Editorial on Untouchability in India: అంటరానితనం ఇంకానా?
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 80 సంవత్సరాలు సమీపిస్తున్నా, వికసిత్ భారత్ అంటూ శతవార్షికోత్సవానికి (2047) పరుగులు తీస్తున్నా అంటరానితనం, వరకట్నం, బాల్యవివాహాలు వంటి సామాజిక రుగ్మతలు కొనసాగుతూ ఉండటం భారతదేశం వికాసంపై మాయని మచ్చ. ఈ దురాచారాలు ఒకనాడున్నంత తీవ్రంగా ఈనాడు కనిపించకపోవచ్చు. కాని మనం చూస్తున్న, వింటున్న తత్సంబంధిత అనేక దురాగతాలకు వివక్షాపూర్వక మానసిక స్థితి మారకపోవటమే కారణం. ఎన్ని ప్రగతిశీల చట్టాలు చేసినా వాటి అమలు అంతంతమాత్రంగా ఉండటానికీ ఆ మనోగతమే కారణం. కులాధిపత్యం, మహిళల అణచివేత, వివక్ష ఇవి పితృస్వామిక వ్యవస్థ లక్షణాలు, ఫ్యూడల్ వ్యవస్థ అవశేషాలు.
ఈ దురాచారాలకు వ్యతిరేకంగా ఎందరో సంస్కర్తలు తమ జీవితాలు అర్పించారు. జాతీయోద్యమం సానుకూలంగా స్పందించింది. స్వాతంత్య్రానంతరం సంఘసంస్కరణోద్యమ ప్రభావంతో సానుకూల చట్టాలు వచ్చాయి. ఫ్యూడల్ వ్యవస్థ బద్దలై, పెట్టుబడిదారీ విధానం వృద్ధితో సాంఘిక సంబంధాల్లో వచ్చిన మార్పులు కూడా ఇందుకు దోహదం చేశాయి. అయితే అదే సమయంలో స్వాములు, బాబాలు సనాతన ధర్మ ప్రచారం పేరుతో మూఢాచారాలను సజీవంగా ఉంచుతున్నారు. వారికి కొన్ని రాజకీయ పక్షాల అండదండలున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణ, మనుస్మృతి కట్టుబాట్లను సమర్థించే శక్తులు అధికార అందలాలు అధిరోహించాక కులతత్వం, మతతత్వం మళ్లీ పుంజుకున్నాయి.
దళితులపై దాడులు పెరుగుతున్నాయి. కులాంతర వివాహాలను ప్రోత్సహించే రోజులు పోయి పరువు పేరుతో అట్టి వధూవరులను హత్యచేసే కాలమొచ్చింది. దీనికి ప్రధాన కారణం దేశంలో పురోగామి భావజాల ప్రచారం, వామపక్ష భావజాల ప్రభావం బలహీనపడి, తిరోగమన లేదా సనాతన భావజాలం పెచ్చరిల్లటం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్‌లో ఒక సభలో ప్రసంగించి వచ్చాక, దళితుడు కూర్చున్న ప్రదేశం అపవిత్రం అయిందని భావించి హిందూ అగ్రకులజులు కొందరు ఆ ప్రదేశాన్ని శుద్ధిచేసినా వారిపై పోలీసులు అంటరానితనం నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదంటే బీజేపీ ప్రభుత్వం అండచూసుకునే కదా? ఇలాంటి అవమానకర సంఘటనలు ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా ఉకావల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2026, జులై 28న ఒక ఉపాధ్యాయుడు నాల్గవ తరగతి దళిత విద్యార్థిని కులం పేరుతో తిట్టి, కొట్టినట్లు మీడియాలో వచ్చిన వార్తను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) తనకు తానుగా పరిగణలోకి తీసుకుంది. ఆ బాలుడు చేసిన తప్పేమిటి? దప్పిక తీర్చుకునేందుకు టీచర్ బాటిల్‌లోని నీళ్లు త్రాగాడు. అది ఆ టీచర్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ పీఐబీ ఆగస్టు 6న పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ సమాచారం యథార్థమైతే టీచర్ చర్య మానవ హక్కుల తీవ్రమైన ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్న ఎన్‌హెచ్‌ఆర్‌సి, మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి, జిల్లా ఎస్‌పీకి నోటీసులు జారీ చేసి సవివరమైన నివేదిక కోరింది.