పెరిగిన ద్రవ్యోల్బణం తగ్గిన జీవన ప్రమాణం
Inflation
ఐరోపాలో యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తత, పైపైకి పోతున్న అంతర్జాతీయ ముడిచమురు ధరలు, వర్షాభావ పరిస్థితులు, ఆగని రూపాయి మారక విలువ పతనం వంటి పలు అంశాలు ఆర్థిక శాస్త్రవేత్తల చర్చల్లో వినిపించే పదాలుగా కనిపించవచ్చు. కానీ సామాన్యుడి జీవితంలో వీటి అర్థం చాలా సూటిగా ఉంటుంది. జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మార్కెట్‌కు వెళ్లినప్పుడు అదే సరుకుకు ఎక్కువ డబ్బు చెల్లించాలి. వంటింటి ఖర్చు పెరుగుతుంది. ప్రయాణ ఖర్చు పెరుగుతుంది. చిన్న వ్యాపారి ఖర్చు పెరుగుతుంది. చివరికి కుటుంబ బడ్జెట్లో మిగిలే మొత్తం తగ్గుతుంది. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఆగస్టు మాసానికి చెందిన ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ ప్రమాదాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జులైలో 9.78 శాతం ఉండగా, ఆగస్టులో 9.92 శాతానికి పెరిగింది. ప్రజల జీవన ప్రమాణాన్ని దారుణంగా తగ్గించింది. ఆహార పదార్థాలు, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. ముఖ్యంగా ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 20.05 శాతం నుంచి 22.93 శాతానికి ఎగబాకడం ఆందోళన కలిగించే అంశం. అదే సమయంలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ (సిపిఐ) జులైలో 4.45 శాతం నుంచి ఆగస్టులో 4.82 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 5.52 శాతం నుంచి 5.95 శాతానికి చేరింది. ఉల్లిపాయ ధరల పెరుగుదల ఏకంగా 48.27 శాతానికి చేరింది. వెల్లుల్లి 43.6 శాతం, అల్లం 73.82 శాతం ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. టమాటా, బంగాళాదుంప వంటి కొన్ని కూరగాయల ధరలు తగ్గినా, వంటింటి మొత్తం ఖర్చుపై ఒత్తిడి తగ్గడానికి అది సరిపోలేదు. ఈ గణాంకాల్లో అత్యంత ముఖ్యమైన విషయం రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత ఉందన్నది అనేదాని కంటే, హోల్‌సేల్ ధరల ఒత్తిడి రేపటి రిటైల్ ధరలకు ఏ సంకేతం ఇస్తుందన్నదే ప్రధానం. తయారీ వస్తువుల హోల్‌సేల్ ద్రవ్యోల్బణం కొత్త సిరీస్‌లోనే అత్యధికంగా 8.37 శాతానికి చేరింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగితే భారతదేశం వంటి భారీ దిగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తప్పదు. ముడిచమురు ధర పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలకే పరిమితం కాదు. రవాణా, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమ, విమానయానం, ప్లాస్టిక్, రసాయనాలు దాదాపు ప్రతి రంగం మీద, చివరికి సామాన్యుడి భుజాలపై పడుతుందనేది బహిరంగ రహస్యం. ధరలు పెరుగుతున్నంత వేగంగా ఆదాయాలు పెరగవు. జీతాలు పెరగవు. కుటుంబ అవసరాలు తగ్గవు. ఫలితంగా జీవన ప్రమాణాలు దారుణంగా పతనమవు తాయి. తక్కువ ఆదాయ కుటుంబాలు తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఆహారం, ఇంధనం, రవాణాపైనే ఖర్చు చేస్తాయి. ధరల పెరుగుదల వారిని పొదుపుల నుంచి దూరం చేస్తుంది. అప్పులపై ఆధారపడే పరిస్థితిని పెంచుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడమే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ముందున్న ప్రధాన సవాలు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా పరిగణించే ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ అక్టోబరు 5 నుంచి 7 వరకు సమావేశం కానున్న నేపథ్యంలో, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలపై దృష్టి సారించవచ్చు. దీనివల్ల సామాన్యుడికి వచ్చే సత్వర ఊరట అంటూ ఏదీ ఉండదు. కాబట్టి, ఈ దశలో కేవలం వడ్డీ రేటును పెంచడం సరిపోదు. ఆర్బిఐ ద్రవ్య విధానం, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానం, రాష్ట్రాల మార్కెట్ జోక్యం పరస్పరం సమన్వయంతో పనిచేయాలి. ద్రవ్యోల్బణం సరఫరా వైపు నుంచి వస్తున్నప్పుడు దానికి మొత్తం సమాధానాన్ని వడ్డీ రేటులో వెతకడం సరైన విధానం కాదు.
