Skip to content
జాతీయం వార్తలు

వర్షం కోసం సర్కారు భగీరథ ప్రయత్నం

Prajapaksham 03 Sep 2026 0 నిమిషాల పఠనం జాతీయం
వర్షం కోసం సర్కారు భగీరథ ప్రయత్నం

rain

ఎస్‌.బాబు, అధ్యక్షుడు, టిజిఎస్‌ఆర్టీసి ఎంప్లాయీస్‌ యూనియన్‌

మేఘాల నుండి భూమిపై నీటి బిందువుల రూపంలో కురిసే జలధారనే వర్షం అంటున్నాం. నైరుతి, ఈశాన్య ఋతుపవనాలు ఏర్పడినప్పుడు, సముద్రాలలో అల్పపీడనాలు ఏర్పడినపుడు సహజంగానే వర్షాలు కురుస్తాయి. జీవరాశి మనుగడకు నీరు అత్యంత అవసరం. మన దశావతారాల లోని మొదటి మత్స్యావతారం నీటిలో పుట్టిందేనని పురాణాలు చెప్తున్నాయి. ఇది మత పరమైన నమ్మకం. మతమనేది మనిషి నమ్మకం. రాజకీయ పార్టీలు మత విశ్వాసా లు కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నడిపించాలి. కానీ వాస్తవంలో అలా జరగడంలేదు. 2014 నుండి 2023 వరకు కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా సుమారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు. 2 సంవత్సరాలు వర్షాలు రాకపోవడంతో అనావృష్టి ఏర్పడింది. ఫలితంగా నేలలు బీటలు వారాయి. పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నీరు లేని గ్రామాలు, సేద్యం లేని పొలాలు దర్శనమిచ్చాయి. ఆయన 70 వేల పుస్తకాలు చదివిన దిమాగీ నక్సల్‌ కనుక తాన్‌ సేన్‌ తన రాగాలతో వర్షం కురిపించిన విషయం గుర్తుకొచ్చింది. సహజంగానే ఆయన కూడా కవి కనుక భావావేశం పొంగి “జాలిగుండెల మేఘమాలా వానజల్లుగ కురిసిపోవా, నీలాల ఓ మేఘమాలా” అంటూ పాట అందుకున్నారు. అయినా మేఘం వర్షించకపోవడంతో ఆయన ఇగో హర్టయి 2015 డిసెంబర్‌ మాసంలో ఆయుత చండీ మహాయాగాన్ని 5 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించారు. దేశంలో నిర్వహించిన యాగాలలో ఇది అతి పెద్దదని ఆనాడు పత్రికలు పతాక శీర్షికలలో ప్రచారం చేశాయి. దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయినా వర్షాలు అనుకున్నంతగా కురవలేదు. 20 నుండి 25 శాతం వర్షపాతం మాత్రమే రికార్డయింది. ఆనాడు కూడా ఎల్‌ నినో ఏర్పడటం, 231 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ సంవత్సరం సాధారణంగా 752 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాలి. కాని 661 మిల్లీమీటర్లు వర్షపాతం మాత్రమే రికార్డయింది. భూగర్భ జలాలు పడిపోయాయి. సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ యాగం యొక్క కాన్సెప్ట్‌ వర్షాలు కురవాలని, పంటలు బాగా పండి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని. ఆయన యాగం నిర్వహించినా వరుణ దేవుడు తమ ప్లాస్టిక్‌ డ్రమ్ములను నీటితో నింపలేదని, యాగం చేసినా చివరకు ట్యాంకర్‌ నీళ్ళతోనే దాహం తీర్చుకోవలసి వచ్చిందని మహిళలు ఆవేదన చెందారు.
ఆనాటి ముఖ్యమంత్రికి మత విశ్వాసాలపై పూర్తి నమ్మకం ఉండేది. సహజంగానే భక్తిభావం కూడా ఎక్కువగా ఉండటంతో ఆయన ఆలోచన యజ్ఞ యాగాదులు, క్రతువుల చుట్టూ తిరుగుతూ ఉండేది. 