అరాచకంలోకి జారుతున్న రాజకీయ నిరసనలు
Party logos in Telangana
రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయనేది నిర్వివాదాంశం. పార్టీలు తమ ప్రత్యర్థులను శతృవులుగా చూస్తున్నాయి. పరస్పరగౌరవం ఎదురుపడినప్పుడు ముఖస్తుతి పలకరింపులు లేదా చిరునవ్వులు తప్ప నామమాత్రమైనా కానరాదు. రాజకీయాల్లో విమర్శలకు ఆరోపణలకు తేడా మాసిపోయింది. భాష సంస్కారం కోల్పోయి బజారున పడింది. ఇప్పుడంతా వార్తాఛానళ్ల ప్రత్యక్ష ప్రసారం కాబట్టి ఎంత పరుషంగా మాట్లాడితే, ఆందోళనల్లో ఎంత గింజుకుంటే అంత ఆదరణ వస్తుందని భ్రమపడుతున్నారు అతిని వీక్షకులు అసహ్యించుకుంటారన్న స్పృహ మచ్చుకైనా కనిపించటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పెచ్చరిల్లుతున్న ద్వేషం వికటించి తాజాగా ప్రత్యర్థుల పార్టీ కార్యాలయాలపై దాడుల స్థాయికి చేరటం విచారకరం. ఆయా పార్టీల అగ్రనాయకులు వెంటనే జోక్యం చేసుకు ని ఈ మతిమాలిన చిచ్చును ఆర్పకపోతే అది తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న పార్టీ అధికారంలో ఉంటుంది, మిగతా పార్టీలు ప్రతిపక్షంగా ఉంటాయి. పరిపాలనలో లోపాలు, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వంటి అంశాలపై ప్రతిపక్షపార్టీలు, విమర్శలు లేదా ఆరోపణలు చేయటం, వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పటం పరిపాటి. ప్రభుత్వ విధానం లేదా వైఖరి ప్రజా వ్యతిరేకంగా ఉందని భావించినపుడు ప్రతిపక్ష పార్టీ ప్రజలను సమీకరించి నిర్దిష్ట ప్రదేశంలో, పోలీసు అనుమతిలోని షరతులకు లోబడి ఆందోళన కార్యక్రమం నిర్వహించటం అనుసరించవలసిన సాంప్రదాయం. కొన్ని సందర్భాల్లో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాటలు, ఉద్రిక్తతలు పెరిగిపోయి శాంతి యంత్రాం గం బలప్రయోగానికి దిగటం చూస్తుంటాం. కాని ఇటీవల కాలంలో ఆందోళనకారులు 50 ఉన్నా టివి, నాయకుల దుర్భాషలకు దీటుగా, కెమెరాలు కనబడగానే రెచ్చిపోవటం పెచ్చుపెరుగుతున్నది.
యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో జరిగిన ఘర్షణాపూరిత ఘటనలనుంచి రెండు పార్టీలు గుణపాఠం తీసుకోవాలి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి రాష్ట్ర కార్యాలయంపైకి రావటానికి కారణం రాజకీయంగా ఎదుర్కోవలసింది తప్ప వీధుల్లో తేల్చుకునేది కాదు. ఉత్తరాఖండ్‌లోని హల్‌ద్వానిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే గత నెలలో ఒక సభలో ప్రసంగించిన అనంతరం స్థానిక బిజెపి వారు ఆ ప్రదేశాన్ని శాస్త్రోక్తంగా శుద్ధి చేశారన్నది ఆరోపణ. ఆ విషయాన్ని ఖర్గే స్వయంగా రాజ్యసభలో ప్రస్తావించారు. దాన్ని సభాధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి సహా పలువురు ఖండించారు. అంటరానితనాన్ని నిషేధించిన, నేరంగా పరిగణిస్తున్న రాజ్యాంగ ఆదేశానికి విరుద్ధమైన శుద్ధీకరణపట్ల బిజెపి వారు మౌనం వహించారు. ఉత్తరాఖండ్ పోలీసులు ఇంతవరకు నేరస్థులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. చిత్రమేమంటే కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి అవమానపరిచిన శుద్ధీకరణ చర్యను “బిజెపి కులతత్వ ఆలోచనా ధోరణికి నిదర్శనం” అని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధి విమర్శించినందుకు అదే ఉత్తరాఖండ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. రాజకీయ విమర్శలపై దేశంలో పలుచోట్ల కేసులు రిజిస్టర్ చేసి రాహుల్‌గాంధిని వేధించటానికి బిజెపి అధినాయకత్వం ఒక విభాగాన్నే ఏర్పాటు చేసినట్లుంది. ఇటీవల సంవత్సరాల్లో ఆయనపై అటువంటి కేసుల సంఖ్య పెరిగింది.
కాబట్టి రాహుల్‌గాంధిపై తాజా కేసు నమోదు ఆయన పార్టీ వారికి, అభిమానులకు ఆగ్రహం కలుగజేయటం సహజం. అందుకువారు గాంధి బోధించిన సత్యాగ్రహ మార్గం అనుసరించటం ద్వారా బిజెపిని ఎండగట్టి ఉండవచ్చు. కానీ హైదరాబాద్‌లో కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌కు కొద్ది దూరంలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంపైకి దండెత్తటం, దాని గేట్లపై నల్లరంగు పోయటం, అడ్డగించిన పోలీసులతో వీరంగం అనుమతించరాని నాటకీయ ప్రదర్శన. ఆ తర్వాత అక్కడికి చేరిన బిజెపి కార్యకర్తలు గాంధీభవన్ వద్దకు వెళ్లి కోడిగ్రుడ్లు విసిరారు. ఇక్కడ ఈ గొడవ సద్దుమణిగిందో లేదో నల్లగొండలో కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు ఘర్షణపడ్డారు. జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నాయకత్వంలో బిజెపి కార్యకర్తల సమూహం, శ్రీనగర్ కాలనీలోని రోడ్లు భవనాలమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీసుకు చేరి కటౌట్, ప్లెక్సీలు తగలబెట్టారు. గుడ్లు, టమోటాలు విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి జిల్లా కార్యాలయానికి చేరి సామాగ్రి ధ్వంసం చేశారు. వర్షిత్‌రెడ్డి తల్లి ఇంట్లోకి చొరబడి దూషించటం మరీ దారుణం, ఖండనార్హం.
మంగళవారంనాడు అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో రెండు పార్టీల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్‌రావును పరామర్శకు నల్లగొండకు వెళ్లకుండా గృహనిర్బంధంలో ఉంచిన పోలీసు చర్యను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖండించారు.
కార్యాలయాలు, ఇళ్లపై దౌర్జన్యాలు రాజకీయం కాదు, రౌడీయిజం అవుతుంది. ఈ పరస్పర దౌర్జన్యాలను ఇంతటితో ఆపండి. అవి కొనసాగితే రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వం వైఫల్యమే అవుతుంది. ఏ పార్టీకైనా చట్టం పరిధిలో ఆందోళన నిర్వహించే అవకాశం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాన్ని దుర్వినియోగం చేసి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే శిక్షార్హులవుతారు. ఈ విషయంలో తమ కార్యకర్తలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత పాలకపార్టీపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ప్రభుత్వం నడుపుతున్న పార్టీ, అరాచక చర్యల పర్యవసానాలు అనుభవించాల్సిన పార్టీ.