ఆహార సరఫరా గొలుసుపై ప్రభుత్వం ముందుగా దృష్టి పెట్టాలి. నిత్యావసరాల ధరల్లో భారీ హెచ్చుతగ్గులు రైతుకూ, వినియోగదారుడికీ నష్టం చేస్తాయి. రైతు పంటకు మంచి ధర రాకపోవచ్చు. వినియోగదారుడు కొన్ని నెలల తర్వాత అదే పంటకు అధిక ధర చెల్లించాల్సి రావచ్చు. మధ్యవర్తులు లేదా దళారీలు, నిల్వ సామర్థ్యం, కోల్డ్ స్టోరేజీ, రవాణా, మార్కెట్ సమాచారం వంటి సమస్యలను పరిష్క రించకుండా ధరల స్థిరత్వం సాధ్యం కాదు. ప్రభుత్వం అవసరమైన సమయంలో బఫర్ స్టాకులను ఉపయోగించాలి. మార్కెట్లో కొరత ఏర్పడినప్పుడు నిల్వలను విడుదల చేయడం, అధిక ధరల సమయంలో దిగుమతులను తాత్కాలికంగా సులభతరం చేయడం, ఎగుమతి విధానంలో ఆకస్మిక మార్పులను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలి. అయితే ఇలాంటి జోక్యాలు రైతు ప్రయోజనాలను దెబ్బతీయకుండా జాగ్రత్తగా రూపొందించాలి. వినియోగదారుడికి తక్కువ ధర కల్పించాలనే ఉద్దేశంతో రైతు ఆదాయాన్ని దెబ్బతీస్తే దీర్ఘకాలంలో ఉత్పత్తి తగ్గి సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇంధన రంగంలో ప్రభుత్వం మరింత ముందు చూపుతో వ్యవహరించాలి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరిగిన ప్రతిసారీ దేశీయ ధరలు పెరిగే పరిస్థితి ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను సమర్థంగా ఉపయోగించడం, దిగుమతి వనరులను విస్తరించడం, దేశీయ శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, పునరుత్పాదక ఇంధనాన్ని వేగంగా విస్తరించడం వంటి చర్యలకు ఇప్పుడు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి ఒక్క నెలలో ధరలను తగ్గించకపోయినా, భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఏర్పడి తీవ్రమైన ఆర్థిక వ్యత్యాసాలు, ఒడిదుడుకుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. ధరల సమాచారాన్ని ప్రజలకు మరింత పారదర్శకంగా అందించడం కూడా అత్యవసరం. ఏ వస్తువు ధర ఎందుకు పెరిగింది? ఉత్పత్తిదారుడి ధర ఎంత పెరిగింది? రవాణా ఖర్చు ఎంత పెరిగింది? మధ్యవర్తుల వాటా ఎంత మారింది? దిగుమతి ధర ప్రభావం ఎంత? ఇలాంటి సమాచారాన్ని క్రమం తప్పకుండా ప్రజల ముందుంచాలి. ద్రవ్యోల్బణం గురించి గణాంకాలను విడుదల చేయడంతో ప్రభుత్వ బాధ్యత తీరిపోదు. ఆ గణాంకాల వెనుక ఉన్న కారణాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. టోకు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ సమస్య ప్రస్తుతం సామాన్యుడి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, ఇప్పటికిప్పుడు ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకురావడం సులభం కాకపోవచ్చు. కానీ, సరైన నిర్ణయాలు తీసుకొని, వాటిని సమర్థంగా అమలుచేస్తే, పరిస్థితి కొంతవరకైనా మెరుగుపడవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థకు విస్తారమైన మార్కెట్, విస్తృత ఉత్పత్తి సామర్థ్యం, బలమైన వ్యవసాయ ఆధారం ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది సంక్షోభం వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే సరఫరా వ్యవస్థను సిద్ధం చేయడం. ఆహార నిల్వలు, ఇంధన భద్రత, వ్యవసాయ మార్కెట్లు, రవాణా మౌలిక సదుపాయాలు, దిగుమతి విధానం, చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం వంటివి ఒకే ద్రవ్యోల్బణ వ్యూహంలో భాగం కావాలి. ధరలు పెరిగిన తర్వాత ఉపశమన చర్యలు ప్రకటించడం కంటే, ధరలు పెరగకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం అవసరం. ప్రజల ఆదాయాన్ని పెంచే విధానాలు, ఆహార భద్రతను కాపాడే చర్యలు, ఇంధన దిగుమతి ప్రమాదాన్ని తగ్గించే దీర్ఘకాల వ్యూహం, పారదర్శక మార్కెట్ పర్యవేక్షణలే ద్రవ్యోల్బణ నియంత్రణకు సరైన సమాధానాలు.