2019 లో కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయేమోనని “కరుణించవా వరుణదేవా” అంటూ సరాగాల పల్లకిలో ఊరేగుతూ జనవరి మాసంలో సహస్ర చండీయాగం నిర్వహించారు. ఈ యాగం కాన్సెప్ట్‌ ఏమిటంటే వానలు బాగా కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరికతో తమ ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లో మళ్ళీ 5 రోజులు యాగాన్ని నిర్వహించారు. ఆ యాగ ఫలమో లేక సహజంగానే ఏర్పడ్డ తుఫాను ప్రభావమో కానీ సముద్రం లేని హైదరాబాద్‌ లో పడవలు వేసుకుని డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ టీమ్‌లు తిరగాల్సి వచ్చింది. ఎక్కడ చూసినా అతివృష్టి. గ్రామా ల్లో పంట నష్టం. ఫలితంగా రైతులు ఆత్మహత్యలు. 2014 నుండి 2019 వరకు 29 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది. అందులో ప్రకృతి ప్రకోపించిన కారణాలే ఎక్కువ. 54 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోవడంతో మంచిర్యాల్‌, సూర్యాపేట, భూపాలపల్లి, జగిత్యాల లాంటి ప్రదేశాలలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హైదరాబాద్‌లో వర్షం కురిస్తే రోడ్ల మీద చేరిన వరదనీరు మురికి కాలువల పాలవుతుం దే తప్ప ఆ నీటిని ఒడిసిపట్టి వినియోగించుకునే యంత్రాంగాన్ని ప్రభు త్వం చేయలేకపోతోంది. ఇది ప్రభుత్వ వైఫల్యమే. ఇలాంటి ప్రకృతి విపత్తుల నుండి ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోకపోవడం ఆత్మహత్యా సదృశం.
అయినా పట్టువదలని విక్రమార్కుడిలా యజ్ఞ యాగాదుల్లో ఎలాగైనా హాట్రిక్‌ కొట్టాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి 2023 నవంబర్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేశారు. ఈ యాగం ముఖ్య ఉద్దేశం ప్రజా సంక్షేమం, అధిక వర్షపాతం, ప్రజల ఆయురారోగ్యాలు, తెలంగాణ ప్రాంతం పాడిపంటలతో విలసిల్లటం కాదు. రాజశ్యామల యాగం ఉద్దేశం కేవలం మూడవసారి తను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టటమే. కాబట్టి వర్షం గురించి వరుణ దేవుడిని గాని, మేఘాలను గాని రాగాలతో బాదాల్సిన అవసరం ఆయనకు రాలేదు. సహజంగా రాజరిక వ్యవస్థలో ఒక రాజు మరో రాజుపై యుద్ధానికి వెళ్ళే సమయంలో విజయం కోసం ఈ రాజశ్యామల యాగాన్ని పూర్తి చేసి పూర్ణాహుతితో ముగించేవారని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. కాని ఈ హాట్రిక్‌ కోసం చేసిన రాజశ్యామల యాగం తరువాత తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పు పాఠకులకు బాగా తెలుసు. రాజశ్యామల యాగం కూడా ఆయన ఓటమిని ఆపలేకపోయింది. “అనుకున్నది ఒకటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్‌ బుల్‌ పిట్ట” అంటూ తెలంగాణ ప్రజానీకం రాగాలందుకున్నారు.
మళ్ళీ 2026 లో తెలంగాణలో ఎల్‌ నినో ప్రభావం ఏర్పడిందని, ఆ ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ప్రభుత్వానికి తెలిపారు. ఇదే విషయా న్ని ఇండియన్‌ మెటీరియారోలాజికల్‌ డిపార్టుమెంట్‌ కూడా ప్రకటించింది. చినుకు కినుక వహించింది. వర్షం కురవనంటూ అలక బూనిం ది. వరుణుడు తన భార్యా బిడ్డలతో నవగ్రహ సంచారంలో ఉన్నాడు. ఆయన టూర్‌ ప్రోగ్రాం పూర్తి అయితే గానీ ఇక్కడకు రాడు. తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా టూర్‌ ప్రోగ్రాంని కేంద్రం అడ్డుకున్నట్లు వరుణుడి ప్రోగ్రాంని ఎవరూ అడ్డుకోలేరు కదా. ఆయన వచ్చేసరికి పరిస్థితులు చేజారిపోతాయేమోనని 10 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వర్షాలు కురవటం కోసం నాగార్జున సాగర్‌ వద్ద అధికారికంగా వేద పండితులను, ఋత్విజులను