Editorial On RSS Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి భాగవత్ సుభాషితాలు
Editorial On RSS Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి భాగవత్ సుభాషితాలు
Editorial On RSS Mohan Bhagwat: “భారత్‌లో ముస్లింలు ఉండకూడదని హిందువు ఎవరైనా అనుకుంటే అతను హిందువుగా ఉండజాలడు.. ప్రజలు భిన్నమైన మతాలు అనుసరించవచ్చు. అయితే మానవాళి ఒక్కటే.. ప్రజల మత గుర్తింపుతో నిమిత్తం లేకుండా ఆశ్రయం కల్పించడమే భారతదేశ సాంప్రదాయం”. ఇవి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్‌లో ఆహుతులనుద్దేశించి శనివారం చేసిన ప్రసంగంలోని ఆణిముత్యాలు.
Editorial On RSS Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆ సంస్థ భావజాల ప్రచారం, అపోహల తొలగింపు నిమిత్తం భాగవత్ కెనడా, బ్రిటన్, అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ వచ్చారు. “విశ్వజనీన ఐక్యత వేడుక” పేరుతో బహుళ మతాలతో సంభాషణల వేదికగా అమెరికాలోని భారత సంతతిలోనే ఆర్‌ఎస్‌ఎస్ అభిమానులు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. హిందూ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరైనారు. వారిలో ఇతర మతాలవారూ ఉన్నారు.
భారతీయ మూలాలున్న న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యలతో భాగవత్ సమావేశం ఒక సాధారణ సాయంత్రం ఇష్టాగోష్టి నుంచి భారతదేశం గూర్చిన రెండు విరుద్ధ భావాల మధ్య (హిందూ గుర్తింపు, బహుళత్వం) ఘర్షణ భావం కలుగజేసింది. ‘ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీని నేను బలపరచను. కొందరిని దూరంగా ఉంచే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో నాకు లోతైన వ్యతిరేకత ఉంది’ అని ఆయన అన్నారు. అయితే సమావేశం జరుపుకోవడాన్ని ఆయన వ్యతిరేకించలేదు. ‘అది ప్రైవేటు స్థలం’ అన్నారు.
మమ్దానీ ముస్లిం కావడం వల్లనో, లేక గాజా, ఇజ్రాయెల్ పట్ల భారత ప్రభుత్వ వైఖరి పాలస్తీనీయన్‌లకు అనుకూలంగా లేకపోవడం వల్లనో ఆయన ఈ వ్యాఖ్యలు చేయలేదు. అతని తల్లి హిందువు, సినీ నిర్మాత, దర్శకురాలు మీరా నాయర్. ఆమె ఒక ముస్లిం ప్రొఫెసర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ కుటుంబం ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చింది. మమ్దానీ న్యూయార్క్‌లో పెరిగారు, తన తండ్రి ఇస్లాం మతాన్ని స్వీకరించారు. భారతదేశం బహుళత్వం కలదని, లౌకిక రిపబ్లిక్ అని, భారత్‌కు చెందిన ప్రతీ ఒక్కరికి అందులో స్థానం ఉందని తన కుటుంబం నుంచి ఆయన నేర్చుకున్న భావాలు ఆయన ఆలోచనను ప్రభావితం చేశాయి. అయితే ఆర్‌ఎస్‌ఎస్ వారికి ఆయన పొడ గిట్టదు.
అదలా వుంచుదాం. భాగవత్ న్యూయార్క్ సమావేశానికి 39 అమెరికా రాష్ట్రాల్లోని 853 నగరాల నుంచి దాదాపు 5వేల మంది హిందూ అభిమానులు హాజరైనారు. అంతర్‌మత సమావేశం అయినందున 30 దేశాల నుంచి పాల్గొన్న 180 మంది మత నాయకులు ఐదు అంశాల తీర్మానాన్ని భాగవత్‌కు అందజేసినట్లు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వార్త తెలియజేస్తున్నది. ద్వేషాన్ని లేదా హింసను సమర్ధించడానికి మతాన్ని ఉపయోగించడాన్ని ఆ తీర్మానం తిరస్కరించింది.
కాగా భాగవత్ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ డిఎన్‌ఎలోనే ఉందని అంటూ, “ధర్మ అనేది విభేదాలు సృష్టించకుండా ప్రతిదాన్ని ఐక్యం చేసే, సమర్ధించే, సమతులనం చేసే సూత్రం. భిన్నత్వాన్ని మెచ్చుకోవాలి, గౌరవించాలి. అంతా ఒక్కటే అనే భావనను సజీవంగా ఉంచుకోవాలి” అని సెలవిచ్చారు. భిన్నత్వంలో ఏకతను భారత్ సాధించడం, ప్రపంచం సాధించేటట్లు చేయడం భారత్ కర్తవ్యం అని స్వామి వివేకానంద చెప్పారని ఆయన ఉదహరించారు. ముస్లింలు భారతదేశంలో ఉండరాదని కోరుకునేవారు హిందువు కాజాలడని ఈ సందర్భంగా హితోపదేశం చేశారు.
