ఉద్యోగుల పోరుబాట
unemployment
ఉజ్జిని రత్నాకర్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు కావస్తున్నప్పటికీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొన్ని హామీలు పరిష్కారానికి కృషి చేస్తున్నప్పటికీ ప్రధాన డిమాండ్స్ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. అందు లో ముఖ్యమైనవి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు కొంత గడువు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 32 మాసాలు పూర్తి అయినప్పటికీ ప్రధాన డిమాండ్లను పరిష్కరించకుండ హామీలు ఇస్తూ పెండింగ్‌లోనే ఉంటున్నాయి.
ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కానీ నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 32 నెలలు గడిచిన ఉద్యోగులకు ఇచ్చిన ప్రధాన హామీ ల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్న భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకు పోయింది. ఉద్యోగ సంఘాల జెఎసి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిని ఇతర మంత్రులను కలుసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో ఆందోళన కార్యక్రమాలను సైతం వాయిదా వేస్తువస్తున్నారు. కానీ పరిష్కారం కాకపోవటంతో ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఆగస్టు 18న సమావేశమైన ఉద్యోగ సంఘాలు డిమాండ్ల సాధనకై పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు.
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జెఎసి
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్స్ కలుపుకొని 9 లక్షల మంది వరకు ఉంటారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఉద్యోగ సంఘాల జెఎసిలు సమావేశమై ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. అందు లో బాగానే ఆగస్టు 27న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల లో పాటు హైదరాబాదులో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న పెన్షనర్స్ ‘న్యూపింఛన్ వద్దు’ ‘ఓల్డ్ పింఛన్’ కావాలని ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్‌కు పిలుపివ్వడం ప్రభుత్వం పట్ల ఉద్యోగులు పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. ఇది కేవలం ఉద్యోగ సంఘాల ఉద్యమం కాదు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు :
మొదటి డిమాండు పిఆర్సి అమలు చేయాలి. జులై 1,2023 నుంచి మూడో పిఆర్సి అమలు కావాల్సి ఉంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పిఆర్సి కమిటీ ఏర్పాటు చేసి ఐదు శాతం మధ్యంతర భృతి ప్రకటించింది. కమిటీ ఏర్పాటయి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా నివేదిక ఎప్పుడు వస్తుందో పిఆర్సి ఎప్పుడూ అమలు చేస్తారో ఉద్యోగులకు స్పష్టత లేదు.
రెండవ డిమాండు జులై 2023 నుంచి జులై 2026 వరకు పెండింగ్‌లో ఉన్న డిఏ లను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల లెక్క ప్రకారం పెండింగ్ డిఎలు రాని కారణంగా ఒక్కొక్క ఉద్యోగి ప్రతినెల సుమారు రూ.10వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రెండు డిఎలతో పాటు ఈ ప్రభుత్వం నాలుగు డిఎలు పెండింగ్‌లో పెట్టింది. నేడు మొత్తం ఆరు డిఎలు పెండింగ్‌లో ఉన్నాయి. తక్షణమే చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన 3వ డిమాండు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ సంబంధిత బకాయిలు, గ్రాట్యుటీ, జిపిఎఫ్, ఎన్‌కాష్‌మెంటు తదితర ప్రయోజనాలు పూర్తి గా అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2004 మార్చి నుంచి 2026 జులై వరకు ఉద్యోగ విరమణ చేసిన సుమారు 27,482 మంది ఉద్యోగులకు పెన్షన్ బకాయిలైన డబ్బుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొందరు ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను పొందుతున్నారు. ఈ విధంగా రిటర్మెంట్ అయిన ఉద్యోగులకు రూ.15 వేల కోట్లవరకు చెల్లించవలసి ఉన్నది.
నగదు రహిత వైద్య సేవలు : నాలుగో డిమాండు ఉద్యోగులకు హెల్త్ కార్డులు, నగదు రహిత వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందుకోసం ఉద్యోగుల జీతాల నుంచి 1.5% ఆరోగ్య పథకం పేరుతో కోత ప్రారంభించినప్పటి కీ అనేక సందర్భాల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఆసుపత్రుల యజమాన్యాలతో సమగ్రంగా చర్చించి స్పష్టమైన విధివిధానాలు రూపొందించినప్పటికీ ఉద్యోగులకు నిరంతరాయంగా వైద్య సేవలు అందుటం లేదు. వైద్య సేవలు అందించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలి :
ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రైతులు, నిరుద్యోగులు ఇతర వర్గాల సమస్యలు పరిష్కా రం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పిఆర్సి, డిఎలు, సిపిఎస్ పెన్షన్ బకాయిలు, హెల్త్ కార్డులు తదితర అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి.
ఉద్యోగులు ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగం వారి అసంతృప్తిని నిర్లక్ష్యం చేస్తూ దాని ప్రభావం పాలన పై పడటం సహజం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో ఉద్యోగులు పోషించిన పాత్రను తెలంగాణ సమాజం మర్చిపోలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ చేస్తున్న పోరాటానికి కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తక్షణమే ఉద్యోగ సంఘాల జెఎసిలతో చర్చలు జరిపి సాధ్యమైనంతవరకు వాటి అమలు కొరకు కార్యాచరణ ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.