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 ఆమోదించి 37 ఏళ్లు గడిచిపోయినా దళితులు, ఆదివాసీలు ఎందుకు వివక్షకు, దాడులకు, అత్యాచారాలకు గురవుతున్నారు? అగ్రవర్ణాల్లో మానసిక మార్పు రాకపోవటం, ఆ విధమైన ప్రచారం లేకపోవటం, నమోదైన అత్యాచారాల కేసులు సత్వరం పరిష్కారమై నిందితులకు కఠిన శిక్షలు పడకపోవటం కారణాలు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఐదుగురు దళితులు సహా మొత్తం ఆరుగురి హత్య కేసులో 11 ఏళ్ల తర్వాత వచ్చిన తీర్పులో నిందితులు 40 మంది నిర్దోషులుగా బయటకు వచ్చిన ఒక ఉదంతాన్ని సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. 40 మంది నిందితులూ నిర్దోషులైతే ఆ ఆరుగుర్ని చంపిందెవరు అని వారి కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవస్థలో అది జవాబుకు నోచని ప్రశ్న!
సామాజిక న్యాయం శాఖ మంత్రి రాందాస్ అథవాలె జులై 30న రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం (ఎన్‌హెచ్‌ఆర్‌సి గణాంకాలు) ఎస్‌సీ/ఎస్‌టీ చట్టం కింద కేసుల నమోదుకు, వాటి పరిష్కారం, శిక్షల విధింపు మధ్య పెద్ద అగాథం ఉంది. 2020లో దాదాపు 45,995 కేసులు నమోదుకాగా 17,113 ఇంకనూ దర్యాప్తులో ఉన్నాయి; 2,613 మందికి శిక్షలు పడ్డాయి. 2021లో 46,100; 2022లో 52,886; 2023లో 53,372; 2024లో 48,669 కేసులు రిజిస్టర్ అయినాయి. కాగా అదే సంవత్సరాల్లో శిక్షలు పడిన కేసులు వరుసగా 2,613; 2,848; 4,876; 4,691; 5,192. విచారణ పెండింగ్ ఉన్న కేసులు 2020లోని 1,77,379 నుంచి 2024 చివరకు 2,87,694కు పెరిగాయి. దాఖలైన కేసుల్లో శిక్షలు పడినవి 2020లో 6.45 శాతం, 2021లో 6.94 శాతం, 2022లో 10.79 శాతం, 2023లో 8.67 శాతం, 2024లో 12.87 శాతం. పెండింగ్ కేసులు ఎప్పటికి పరిష్కారమయ్యేను? అందువల్ల ప్రభుత్వం క్షేత్రస్థాయి వాస్తవాలు గ్రహించి దళితులకు సత్వరన్యాయం కలుగజేసే మార్గం అన్వేషించాలి.
సనాతన వాదులు దళితులూ హిందువులే అంటారు. కాని వారికి దేవాలయ ప్రవేశాన్ని, ఉమ్మడి వసతుల్లో నీరు తీసుకోవటాన్ని, వర్ణాంతర వివాహాలను సమర్థించరు. అంటరానితనం పాటించేవారు అగ్రవర్ణాలేకదా! ఎందుకీ వివక్ష? శూద్రులు, వారిలోని దళితులు శ్రీ మహావిష్ణువు పాదాలలోనుంచి జన్మించారని, అగ్రవర్ణాలకు సేవచేయటమే వారి ధర్మం అనే పురాణాల ప్రచారం వారి మానసిక ఎదుగుదలను అరికడుతున్నది. అందువల్ల సాంఘిక సంస్కరణకు యువతరం నడుంకట్టాలి.