అమెరికాలో భారతీయులకు భారీ షాక్.. గ్రీన్ కార్డ్ వెయిటింగ్ టైమ్ 179 ఏళ్లు
US Green Card Alert: భారతీయులకు అమెరికా గ్రీన్ కార్డ్‌లో కొత్త చిక్కులు.. సెప్టెంబర్ 18 నుంచి కఠిన నిబంధనలు
అమెరికాలో ఉద్యోగం చేస్తూ శాశ్వత నివాసం (గ్రీన్‌కార్డ్) పొందాలనుకునే భారతీయ నిపుణుల కల నెరవేరడానికి శతాబ్దానికి పైగా సమయం పట్టేలా ఉంది. గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే కొందరు భారతీయులు ఏకంగా 179 ఏళ్ల వరకు వేచి చూడాల్సి రావచ్చని ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’ (NFAP) తమ తాజా నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో భారతీయులకే అత్యంత సుదీర్ఘమైన నిరీక్షణ కాలం ఎదురవుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
డిసెంబరు 2025 నాటికి ఉన్న గణాంకాల ప్రకారం అమెరికాలో ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్ పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 12 లక్షలు దాటింది. ఆందోళనకరమైన విషయమేమిటంటే, ఈ మొత్తం పెండింగ్ దరఖాస్తుల్లో దాదాపు 10 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అంటే మొత్తం క్యూలో 79 శాతం వాటా మన దేశస్థులదే కావడం విశేషం.
జనవరి 2026 లేదా ఆ తర్వాత లేబర్ సర్టిఫికేషన్ లేదా ఉద్యోగ ఆధారిత పిటిషన్ దాఖలు చేసిన భారతీయులకు ఈబీ-2 (EB-2) కేటగిరీలో గ్రీన్‌కార్డ్ రావడానికి ఏకంగా 179 ఏళ్లు పడుతుందని ఎన్‌ఎఫ్‌ఏపీ అంచనా వేసింది. అలాగే ఈబీ-3 (EB-3) కేటగిరీలో 38 ఏళ్లు, ఈబీ-1 (EB-1) కేటగిరీలో 5 ఏళ్ల పాటు వేచి చూడక తప్పదని తెలిపింది. మరోవైపు చైనాకు చెందిన ఈబీ-2 దరఖాస్తుదారులకు 25 ఏళ్లు, ఈబీ-3 దరఖాస్తుదారులకు 7 ఏళ్ల సమయం పడుతుందని విశ్లేషించింది.
అమెరికా చట్టాల ప్రకారం ప్రతి ఏటా ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీపై 1.40 లక్షల పరిమితి మాత్రమే ఉంది. ఈ కోటాలోనే ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యులకూ కేటాయించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రతి దేశానికి 7 శాతం మాత్రమే కేటాయించే కంట్రీ-క్యాప్ నిబంధన ఉండటంతో జనాభా తక్కువగా ఉన్న చిన్న దేశాలతో పాటు భారత్ వంటి జనాభా, నిపుణులు ఎక్కువగా ఉన్న దేశాలకు సమాన సంఖ్యలోనే కార్డులు లభిస్తున్నాయి. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఉదాహరణకు 2016లోనే 47,601 మంది భారతీయుల ఈబీ-2 పిటిషన్లు (కుటుంబ సభ్యులతో కలిపి 98,594 మంది) క్లియర్ అయినప్పటికీ, ఆ ఏడాది కేవలం 4,407 మంది భారతీయులకే శాశ్వత నివాస హోదా లభించిందని, ఆ నిరీక్షణే నేడు ఇంతటి తీవ్ర రూపం దాల్చిందని నివేదిక పేర్కొంది.