాయుడు నాయకత్వంలో స్థానిక ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్‌ను 34 శాతానికి పెంచుతూ చట్టం చేసింది. 2020లో అధికారంలోకి వచ్చిన వైసిసి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించబోగా ఆ చట్టం చెల్లుబాటును 50శాతం లక్ష్మణరేఖ అతిక్రమణ కారణంతో హైకోర్టు కొట్టివేసింది. అప్పుడు 24శాతం రిజర్వేషన్‌తో ఎన్నికలు జరిపారు. 2024లో కూటమి ప్రభుత్వంగా తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు బిసి జనాభా సంఖ్య నిర్ణయానికై 2026 ఫిబ్రవరి 19న రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా చైర్మన్‌గా డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించారు. బిసిల రిజర్వేషన్‌ను పంచాయతీరాజ్‌ సంస్థల్లో 34శాతానికి, మున్సిపల్‌ సంస్థల్లో 33.33 శాతానికి పెంచుతూ 2026 ఆగస్టు 18న జిఒ జారీచేసి, 24 శాతానికి తగ్గించిన గత ప్రభుత్వాన్ని నిందిస్తూ, తానే బిసిల ఛాంపియన్‌గా ప్రచారం చేసుకున్నారు. అసలు బిసిలకు రిజర్వేషన్‌ కల్పించిందే ఎన్‌.టి.రామారావు గనుక వారి పుట్టిల్లు తమదేనన్నారు. అయితే హైకోర్టులో, సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. మొత్తం రిజర్వేషన్‌ల పరిమితి 50శాతం దాటితే ఆ రిజర్వేషన్‌ను కోర్టులు కొట్టివేస్తాయని చంద్రబాబు నాయుడికి తెలియదా? తెలుసు. డెడికేటెడ్‌ కమిషన్‌ను చూపుతూ 34శాతం రిజర్వేషన్‌ ఇచ్చేది తామేనని బిసిలను దగ్గరకు తీసుకోవటానికి ఆయన ఈ కాలాన్ని ఉపయోగించుకున్నారు. ప్రత్యర్థి పార్టీని బిసి ద్రోహిగా నిందించారు. వైసిపి ఎదురుదాడి చేస్తూ చంద్రబాబును మోసకారిగా దాడి చేస్తోంది. ఆ విధంగా రెండు పార్టీలు తమ కార్యకర్తల్లో ఎన్నికలకు అవసరమైన రాజకీయ వేడి రగిలించాయి.
తెలంగాణ ప్రభుత్వం మరింత లోతుగా, శాస్త్రీయంగా బిసి జనగణన నిర్వహించింది. అయినా కేంద్రప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామీణాభివృద్ధికి ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు కోల్పోయే ప్రమాదం ఉన్నందున గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఎంపిటిసి, జడ్‌పిటిసి, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు బాకీ ఉన్నాయి.
రాష్ట్రం ఏదైనా, అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా రెండు అంశాలు లోతుగా చర్చనీయాంశాలు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు మూడవ దొంతర పరిపాలనా సంస్థలని, వాటికి కూడా లోక్‌సభ, అసెంబ్లీలవలె ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలని 73, 74 రాజ్యాంగ సవరణలు జరిగినా, అవి ఆచరణకు నోచుకోవటం లేదు. పాలక పార్టీలు తమకు అనుకూల సమయం కోసం కాలయాపన చేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు ఒడిగడుతున్నాయి. స్థానిక సంస్థల ఓటర్ల సవరణ, రిజర్వేషన్‌ల ఖరారు వంటి అంశాలు వాటిచేతిలో ఉన్నందున, ఏదోక అంశంపై ఎవరో ఒకరిచేత కోర్టు కేసులు వేయించి ఎన్నికలు జాప్యం చేస్తూ, అధికారుల ద్వారా పాలన నిర్వహిస్తున్నాయి. దీనికి ముగింపు పలికే మార్గం పార్లమెంటు ఆలోచించాలి.
రెండు, జనాభా దామాషాలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లకై బిసి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అందుకోసమే తాజా జనాభా లెక్కల సేకరణలో బిసిల గణన చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జనగణనలో కులగణనకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ దానిపై స్పష్టత రావాల్సి ఉంది. రెండోవైపున, మొత్తం రిజర్వేషన్‌లు 50 శాతం దాటరాదన్న సుప్రీంకోర్టు ఆంక్ష ఆటంకంగా కొనసాగుతోంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో బిసిలకు రిజర్వేషన్‌ లేదు. మహిళా రిజర్వేషన్‌లో ఒబిసి మహిళలకు కోటా కోసం లాలుప్రసాద్‌ ఒత్తిడి చేసినపుడు ఆ అంశం ఆటంకంగా ముందుకు వచ్చింది. ఆ సమస్యే యుపిఎ ప్రభుత్వ హయాంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదాన్ని నిరోధించింది. మండల్‌ కమిషన్‌ జనాభాలో ఒబిసిలు 50 శాతంపైగా ఉంటారని అంచనా వేసి కూడా, మొత్తం రిజర్వేషన్‌లు 50శాతం దాటకూడదనే సుప్రీంకోర్టు ఆంక్ష
కారణంగా విద్య, ఉద్యోగాల్లో 27శాతం రిజర్వేషన్‌ను సిఫారసు చేసినట్లు చెప్పటం గుర్తుచేసుకోదగింది. అందువల్ల బిసిల ఓట్లకోసం వారిపట్ల ఎవరెంత సహానుభూతి ప్రదర్శించినా ఇది అఖిలభారత సమస్య. ఒబిసిలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంకోరే రాజకీయ శక్తులు ఏకత్రాటిపైకి వచ్చి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏకాభిప్రాయ సాధనతో రాజ్యాంగ సవరణ చేయించటమే ఉత్తమమార్గం.
ఒక రాష్ట్ర జనాభా పొందికను బట్టి ప్రత్యేక కమిషన్‌ను నియమించి ఒబిసిల జనాభా లెక్కలు కచ్చితంగా తేల్చి, రిజర్వేషన్‌ శాతంపై అసెంబ్లీలో చట్టం చేసి, దానికి రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ 9వ షెడ్యూలులో చేర్చేటట్లు చేయటం మరోమార్గం. దీనికి పార్లమెంటు ఆమోదం అవసరం. కావున ఇది ఎంతో కష్టతరమైన మార్గం.