Skip to content
జాతీయం › వార్తలు

CEC Gyanesh Kumar: సిసిఈ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో క్రిమినల్ పిటిషన్.. 13 కోట్ల ఓట్ల తొలగింపుపై సిట్ విచారణకు డిమాండ్..

jagan 25 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CEC Gyanesh Kumar: సిసిఈ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో క్రిమినల్ పిటిషన్.. 13 కోట్ల ఓట్ల తొలగింపుపై సిట్ విచారణకు డిమాండ్..

Supreme Court

CEC Gyanesh Kumar: కేంద్ర ఎన్నికల సంఘం (ECI)లో నడుస్తున్న వివాదం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సంచలన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో తీసుకున్న పలు ఏకపక్ష నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ పిటిషన్‌లో ప్రధానంగా ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల ఆమోదం లేకుండా సీఈసీ జారీ చేసిన మార్గదర్శకాలు, ఆదేశాలు, సాఫ్ట్‌వేర్ మార్పులను రద్దు చేయాలని కోరారు. ఓటరు నమోదుకు ఉపయోగించే ‘ఫారం-6’లో చేసిన సవరణలను నిలిపివేసి, పాత విధానాన్నే పునరుద్ధరించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సుమారు 13 కోట్ల ఓట్లను తొలగించారన్న తీవ్రమైన ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ద్వారా నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీశ్ గార్గ్, ఈసీ ఐటీ విభాగం అధిపతి సీమా ఖన్నాలపై ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 32 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గడిచిన 10 నెలల్లో 14 సందర్భాల్లో ఇద్దరు ఈసీలు వ్యక్తం చేసిన లిఖితపూర్వక అభ్యంతరాలను తొక్కిపెట్టి నిర్ణయాలు తీసుకున్నారన్న మీడియా నివేదికలను పిటిషన్‌లో ఉటంకించారు. కాగా, ఈ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల కమిషన్, కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే తుది నిర్ణయాలన్నీ రాజ్యాంగబద్ధమైన ఏకాభిప్రాయంతోనే జరిగాయని తెలిపింది. ప్రస్తుతం దాఖలు దశలో ఉన్న ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది.