Skip to content
ఎడిట్ పేజి వార్తలు

‘సర్‌’ ‘భళారే’ విచిత్రం

Prajapaksham 03 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
‘సర్‌’ ‘భళారే’ విచిత్రం

SIR: రాష్ట్రంలో 78.14 శాతం ఎస్ఐఆర్ డిజిటైజేషన్ పూర్తి

ఓటర్ల జాబితాలు తాజా పరచటం పేరుతో భారత ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తున్న ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (ఎస్‌ఐఆర్‌ సర్‌) మూడవ దశ ముసాయిదా జాబితాలు మరోసారి ఆశ్చర్యకర సంఖ్యలు వెల్లడించాయి. 16 రాష్ట్రాలు, 3కేంద్ర పాలిత ప్రాంతాల ముసాయిదా జాబితాలు అంతకుముందు ఉన్న 29కోట్ల 93లక్షల ఓటర్లలో 6కోట్ల 15లక్షలు తొలగించాయి. అంటే 17.04 శాతం ఓట్లు తొలగింపుకు గురైనాయి. 24 సంవత్సరాల తదుపరి ముమ్మర సవరణ చేబట్టినందున ఈ కాలంలో మరణించినవారు, శాశ్వతంగా వలసవెళ్లిన వారు, ఇళ్లు మారిన వారు, డూప్లికేట్‌ ఓటర్లు కొంత ఎక్కువగానే ఉంటారనే వాదన అంగీకరించవచ్చు. అడ్రసు దొరకని వారు అనే కేటగిరి ఎన్నికల కమిషన్‌ యంత్రాంగం వైఫల్యాన్ని చాటుతోంది. పై కేటగిరీల్లో మరణించినవారిని మినహాయిస్తే మిగతా కేటగిరీల క్రింద ప్రస్తుత జాబితాల్లో తొలగించబడిన కోట్లమందిలో అత్యధికులు మరోచోటనైనా ఓటరుగా రిజిష్టర్‌ అయి వుండాలి కదా! ఎక్కడ? ఎన్యూమరేషన్‌ ఫార్మ్‌ పంపిణీ చేసామంటున్నారు. ఇది పాక్షిక సత్యం. ఇంటింటికీ వెళ్లి పార్మ్‌ పంపిణీ చేయాల్సిన, మళ్లీ ఓటర్లను కలిసి ఫార్మ్‌ నింపి వాటిని సేకరించాల్సిన
బిఎల్‌ఒలు, ఇఆర్‌ఓలు, ఎఇఆర్‌ఓలు వారి విధులు సక్రమంగా నిర్వర్తించ
లేదన్నది యధార్ధం.
చాలామంది కమ్యూనిటీ హాల్స్‌లో కూర్చుని తమ వద్దకు వచ్చిన వారికి ఫారాలు పంచారు. పంపిణీ కాని వాటిని ఏమి చేశారో వారికే తెలియాలి. ఈ కర్తవ్య నిర్వహణలో విఫలమైన యంత్రాంగం తప్పులు దిద్దుకోవలసిన (2022 నాటి జాబితాతో సరిపోల్చి), ముసాయిదాలో పేరులేకపోతే కొత్తగా చేరాల్సిన బాధ్యతను ఓటర్లపై పెట్టారు. అభ్యంతరాలు గడువులో ఆ పనిచేస్తే, అవి ఆధారాలతో సరిగ్గా ఉంటే తుది జాబితాలో చేర్చుతారట. లక్షలు, కోట్లతో తొలగింపులు ఉండగా, ఒక వేళ వారిలో అత్యధికులు కొత్తపత్రాలు దాఖలు చేస్తే వాటిని పరిశీలించటం యంత్రాంగానికి సాధ్యమా? ఈ ప్రహసనానికి పశ్చిమబెంగాలే ఉదాహరణ. 90లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగిస్తే, టిఎంసి సుప్రీంకోర్టుకెళ్లి కొట్లాడితే వాటి పరిశీలనకు ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేశారు. ఎన్నికలలోపు వాటిలో నాల్గవవంతుకూడా పరిష్కారం కాలేదు. పరిష్కారం అయిన వాటిలో ఎక్కువశాతం చెల్లుబాటు ఓట్లే. ఈ జాబితాలు బిజెపి విజయానికి సహాయకారికాగా, ఎన్నికల అనంతరం పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం నత్తనడక నడుస్తోంది. ప్రస్తుత మూడవ దశ సర్‌ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు లేకపోయినా తొలగించబడిన ఓటర్లందరికీ న్యాయం జరుగుతుందని భావించలేము.
