Nana Patekar Dies: తీవ్రమైన గుండెపోటుతో బాలీవుడ్ దిగ్గజం నానా పటేకర్ కన్నుమూత.. 45 నిమిషాలు CPR చేసినా దక్కని ఫలితం..
Nana Patekar
Nana Patekar Dies: భారతీయ సినీ రంగంలో తన విలక్షణ నటన, గంభీరమైన స్వరం, శక్తివంతమైన సంభాషణలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయనకు తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ సంభవించింది. అనంతరం కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో ఉదయం 5.20 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని మణిపాల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ శేఖర్ సల్కర్ వెల్లడించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
నానా పటేకర్ ఆకస్మిక మరణంతో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో హీరోగా మాత్రమే కాకుండా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. బలమైన భావోద్వేగాలను తెరపై సహజంగా పలికించే నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అగ్నిసాక్షి’, ‘ఖామోషీ: ది మ్యూజికల్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్‌కమ్’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా ఆయన సంభాషణలు చెప్పే ప్రత్యేక శైలి, పాత్రకు తగ్గట్టుగా భావోద్వేగాలను వ్యక్తీకరించే తీరు ఆయనను ఇతర నటుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి.
నానా పటేకర్ సినీ ప్రస్థానం 1978లో వచ్చిన ‘గమన్’ చిత్రంతో ప్రారంభమైంది. అనంతరం హిందీ, మరాఠీ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ అగ్రశ్రేణి నటుడిగా ఎదిగారు. ‘క్రాంతివీర్’ చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. ‘పరిందా’, ‘అగ్నిసాక్షి’ చిత్రాలకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. నటనతో పాటు ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ వంటి చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన చేసిన విభిన్న పాత్రలు భారతీయ సినిమాలో క్యారెక్టర్ నటనకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి.
సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ నానా పటేకర్ చురుకుగా పాల్గొన్నారు. మహారాష్ట్రలో కరువు, వ్యవసాయ సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతు కుటుంబాలకు సహాయం చేయడానికి ‘నామ్ ఫౌండేషన్’ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రైతులకు ఆర్థిక సహాయం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడటం వంటి కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యమయ్యారు. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఆయన మరణవార్త వెలువడిన వెంటనే అభిమానులు, సినీ ప్రముఖులు, సహనటులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. నానా పటేకర్ మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా పలువురు పేర్కొంటున్నారు. ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ మరణాన్ని ధ్రువీకరించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. కుటుంబం తరఫున పూర్తి వివరాలతో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుతం ఆయన మృతదేహానికి సంబంధించిన వైద్య, చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించేందుకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.