Telangana: రాచరిక, నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
B. Sudershan Reddy
Telangana: రాచరిక, నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ ప్రజా పోరాటాన్ని హిందూముస్లింల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించడం చరిత్రను తప్పుదోవ పట్టించడమేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజాం ముస్లిం కావడం వల్ల ప్రజలు ఆయనపై పోరాటం చేయలేదని, రాచరిక, నిరంకుశ వ్యవస్థలో ప్రజలపై సాగిన అణచివేతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో గురువారం తెలంగాణ అమరవీరుల సార్మక ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల శాశ్వత ఛాయాచిత్ర ప్రదర్శనను జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ అమర వీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్ మాజీ ఎంపి బి.వినోద్ కుమార్, సామాజిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్, సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ(ఎం) కార్యదర్శి జాన్ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి, కోశాధికారి ఉజ్జని రత్నాకర్ రావు, సభ్యులు కె. శ్రీనివాస్ రెడ్డి, బొమ్మగాని ప్రభాకర్ పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అపూర్వమైంది : జస్టిస్ సుదర్శన్
తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర అపూర్వమైనదని, ఆ చరిత్రను అర్థం చేసుకోవడం ద్వారా నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకోవచ్చని జస్టిస్ బి.సుదర్శన్ అన్నారు. నాటి వ్యవస్థలో ప్రజలను అణచివేసిన శక్తులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని కేవలం మతపరమైన కోణంలో చూడటం సరైంది కాదన్నారు. ఫొటో ప్రదర్శనలో కనిపించే ప్రతి చిత్రం వెనుక ఒక చరిత్ర, ఒక త్యాగం ఉందని, ఆ చరిత్రను భావితరాలకు అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు, చర్చలు కొనసాగాలని సుదర్శన్ రెడ్డి ఆకాంక్షించారు. రజాకార్లను ఒక మతానికి ప్రతినిధులుగా కాకుండా, నాటి రాష్ట్ర అధికార వ్యవస్థ అండతో పనిచేసిన సాయుధ శక్తిగా చూడాలన్నారు.

రజాకార్లను ఎదుర్కోవడమే కాకుండా ప్రజలను పీడించిన భూస్వామ్య, సంస్థాన వ్యవస్థలపైనా పోరాటం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయ స్వేచ్ఛపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహించుకునే అవకాశం ఉండకపోవచ్చన్న హెచ్చరికలను విస్మరించరాదన్నారు. ప్రస్తుతం ప్రజలు స్వేచ్ఛగా సమావేశమై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే అవకాశాలను కాపాడుకోవాలన్నారు.
చీకటి గతానికి, వెలుగుల భవిష్యత్తుకు మధ్య జరిగిన మహా సంఘర్షణ ః పరకాల ప్రభాకర్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చీకటి గతానికి, వెలుగుల భవిష్యత్తుకు మధ్య జరిగిన మహా సంఘర్షణ అని పరకాల ప్రభాకర్ అన్నారు. ప్రపంచ చరిత్రలోని స్పానిష్ సివిల్ వార్ పోల్చదగినంత గొప్ప ఉద్యమం తెలంగాణ రైతాంగ పోరాటమని పేర్కొన్నారు. ఆ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవడం, వారి త్యాగాల స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై తనకు భావజాలపరంగా ఎనలేని గౌరవం ఉందన్నారు. ప్రజల కోసం కాగడాలు పట్టుకుని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగిన వారిని స్మరించుకోవడం గొప్ప సందర్భమన్నారు.

స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలాంటి పాత్ర లేని వ్యక్తులు, సంస్థలు, వేదికలు నేడు దేశభక్తులుగా చలామణి అవుతున్న పరిస్థితి ఆందోళనకరమని పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పోరాట శక్తుల మధ్య ఐక్యత అవసరమని ‘లాల్ నీల్ ఏక్తా’తో పాటు ‘లాల్ లాల్ ఏక్తా’ కూడా అవసరమని ఆయన అన్నారు. గత విభేదాలను పదే పదే తొవ్వుకోవడం వల్ల ఉద్యమ శక్తులు మరింతగా విభజితమై బలహీనపడతాయని పేర్కొన్నారు. సివిల్ సొసైటీ సంస్థలు, రాజకీయ శక్తులు, వివిధ ప్రజా సంఘాలను విస్తృతంగా సమీకరించి ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఎల్ ఆసుపత్రికి రావి నారాయణరెడ్డి పేరు పెట్టాలి ః బి.వినోద్ కుమార్
హైదరాబాద్ ఎల్ ప్రభుత్వం నిర్మించిన టిమ్స్ ఆస్పత్రికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి పేరు పెట్టాలని బి.వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. దేశ మొదటి సార్వత్రిక ఎన్నికల్లో జవహర్ నెహ్రూ కంటే భారీ మెజార్టీతో గెలుపొందిన నాయకుడు రావి నారాయణరెడ్డికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆస్పత్రి నిర్మాణం పూర్తయినందున పేరుపై అనవసర వివాదాలకు తావులేకుండా రావి నారాయణరెడ్డి పేరు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల కోసం జరిగిన పోరాటాల చరిత్రను భావితరాలకు అందించాలన్నారు. నల్గొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిందని, ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం, బి.ఎన్.రెడ్డి తదితర నాయకుల పోరాటాలను యువత తెలుసుకోవాలని సూచించారు.