తాజా ముసాయిదా గణాంకాలు చూస్తే ఓటర్లను ముఖ్యంగా పేదలు, ముస్లిం మహిళలు, వలస కార్మికులను తొలగించటమే ప్రధానంగా కనిపిస్తున్నది. ఢిల్లీలో 42.56 లక్షల ఓటర్లలో 32.78 శాతాన్ని అంటే ప్రతి ముగ్గురిలో ఒక ఓటు తొలగించారు. మహారాష్ట్రలో మరీ ఆశ్చర్యకరంగా 2కోట్ల 6లక్షల ఓట్లు తొలగింపుకు గురైనాయి. సర్‌కు ముందు 9కోట్ల 78లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య సర్‌ ముసాయిదాలో 7.71 కోట్లకు పడిపోయింది. మహారాష్ట్రలో లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆకస్మికంగా 39లక్షల ఓటర్లు పెరిగారు. అంటే బిజెపి వారు ఎంచుకున్న నియోజకవర్గాల్లో గుండుగుత్తగా చేర్చిన ఈ ఓట్లు వారి పరాజయాలను విజయాలుగా మార్చాయి. ఇప్పుడు 2.07 కోట్లు అనగా ప్రతి ఐదుగురిలో ఒకరి పేరును ఓటర్ల జాబితానుంచి తొలగించారు. దీన్నే రాహుల్‌గాంధి ఓటు చోరీ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు 9.29 కోట్లు, అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు 9కోట్ల 70లక్షలు, 2026 సర్‌ ముసాయిదాలో ఓటర్లు 7.71 కోట్లు. ఏది సరైంది అని రాహుల్‌గాంధి ప్రశ్నించారు. “బిజెపి, ఓటు చోరీ కమిషన్‌ ఎత్తుగడలు మారుస్తున్నాయి, కొనసాగిస్తాయి. కాని వారి లక్ష్యం ఒకటే ఏది ఏమైనా బిజెపి గెలుపు, భారత ప్రజాస్వామ్యం నాశనం” అని అన్నారాయన.
కర్నాటకలో 1కోటి 7లక్షలు ఓట్లు తొలగించారు. తెలంగాణలో ‘సర్‌’కు ముందు 3.38 కోట్ల ఓటర్లు ఉండగా, సర్‌ ముసాయిదాలో 73,39,235 తగ్గిపోయారు. 90లక్షలకు పైగా నోటీసులు జారీ చేశామంటున్నారు. ఒక విశ్లేషణ ప్రకారం, హైదరాబాద్‌లో తొలగించిన 19,41,444 ఓట్లలో 47.8 శాతం మహిళలు. వారిలో అత్యధికులు హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్నారు. తొలగించబడిన మహిళా ఓటర్లలో బహదూర్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో 62,885 మంది, చాంద్రాయణగుట్టలో 76,099 మంది, కార్వాన్‌లో 69,391మంది, యాకుత్‌పురలో 75,315 మంది, మలక్‌ పేటలో 71,644 మంది, నాంపల్లిలో 65,212 మంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 44,89,512, చిన్న రాష్ట్రాలు జార్ఖండ్‌లో 43,61, 987, పంజాబ్‌లో 20.66 లక్షలు, ఒడిసాలో 20.12 లక్షల పేర్లు ఓటర్ల జాబితాలనుంచి తొలగించారు. ఈ తొలగింపులు, చేర్పులు, ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయి. అభ్యంతరాల దాఖలుకు వ్యవధి పొడిగించాలని కర్నాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాశారు. వెంటనే ఎన్నికలు లేవు కాబట్టి ఎన్నికల కమిషన్‌ తగినంత సమయం తీసుకుని తప్పులను గరిష్టంగా నివారించేందుకు కృషి చేయాలి. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకూడదన్న ప్రకటిత లక్ష్యానికి అది బద్ధురాలు కావాలి.

ట్యాగ్‌లు: editorial SIR SIR awareness