Chicken Prices May Surge: భారీగా పెరగనున్న చికెన్, కోడిగుడ్ల ధరలు.. కిలో చికెన్ రూ.500 దాటే అవకాశం!
Chicken Prices May Surge
Chicken Prices May Surge: మాంసం ప్రియులకు, ముఖ్యంగా చికెన్, కోడిగుడ్లను ఇష్టపడేవారికి రాబోయే రోజుల్లో పెద్ద షాక్ తగలనుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.250 వరకు ఉన్న చికెన్ ధర త్వరలోనే ఏకంగా రూ.400 నుంచి రూ.500 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని, అలాగే కోడిగుడ్డు ధర కూడా రిటైల్ మార్కెట్లో రూ.20 నుంచి రూ.25 వరకు చేరుకోవచ్చని పౌల్ట్రీ రంగ నిపుణులు , రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంధన విధానాలు , మారుతున్న వాతావరణ పరిస్థితులే ఈ అనూహ్య ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని వారు విశ్లేషిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడాన్ని (E20 లక్ష్యం) వేగవంతం చేయడంలో భాగంగా ఇథనాల్ ఉత్పత్తి కోసం మొక్కజొన్నను భారీగా వినియోగిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా జరుగుతున్న ఇథనాల్ ఉత్పత్తిలో మొక్కజొన్న వాటా ఏకంగా 37 శాతానికి చేరుకుంది. మరోవైపు కోళ్ల దాణా తయారీలో కూడా 55 నుంచి 60 శాతం వరకు మొక్కజొన్ననే ప్రాథమికంగా వినియోగిస్తారు. దీంతో ఇటు ఇంధన రంగానికి, అటు పౌల్ట్రీ రంగానికి మొక్కజొన్న అత్యంత అవసరంగా మారడంతో మార్కెట్లో దీనికి విపరీతమైన పోటీ , డిమాండ్ ఏర్పడింది. ఐదేళ్ల క్రితం కిలో రూ.14 నుంచి రూ.15 వరకు ఉన్న మొక్కజొన్న ధర ప్రస్తుతం రూ.25 నుంచి రూ.28కి, కొన్ని చోట్ల రూ.32 వరకు పెరిగింది. పౌల్ట్రీ నిర్వహణ వ్యయంలో దాదాపు 65 నుంచి 70 శాతం కేవలం కోళ్ల దాణాకే ఖర్చవుతుండటంతో, ఈ పెరిగిన భారమంతా నేరుగా చికెన్ , గుడ్ల రిటైల్ ధరలపై పడుతోంది.
ఈ ఇథనాల్ డిమాండ్ పోటీకి తోడు ‘ఎల్ నినో’ ప్రభావం పౌల్ట్రీ రంగాన్ని మరింత దెబ్బతీస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు , బలహీనమైన రుతుపవనాల కారణంగా ఈ ఏడాది దేశంలో మొక్కజొన్న దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. సాధారణంగా దేశీయంగా పండే మొక్కజొన్న పంటలో 60 శాతాన్ని పౌల్ట్రీ రంగమే వినియోగించుకుంటుంది. అయితే ఇప్పుడు ఒకవైపు ఇథనాల్ పరిశ్రమల నుంచి పోటీ పెరగడం, మరోవైపు ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడి తగ్గే సూచనలు కనిపిస్తుండటంతో సరఫరా వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.
ఇప్పటికే గత ఏడాది కాలంలో గుడ్ల ధరలు 35 నుంచి 40 శాతం వరకు పెరిగాయి. పౌల్ట్రీ ఫామ్‌ల వద్దే గుడ్డు ధర రూ.6కు చేరగా, బహిరంగ రిటైల్ మార్కెట్లో వినియోగదారులకు రూ.7 నుంచి రూ.9 వరకు విక్రయిస్తున్నారు. రాబోయే శీతాకాలంలో చికెన్, గుడ్లకు డిమాండ్ మరింత పెరుగుతుంది కాబట్టి ధరలు సరికొత్త రికార్డులను తాకడం ఖాయమని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఈ తీవ్ర సంక్షోభాన్ని నివారించడానికి ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని దేశంలో మొక్కజొన్న సాగును ప్రోత్సహించాలని, లేదా ఇథనాల్ తయారీకి ఇతర ప్రత్యామ్నాయాలను వినియోగించేలా చూడాలని పౌల్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ఇంధన అవసరాల కంటే ముందు దేశీయ ఆహార భద్రతకే కేంద్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- Prakash Raj SIR Remarks: పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న.. ‘ప్రజల పక్షాన ఉంటారా? ఎన్నికల సంఘం పక్షాన ఉంటారా?’
- Dussehra 2026: నవరాత్రుల్లో అమ్మవారి 9 అవతారాలు ఇవే.. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు ఒక్కో రూపం విశిష్టత గురించి తెలుసా..
- Andhra Pradesh Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధరాత్రి 17.20 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? పరకాల ప్రభాకర్ సంచలన విశ్లేషణ..పూర్తి వివరాలు ఇవే..
- Rahul Gandhi Satyagraha: దేశవ్యాప్త ఉద్యమాలకు డిజిటల్ వేదిక.. ‘సత్యాగ్రహ’ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ
- Telangana Express Turns 50: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ దాకా .. ఐదు దశాబ్దాల ప్రస్థానం..