పిలిపించి “ఓం జల బింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహీ, తన్నో వరుణః ప్రచోదయాత్‌” అంటూ వర్షాన్ని ఆహ్వానిస్తూ ప్రధాన వరుణ మంత్రం జపించి వరుణ యాగాన్ని నిర్వహించారు. కానీ వరుణుడు మాత్రం కరుణించలేదు. ఎలా కరుణిస్తాడు? ఆయన భార్యా బిడ్డలతో టూర్‌ ప్రోగ్రాం చేస్తున్నాడు కదా? అందువల్ల ఏదో అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయే తప్ప, కుంభవృష్టి కురవలేదు. ముఖ్యమంత్రి చేసిన ఈ వరుణ యాగం కాన్సెప్ట్‌ ప్రాజెక్టులు, జలాశయాలు నీటితో నిండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతాంగం శ్రేయస్సు కోసం కృష్ణా గోదావరి నదులు జల కళను సంతరించుకోవాలని సంకల్పించుకుంటూ ముఖ్యమంత్రి పూర్ణాహుతి ఇస్తూ యాగాన్ని సమాప్తం చేశారు. ఈ యాగంలో ఆయన స్వార్థం లేదు. అంతా ప్రజా బాహుళ్యమే. అయినా నాగార్జున సాగర్‌ లో ఉన్న 145.65 టిఎంసిల డెడ్‌ స్టోరేజి నుండి 312.045 టిఎంసిలకు పెరగలేదు. గత సంవత్సరం ఇదే నెలలో 300 టిఎంసిల నీరు డ్యామ్‌ లోకి చేరింది. ఏ వరుణ యాగం
లేకుండానే, ఏ యజ్ఞ యాగాలు చేయకుండానే జలాశయం
జలకళను సంతరించుకుంది.
నేపాల్‌లోని బొటెకోషి నది ఉప్పొంగి పరిసరాలను తుడిచిపెట్టటం చూశాం. ఇండోనేషియాలో తుఫాన్ల ప్రభావం చూశాం. అమెరికా హరికేన్స్‌తో అతలాకుతలం అవటం చూశాం. కాని అక్కడెక్కడా యజ్ఞ యాగాదులు జరిపిన దాఖలాలు లేవు. కాని ఈ పుణ్యభూమిలో నీటికి కరువు ఏర్పడటం అత్యంత విచారకరం. ప్రభుత్వ అధినేతలు ఎంతసేపు మతాచారాలతో ప్రభుత్వాలను నడిపించాలనే ఉద్దేశమే తప్ప శాస్త్రీయమైన దృక్పథం లోపించింది. ఇప్పటికిప్పుడు వర్షం పడితే ఆ నీటిని ఒడిసి పట్టడం కోసం ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళికలు ఉన్నట్టు కనిపించడం లేదు. పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, అపార్టుమెంటులు లాంటి ప్రదేశాల నుండి పడే వాన నీటిని నిలవ చేసే మార్గాలు తయారు చేయాలి. గొలుసుకట్టు చెరువులను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబళించకుండా అడ్డుకోవాలి. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు తప్పనిసరి చేయాలి. చెరువులను పూడిక తీసి నీటితో నింపడం వల్ల భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉంటాయి. హైదరాబాద్‌ పరిసరాల్లో ఉండే చెరువులైన ఇబ్రహీంపట్నం, మీర్‌ ఆలం ట్యాంక్‌, గండిపేట, హిమాయత్‌ సాగర్‌ లలో పూడిక తీసి వరదనీటితో నింపడం వలన నగర ప్రజల దాహార్తి తీరుతుంది. ఆ పరిసరాలలో ఉన్న వారికి తాగునీరు, సాగునీటి కష్టాలుండవు. బిఆర్‌ ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు చెరువులు పూడికలు తీయించే ప్రయత్నం కొంతమేరకు జరిగింది. కాని కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క చెరువు కూడా పూడిక తీసిన దాఖలా లు లేవు. అసలు ఆ ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించలేదు. కాకతీయ రాజుల కాలంలో గొలుసుకట్టు చెరువులు తవ్వించి, ఒక చెరువు నిండిని తరువాత మరొక చెరువుకు నీటిని మళ్ళించే జాగ్రత్తలు తీసుకుని, రైతులు ఇబ్బంది పడకుండా, నేల బీటలు వారకుండా, భూగర్భజలాలు ఇంకిపోకుండా వారు చర్యలు తీసుకున్నారు. కాని నేటి మన ప్రభుత్వాలకు ఆ ఆలోచన లేకపోవడం విచారకరం.