Skip to content
తెలంగాణ వార్తలు

TGSRTC Recruitment Update: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. TGSRTCలో త్వరలో 1,500 కండక్టర్ ఉద్యోగాలు

Prajapaksham 02 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
TGSRTC Recruitment Update: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. TGSRTCలో త్వరలో 1,500 కండక్టర్ ఉద్యోగాలు

TGSRTC Recruitment 2026: టీజీఎస్‌ఆర్టీసీలో భారీ నియామకాలు.. రాత పరీక్ష లేకుండా 1,500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

TGSRTC Recruitment Update: తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన శుభసందర్భంగా రవాణా శాఖ మరియు టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) సాధించిన ఘన విజయాలు, చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడంతో పాటు మహిళలు, ప్రయాణికులు, సంస్థ కార్మికులకు సంక్షేమాన్ని అందించేలా పాలన సాగిస్తున్నామని, టీజీఎస్‌ఆర్టీసీని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే చారిత్రాత్మక ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి గుర్తుచేశారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 347.36 కోట్ల మంది మహిళలు సురక్షితంగా ప్రయాణించారని, తద్వారా వారు ఏకంగా రూ.12,167 కోట్ల ప్రయాణ ఖర్చును ఆదా చేసుకోగలిగారని వివరించారు. ఈ పథకంతో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ రేటు 67 శాతం నుండి 89 శాతానికి గణనీయంగా పెరిగిందని తెలిపిన మంత్రి, దేశంలోనే తొలిసారిగా 600 బస్సులకు మహిళలనే యజమానులుగా చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు.

ప్రయాణికుల సౌకర్యం మరియు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సంస్థలో భారీగా కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 2,932 కొత్త బస్సులను కొనుగోలు చేయగా, వాటిలో 1,024 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే రోడ్డెక్కాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు మరో 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు.

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రెండు పీఆర్సీలు అమలు చేయడంతో పాటు 5 డీఏలను మంజూరు చేశామని, ప్రస్తుతం ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదని మంత్రి స్పష్టం చేశారు. 1,424 కారుణ్య నియామకాలు పూర్తి చేయడంతో పాటు, గతంలో ఉద్యోగాల నుండి తొలగించిన 244 మందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. కొత్తగా 4,538 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటికే 1,000 డ్రైవర్, 743 శ్రామిక పోస్టుల ఎంపిక పూర్తయిందని, త్వరలోనే 1,500 కండక్టర్ పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గిస్తూనే సీసీఎస్, పీఎఫ్ బకాయిలను తీర్చామని, యూనియన్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.