మోహన్ భాగవత్‌గారు ఈ హితోపదేశాలు, సూక్తులు భారతదేశంలో ప్రచారం చేసి ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌పై హిందూ మతోన్మాద సంస్థ అనే ముద్ర పడి ఉండేది కాదు. దేశంలో, ముఖ్యంగా కేంద్రంలో బిజెపి అధికారం వెలగబెడుతున్న గత 12 సంవత్సరాల్లో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ పరివారం సృష్టించిన మత ద్వేషం, విభజన, దౌర్జన్యాలు, కలుషిత వాతావరణం ఏర్పడి ఉండకపోను!
అందువల్ల ఆర్‌ఎస్‌ఎస్ స్వభావాన్ని మసిపూసి మారేడుకాయ చేయలేరు. ఆర్‌ఎస్‌ఎస్‌ను సాధు జంతువుగా చిత్రించడానికి భాగవత్ విదేశాల్లో ఎన్ని శాకాహార మాటలు చెప్పినా స్వదేశంలో దాని సిద్ధాంతం, ఆచరణ హిందూ మతాధిపత్యం, పరమత ద్వేషం అనేది కప్పి పుచ్చజాలరు. ముస్లింలు, క్రైస్తవులు భారత దేశంలో నివసించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకించడం లేదు. వారి ఆరాధన ప్రదేశాలు విదేశాల్లో (మక్కా, జెరూసలెం) ఉన్నందున వారు ఈ దేశంలో రెండవ తరగతి పౌరులుగా ఉండాలన్న గురు గోల్వాల్కర్ హితోపదేశాన్ని భాగవత్ బహిరంగంగా త్రోసిపుచ్చగలరా?
మతహింస కారణంగా పాకిస్తాన్ మినహా అరడజను ఇరుగుపొరుగు దేశాల నుంచి వలస వచ్చిన హిందువులకే పౌరసత్వం అంటున్న పౌరసత్వ (సవరణ) చట్టాన్ని ఆమోదించింది వారి నరేంద్ర మోదీ ప్రభుత్వమే కదా? గోమాంసం భక్షిస్తున్నారనో, ఆవుల్ని తరలిస్తున్నారనో ముస్లిం వ్యాపారులను దారి పుకాచి దాడి చేసి చంపుతున్నది వారి విహెచ్‌పి వారే కదా? కేంద్రంలో, దాదాపు 16 రాష్ట్రాల్లో స్వయంగా అధికారంలో ఉన్న బిజెపి ఒక్క ముస్లిం కైనా పార్టీ టికెట్ ఇచ్చిందా? ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ముస్లింలపై బుల్డోజర్ రాజ్యం సాగిస్తుంటే, లేదా పలు రాష్ట్రాల్లో చర్చీలపై దాడులు జరుగుతుంటే భాగవత్ గారు మందలించారా? భిన్నత్వంలో ఏకత్వం బోధించారా?
అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛపై యుఎస్ కమిషన్’ (యుఎస్‌సి ఐఆర్‌ఎఫ్) ప్రతిఏటా దాని నివేదికల్లో భారత్‌లో మత స్వేచ్ఛకు జరుగుతున్న విఘాతాన్ని ఎత్తిచూపుతోంది. ‘ఆందోళన కలిగిస్తున్న దేశం’గా ప్రకటించాలని అది కోరుతున్నది. భారత్‌ను మత స్వేచ్ఛ విషయంలో బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆ నివేదిక అమెరికా విదేశాంగ శాఖను కోరింది. ముస్లింలు, క్రైస్తవులు వంటి మత మైనారిటీలపై దాడులు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, రా (గూఢచారి సంస్థ) సహా కొన్ని సంస్థలు, నాయకులపై ఆంక్షలు విధించాలని కోరింది.
సిఎఎ, యుఎపిఎ, గోవధ నిషేధం, మతమార్పిడి చట్టాల వంటివి వివక్ష వాతావరణం సృష్టిస్తున్నాయని, విమర్శకుల గొంతు నొక్కుతున్నాయని పలు అమెరికన్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుఎస్‌సి ఐఆర్‌ఎఫ్ నివేదికలను మన విదేశాంగ శాఖ త్రోసిపుచ్చుతూ, మన ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని, బహుళ సంస్కృతుల చట్రాన్ని వక్కాణించినంత మాత్రాన అభిప్రాయాలు మారవు కదా.
అందువల్ల, భాగవత్ మాడిసన్ స్క్వేర్ ప్రవచనాల్లో ఏమాత్రం నిజాయితీ ఉన్నా, వాటిని స్వదేశంలో బోధించాలి, మోదీ ప్రభుత్వ విభజనవాద విధానాలను సరిదిద్దాలి. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంగా బోధిస్తున్న ‘హిందూ రాష్ట్ర’ ప్రచారాన్ని విరమించుకొని, భారత రాజ్యాంగం పీఠికలో ప్రకటించిన రిపబ్లిక్ లక్ష్యాలకు నిబద్ధం కావాలి. ఆయన దగాకోరుతనాన్ని అర్థం చేసుకోలేని అమాయకులు కారు ఈ దేశ ప్రజలు.