USA Visa Issue: అమెరికా తలుపులు మూసుకుంటున్నాయా?
US Green Card Alert: భారతీయులకు అమెరికా గ్రీన్ కార్డ్‌లో కొత్త చిక్కులు.. సెప్టెంబర్ 18 నుంచి కఠిన నిబంధనలు
రచయిత: శ్రీశైలం దూడం
USA Visa Issue: అమెరికా అంటే మన పిల్లలకు ఒక దేశం కాదు.. ఒక కల. ఆ కల కోసం జగిత్యాల నుంచి జగ్గయ్యపేట వరకు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. దేశంలోని ఎన్నో కుటుంబాలు తమ పిల్లల అమెరికా చదువుల కోసం పొలాలు అమ్మి, అప్పులు చేసి, బ్యాంకుల్లో విద్యా రుణాలు తీసుకుని తమ భవిష్యత్తును పణంగా పెడుతున్నాయి. చదువు.. ఆ తర్వాత ఉద్యోగం.. అక్కడే జీవితం. గత మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ దారిలో ఇప్పుడు బోర్డులు మారుతున్నాయి. త్వరగా రండి.. లేకపోతే కష్టం అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
రెండు పరిణామాలు ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చకు వస్తున్నాయి. ఒకటి.. సెప్టెంబర్ 15లోపు అమెరికా చేరుకోవాలన్న హడావుడి. రెండోది.. హెచ్-1బీ వీసాకు ఏకంగా 1,03,265 డాలర్ల అదనపు రుసుము ప్రతిపాదన.
ఆగస్టు 24న అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఫెడరల్ రిజిస్టర్లో ఉంచిన ప్రతిపాదన ప్రకారం, సాధారణ హెచ్-1బి రుసుముకు అదనంగా ఈ భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ 65 వేల వీసాల పరిమితితోపాటు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత డిగ్రీ పొందిన వారికి కేటాయించే మరో 20 వేల వీసాలకూ ఇది వర్తించనుంది. అయితే వీసా పరిమితి నుంచి మినహాయింపు పొందిన దరఖాస్తులకు ఈ అదనపు రుసుము వర్తించదు. ఇది ఇంకా తుది చట్టం కాదు. 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అసలు ఆలోచించాల్సింది లక్ష డాలర్ల గురించి మాత్రమే కాదు. ఒక మనిషి ప్రతిభకు ఇంతటి ధర కడితే దాని ప్రభావం ఏమిటన్నదే.
భారతీయులకే ఎందుకు ఎక్కువ ప్రభావం?
హెచ్-1బి వీసా దరఖాస్తుల్లో భారతీయుల వాటా అత్యధికం. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదిత హెచ్-1బి పిటిషన్లలో భారతీయుల వాటా దాదాపు 71 శాతంగా ఉంది. అందుకే అమెరికా వలస విధానంలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రకంపనలు ముందుగా భారతదేశంలోనే కనిపిస్తాయి.
అమెరికా చిన్న దగ్గు తీసినా.. మనకు జలుబు చేసినట్టే!
ఇది కేవలం వీసా సమస్య కాదు. అమెరికాలో చదువుతున్న విద్యార్థి వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఒకరి కల కోసం తల్లిదండ్రుల పొదుపు, బ్యాంకు రుణం, ఆస్తి, అప్పు.. అన్నీ పెట్టుబడిగా మారతాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తే ఆ రుణం తీర్చుకోవచ్చు. లేకపోతే అదే కుటుంబానికి ఆర్థిక భారం అవుతుంది. అందుకే అమెరికా విధానంలో వచ్చే ప్రతి మార్పును భారతీయ కుటుంబాలు ఇంత తీవ్రంగా గమనిస్తున్నాయి.
