Skip to content
జాతీయం వార్తలు

Badlaav Zaroori Hai Video: నేడే ఢిల్లీ రాం లీలా మైదానంలో సీపీఐ బద్లావ్ జరూరీ హై సభ…సర్వం సిద్ధం..అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న మోదీ సర్కార్ (Video)

Prajapaksham 01 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Badlaav Zaroori Hai Video: నేడే ఢిల్లీ రాం లీలా మైదానంలో సీపీఐ బద్లావ్ జరూరీ హై సభ…సర్వం సిద్ధం..అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న మోదీ సర్కార్ (Video)

Badlaav Zaroori Hai Video: నేడే ఢిల్లీ రాం లీలా మైదానంలో సీపీఐ బద్లావ్ జరూరీ హై సభ...సర్వం సిద్ధం..

Badlaav Zaroori Hai Video: దేశ రాజధాని ఢిల్లీలో సిపిఐ ఆధ్వర్యంలో నేడు జరగనున్న భారీ బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. రామ్‌లీలా మైదాన్‌లో ‘బద్లావ్ జరూరీ హై’ పేరుతో జరిగే ఈ జాతీయ స్థాయి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనేక సంవత్సరాల తర్వాత ఢిల్లీలో సిపిఐ ఇలాంటి భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే మారిన రాజకీయ పరిస్థితులలో సిపిఐ వైఖరి ఎలా ఉంటుందోనని జాతీయస్థాయిలో రాజకీయ వర్గాలు సైతం దీనిపట్ల ఆసక్తిగా చూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో దేశ నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఒకరోజు ముందే సోమవారం నాటికి వేల సంఖ్యలో రామ్‌లీలా మైదాన్‌కు బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ నుండి పెద్ద ఎత్తున సిపిఐ శ్రేణులు చేరుకున్నారు. వీరి కోసం ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి వారు తెచ్చుకున్న సద్దుల భోజనాలు తిని వారంతా అక్కడే విశ్రమించారు. రామ్‌లీలా మైదానంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

12 ఏళ్ల వైఫల్యాలను ఎండగట్టేందుకే..

ప్రధాని మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 12 ఏళ్ల వైఫల్యాలను ఎండగడుతూ, కేంద్రంలో ప్రభుత్వం మారి తీరాల్సిందేననే నినాదంతో సిపిఐ దేశవ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. ఆగస్టు 6 నుంచి 12వ తేదీల వరకు అన్ని రాష్ట్రాల్లో పాదయాత్ర నిర్వహించి పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, విద్య, వైద్యం, సామాజిక న్యాయం, కనీస మద్దతు ధర తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఈ కార్యక్రమానికి ముగింపుగా సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘బద్లావ్ జరూరీ హై’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లో అరెస్టులపై రాజా ఆగ్రహం

ఢిల్లీలో జరగనున్న ‘బద్లావ్ జరూరీ హై’ సభకు రాకుండా సిపిఐ నాయకులను, కార్యకర్తలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోవడం పట్ల సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఆయన రామ్‌లీలా మైదాన్‌లో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, యూపీలోని హత్రాస్, అలీగఢ్ తదితర జిల్లాలలో సిపిఐ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పోలీసులు అడ్డుకుంటున్నారని, కొందరిని అరెస్ట్ చేశారని తెలిపారు.

సిపిఐ ర్యాలీతో పాలకులు కంపించిపోతున్నారని, అందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వందేళ్ల చరిత్ర గల సిపిఐకి ప్రజాస్వామ్యంలో రాజకీయ కార్యకలాపాలు, ప్రదర్శనలు నిర్వహించుకునే రాజ్యాంగపరమైన హక్కు ఉందని, దీనిని అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ‘బద్లావ్ జరూరీ హై’ సభకు మంచి స్పందన లభిస్తోందని, అన్ని రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఢిల్లీకి ప్రజలు చేరుకుంటున్నారని రాజా తెలిపారు.

ఢిల్లీ చేరుకున్న సిపిఐ తెలంగాణ నేతలు

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రజాస్వామ్య హక్కుల హననం, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ చేపట్టిన ‘చలో ఢిల్లీ బద్లావ్ జరూరీ హై’ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. సెప్టెంబర్ 1న న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సభకు తెలంగాణ శ్రేణులు సోమవారం ఢిల్లీ చేరుకున్నాయి.

సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఇ.టి. నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, ఎం. బాల నరసింహ తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. సిపిఐ రాజ్యసభ సభ్యులు, జాతీయ కార్యదర్శి సంతోష్ కుమార్‌తో కలిసి వారు రామ్‌లీలా మైదాన్‌లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఇ.టి. నరసింహ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా కార్మికులు, కర్షకులు, యువత, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ప్రజాస్వామ్య హక్కులపై దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలను సమీకరించడమే ‘బద్లావ్ జరూరీ హై’ కార్యక్రమం లక్ష్యమని వారు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దేశాన్ని ప్రజాస్వామ్య మార్గంలో నడిపించేందుకు ఈ సభ చారిత్రాత్మక మలుపుగా నిలుస్తుందని తెలంగాణ ప్రతినిధులు తెలిపారు.

రామ్‌లీలా మైదాన్‌లో జరిగే జాతీయ స్థాయి నిరసన ప్రదర్శనలో తెలంగాణ బృందం క్రియాశీలకంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పనుందని తెలిపారు.

ట్యాగ్‌లు: Indian Politics political news