Skip to content
జాతీయం వార్తలు

Article On Make In India: ఓ వైపు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’.. మరోవైపు ప్రభుత్వ రంగ ఉపసంహరణ!

Prajapaksham 01 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Article On Make In India: ఓ వైపు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’.. మరోవైపు ప్రభుత్వ రంగ ఉపసంహరణ!

Article On Make In India: ఓ వైపు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’.. మరోవైపు ప్రభుత్వ రంగ ఉపసంహరణ!

Article On Make In India: దేశీయ తయారీని పెంచాలి.. విదేశీ దిగుమతులపై ఆధారపడకూడదు.. దేశంలోనే పరిశ్రమలు విస్తరించాలి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.. భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చాలి. ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు పెద్దపీట వేస్తోంది. దేశం స్వావలంబన దిశగా సాగుతోందని చెబుతోంది. పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతుల విస్తరణను అభివృద్ధికి సూచికలుగా చూపిస్తోంది. దేశంలో తయారీ రంగం బలపడటం, కొత్త పరిశ్రమలు రావడం, ఉద్యోగాలు పెరగడం స్వాగతించాల్సిన పరిణామాలే.

అయితే ఇదే సమయంలో దశాబ్దాలుగా దేశ పారిశ్రామిక నిర్మాణానికి పునాదులుగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలపై అనుసరిస్తున్న విధానం మాత్రం మరో చర్చకు తావిస్తోంది. ప్రజల పన్నుల సొమ్ముతో, ప్రభుత్వ పెట్టుబడులతో, దశాబ్దాల కృషితో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించాయి.

ఎల్‌ఐసీ, కోల్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జీఐసీ, ఐఆర్‌ఎఫ్‌సీ, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ వంటి సంస్థలు కేవలం వ్యాపారసంస్థలు మాత్రమే కాదు. వ్యూహాత్మక రంగాలకు అండగా నిలుస్తూ లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న వ్యవస్థలు. అలాంటి సంస్థలను మరింత బలోపేతం చేసి, ఆధునీకరించి, దేశీయ తయారీకి ఉపయోగపడేలా చేయాల్సిన సమయంలో వాటిలో పెట్టుబడులను ఉపసంహరించడం ఎంతవరకు సమంజసం?

ప్రభుత్వ రంగ సంస్థల్లో 78 శాతం వరకు పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ద్వారా రూ.62,124 కోట్లు సమీకరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తక్షణ ఆర్థిక వనరుల కోసం ప్రజా ఆస్తుల వాటాను తగ్గించడం దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనేది పరిశీలిస్తే ఇక్కడే ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అసలు పరీక్షకు వస్తుంది.

ప్రభుత్వ రంగ సంస్థల్లో లోపాలు ఉంటే వాటిని సరిచేయాలి. నష్టాలకు కారణాలను గుర్తించాలి. నిర్వహణలో మార్పులు తీసుకురావాలి. ఆధునిక సాంకేతికతను అందించి ఉత్పాదకతను పెంచాలి. మార్కెట్‌కు అనుగుణంగా సంస్థలను తీర్చిదిద్దాలి. సంస్థను బలోపేతం చేయడం కంటే దాని వాటాను విక్రయించడం సులభమైన మార్గంగా మారకూడదు.

అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడం కాదు. ఆర్థిక వృద్ధి ఫలాలు సామాన్యుడికి చేరాలి. కుటుంబ ఆదాయం పెరగాలి. యువతకు ఉద్యోగాలు రావాలి. రైతుకు గిట్టుబాటు ధర, కార్మికుడికి భద్రత, ప్రజలకు అందుబాటులో విద్య, వైద్యం లభించాలి. నిత్యావసరాల ధరలు కుటుంబ ఆదాయానికి అందుబాటులో ఉండాలి. అప్పుడే ఆర్థిక వృద్ధి ప్రజల జీవితాల్లో కనిపిస్తుంది.

ప్రభుత్వరంగ సంస్థలను బలహీనపరచడం కాకుండా వాటిలోని లోపాలను సరిచేసి, పెట్టుబడులు పెట్టి, సాంకేతికంగా ఆధునీకరించి పోటీకి తట్టుకునే స్థాయికి తీసుకెళ్లడం కూడా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో భాగం కావాలి. అభివృద్ధి అంటే ప్రజా ఆస్తులను విక్రయించి వచ్చిన మొత్తాన్ని ఖర్చు చేయడం మాత్రమే కాదు. ఉన్న ఆస్తులను మరింత విలువైనవిగా మార్చి, తరతరాలకు సంపద, ఉపాధి, పారిశ్రామిక బలం అందించడం కూడా అభివృద్ధే.

‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు నిజమైన అర్థం రావాలంటే దేశంలో తయారీ పెరగడంతో పాటు దేశీయ పారిశ్రామిక సంస్థలు కూడా బలపడాలి. ప్రజా ఆస్తులపై నిర్ణయాలు తక్షణ ఆదాయాన్ని కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. అప్పుడే అభివృద్ధి నిజమైన అర్థంలో ప్రజల జీవితాల్లో కనిపిస్తుంది.

రచయిత: కోగిల చంద్రమౌళి.