ఈ బంధం నిన్న మొన్నటిది కాదు
అమెరికా విద్యాబంధానికి స్వాతంత్య్రం తర్వాతే అధికారికంగా బలమైన పునాది పడింది. 1950లో భారత్, అమెరికాల మధ్య విద్యా మార్పిడి కార్యక్రమాలకు సంస్థాగత బాట ఏర్పడింది. ఆ తర్వాత ఉన్నత విద్య, పరిశోధన, విజ్ఞాన రంగాల్లో ఇరు దేశాల అనుబంధం పెరిగింది. మొదట కొద్దిమంది విద్యార్థుల ప్రయాణంగా మొదలైన ఈ ప్రవాహం కాలక్రమంలో భారీ విద్యా ఉద్యమంగా మారింది.
సాంకేతిక విద్య, సమాచార సాంకేతిక రంగాల విస్తరణతో అమెరికా భారతీయ యువతకు మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది. చదువు తర్వాత శిక్షణ, ఉద్యోగం, పరిశోధన, వృత్తి అవకాశాలు ఈ సంబంధాన్ని మరింత బలపరిచాయి. 2024 విద్యా సంవత్సరంలో అమెరికాలో 3,63,019 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారంటే ఈ అనుబంధం ఎంత విస్తరించిందో అర్థమవుతుంది. ఇప్పుడు అదే ప్రయాణం కొత్త నిబంధనల ముందు నిలబడింది.
సెప్టెంబర్ 15.. ఎందుకీ హడావుడి?
ఎఫ్-1 విద్యార్థులు, జె-1 విద్యావేత్తల ప్రవేశానికి సంబంధించి అమెరికా కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానానికి బదులుగా నిర్దిష్ట కాలపరిమితి విధించే నిబంధన సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. కొత్త విధానంలో అమెరికాలోకి ప్రవేశించే వారికి కోర్సు వ్యవధి లేదా నిర్ణయించిన గరిష్ఠ కాలానికి అనుగుణంగా గడువు ఉంటుంది. అదనపు సమయం అవసరమైతే ప్రత్యేక ప్రక్రియను అనుసరించాల్సి రావచ్చు.
అందుకే కొన్ని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు సెప్టెంబర్ 15లోపు అమెరికా చేరుకోవాలని సూచిస్తున్నాయి. విదేశీ చదువు అంటే కేవలం తరగతులు, పరీక్షలతో ముగిసేది కాదు. పరిశోధన, ప్రాజెక్టులు, శిక్షణ, ఉద్యోగ అన్వేషణకు సమయం అవసరం. ప్రతి దశలో కొత్త అనుమతులు, అదనపు వ్యయాలు పెరిగితే మధ్యతరగతి కుటుంబాలపై భారం తప్పదు.
దీనికి తోడు ఎఫ్-1 విద్యార్థుల ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పైనా భారీ రుసుము విధించే ఆలోచనపై చర్చ జరుగుతోంది. అది అమల్లోకి వస్తే చదువు తర్వాత అమెరికాలో పని అనుభవం పొందాలనుకునే విద్యార్థులకు మరో ఆర్థిక అడ్డంకి ఏర్పడుతుంది.
ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. అమెరికా ప్రపంచంలోని ప్రతిభావంతులను ఆకర్షించి దాని ఆర్థిక వ్యవస్థకు ఉపయోగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీసా రుసుములు, కఠిన నిబంధనలు పెరిగితే ప్రతిభావంతులైన విద్యార్థులు ఇతర దేశాల వైపు మళ్లే అవకాశం కూడా ఉంది. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అమెరికా విధాన మార్పులు చివరకు అమెరికాకు ఎంత ప్రయోజనం ఇస్తాయో కాలమే చెప్పాలి.
అసలు మనం మర్చిపోతున్న ప్రశ్న
అమెరికా వెళ్లడం తప్పు కాదు. ఉన్నత విద్య చదవడం తప్పు కాదు. మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడటం కూడా తప్పు కాదు. ప్రపంచాన్ని చూడాలి. కొత్త సాంకేతికత నేర్చుకోవాలి. మంచి జీవితం నిర్మించుకోవాలి. కానీ ఆ ప్రయాణంలో మనుషులను, ముఖ్యంగా మనల్ని పెంచిన తల్లిదండ్రులను మర్చిపోవడం మాత్రం విజయానికి కొలమానం కాకూడదు.