ఐక్యత దిశగా నిర్ణయాత్మక అడుగులు వేయాలి : కూనంనేని సాంబశివరావు
కమ్యూనిస్టు ఉద్యమం ప్రజల కోసం, సామాజిక మార్పు కోసం పనిచేసే శక్తిగా మరింత బలోపేతం కావాలంటే ఐక్యత దిశగా నిర్ణయాత్మక అడుగులు వేయాలని, ఇందుకు సంబంధించిన నిర్ణయం పైస్థాయి నాయకత్వం నుంచే రావాలని కూనంనేని సాంబశివరావు అన్నారు. కింది స్థాయిలో ఇప్పటికే ఐక్య కార్యాచరణ కొనసాగుతున్నప్పటికీ, పూర్తిస్థాయి ఏకీకరణకు సిపిఐ, సిపిఐ(ఎం) అగ్రనేతలు ఒకే వేదికపై కూర్చుని చర్చలు జరిపితే కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు, ప్రజలకు స్పష్టమైన మార్గం ఏర్పడుతుందని పేర్కొన్నారు. భూమి కోసం పోరాటం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ఎర్రజెండా వంటి అనేక అంశాల్లో రెండు పార్టీల మధ్య సారూప్యత ఉన్నప్పుడు విభేదాలపై కాకుండా ఐక్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. బలహీనతగా భావించినా పర్వాలేదు… సమాజం కోసం, ఒక మంచి లక్ష్యం కోసం ఐక్యతకు ప్రయత్నించడంలో నష్టమేమీ లేదన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంపై ప్రజల్లో ఇప్పటికీ గౌరవం ఉందని, అయితే కమ్యూనిస్టులు ఎందుకు ఒక్కటిగా ఉండలేకపోతున్నారనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోందన్నారు. చారిత్రక ఉద్యమాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని విభజనలను అధిగమించాలన్నారు.
కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యతను బలోపేతం చేయాలి: జాన్
తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవడంతో పాటు కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జాన్ అన్నారు. ఐక్య ఉద్యమాల నిర్వహణతో పాటు భవిష్యత్తులో మరింత సమన్వయంతో ముందుకు సాగేందుకు సిపిఐ(ఎం) తరపున కూడా ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. భూస్వామ్య, జమీందారీ, నిరంకుశ వ్యవస్థలకు వ్యతిరేకంగా పేదలు, రైతులు సాగించిన మహత్తర పోరాటంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని భావితరాలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఇందు కోసం ఫొటోలు, చారిత్రక ఆధారాలను సేకరించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాడు కమ్యూనిస్టు ఉద్యమం అందించిన చైతన్యంతో గ్రామాల్లో ప్రజలు సంఘటితమై పోరాటం సాగించారని చెప్పారు. ఈ చరిత్రను పక్కనపెట్టి కేవలం మతపరమైన కోణంలో పోరాటాన్ని వివరించడం సరైందికాదని అన్నారు.
- KTR At ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు.. కేటీఆర్ హాజరు..ఫార్ములా-ఈ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా
- Telangana Minister Ponguleti: అసైన్డ్ భూముల పట్టాలు ఉన్నవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టము.. వట్టి నాగుల పల్లె భూమి నాది కాదు… మంత్రి పొంగులేటి స్పష్టం..
- Telangana 22A Land Issues: 22A భూముల సమస్యలకు హై లెవల్ కమిటీ.. ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం
- Tata Group Stocks: టాటా గ్రూప్‌లో ఛైర్మన్ కొట్లాట.. భారీగా పడిపోయిన కంపెనీ షేర్లు.. కారణం ఏంటంటే..
- భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి షురూ