ఒక తండ్రి తన కొడుకును అమెరికా పంపడానికి జీవితమంతా కష్టపడతాడు. పొలం అమ్ముతాడు.. అప్పు చేస్తాడు.. బ్యాంకులో విద్యారుణం తీసుకుంటాడు.. తన సౌకర్యాలను త్యాగం చేస్తాడు. కొడుకు అక్కడ స్థిరపడిన తర్వాత నెలకు రెండు వీడియో కాల్స్‌తో బంధం ముగిసిపోకూడదు.
తండ్రికి అనారోగ్యం వచ్చినా.. తల్లి ఆస్పత్రిలో ఉన్నా.. పక్కన ఉండలేని పరిస్థితి రావచ్చు. చివరికి వారు కన్నుమూస్తే చివరి చూపు కూడా చూడలేక వీడియో కాల్లో అంత్యక్రియలు చూసే దుస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదు.
అదే కొడుకు, కోడలికి సంతానం పుడితే మాత్రం తల్లిదండ్రులే గుర్తుకొస్తారు. డెలివరీ సమయంలో అమెరికా వెళ్లాలి. నెలల తరబడి వండి పెట్టాలి. మనవడిని చూసుకోవాలి. కోడలికి అండగా నిలవాలి. బాధ్యత పూర్తయ్యాక మళ్లీ స్వదేశానికి రావాలి.
ఇది కుటుంబబంధమా? లేక అవసరానికి అనుగుణంగా బంధాలను ఉపయోగించుకునే జీవనవిధానమా?
డబ్బు కావాలి.. భవిష్యత్తు కావాలి. కానీ కన్నవారిని కన్నీళ్లలో వదిలి సంపాదించే డాలర్లకు విలువ ఎంత? మన సంస్కృతిలో తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావిస్తాం. ఆ దైవాల చివరి రోజుల్లో పక్కన నిలబడలేని దూరం మన అభివృద్ధికి ప్రశ్నార్థకం కాకూడదా?
అమెరికా వెళ్లడం తప్పు కాదు. కానీ కన్నవారిని కన్నీళ్లలో వదిలి అక్కడ స్థిరపడటమే విజయమా? అన్న ప్రశ్న ప్రతి కుటుంబం తనను తాను అడగాలి.
మన పిల్లలకు స్వదేశంలోనే భవిష్యత్తు లేదా?
ఇది అమెరికాను నిందించే ప్రశ్న కాదు. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం. మన పిల్లలు మంచి ప్రయోగశాల కోసం, మంచి విశ్వవిద్యాలయం కోసం, మంచి ఉద్యోగం కోసం ఎందుకు ఏడు సముద్రాలు దాటాలి? ప్రపంచస్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు, సాంకేతిక సంస్థలు, అధిక నైపుణ్య ఉద్యోగాలు మన దేశంలోనే ఎందుకు పెరగకూడదు?
ప్రభుత్వాలు విద్యపై ఖర్చు పెంచాలి. పరిశోధనకు ప్రోత్సాహం ఇవ్వాలి. విశ్వవిద్యాలయాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలి. యువతకు ఉద్యోగాలు సృష్టించాలి. అప్పుడు అమెరికా వెళ్లడం ఒక తప్పనిసరి మార్గం కాకుండా ఒక ఎంపిక మాత్రమే అవుతుంది.
చివరిగా ఒక్క మాట.. అమెరికా తలుపులు పూర్తిగా మూసుకోలేదు.. కానీ వాటి నిబంధనలు మారుతున్నాయి. ఇక ముందు ప్రతిభతోపాటు ఆర్థిక స్థోమత, నిబంధనల అవగాహన, సరైన సమయ నిర్ణయం కూడా అవసరమవుతాయి. అమెరికా నిబంధనలు మన పిల్లల కలలను పరీక్షిస్తున్నాయి. కానీ అవి మనకు వేస్తున్న అసలు ప్రశ్న మరొకటి..
మీ పిల్లల భవిష్యత్తును మీ దేశంలోనే మీరు నిర్మించగలరా? దీనికి సమాధానం అమెరికా చెప్పదు. మనమే చెప్పుకోవాలి.