Skip to content
జాతీయం వార్తలు

Badlav zaroori Hai: దేశంలో విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న బీజేపీ.. గద్దె దించడమే యువత లక్ష్యం: AISF జాతీయ అధ్యక్షుడు విరాట్ దేవాంగ్

Krishna Rao 01 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Badlav zaroori Hai: దేశంలో విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న బీజేపీ.. గద్దె దించడమే యువత లక్ష్యం: AISF జాతీయ అధ్యక్షుడు విరాట్ దేవాంగ్

Badlav zaroori Hai: దేశంలో విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న బీజేపీ.. గద్దె దించడమే యువత లక్ష్యం: AISF జాతీయ అధ్యక్షుడు విరాట్ దేవాంగ్

Badlav zaroori Hai: విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామిక వాతావరణాన్ని దెబ్బతీసి, వాటిని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలకు అడ్డాలుగా మారుస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ‘అర్బన్ నక్సల్స్’, ‘దేశద్రోహులు’ అని ముద్రవేసి వేధిస్తున్నారు.

Badlav zaroori Hai: ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సీపీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘బద్లావ్ జరూరీ హై’ జాతీయ బహిరంగ సభలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జాతీయ అధ్యక్షుడు విరాట్ దేవాంగ్ ప్రసంగించారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించాయని, ప్రశ్నించే విద్యార్థుల గొంతు నొక్కుతున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా విరాట్ దేవాంగ్ మాట్లాడుతూ… “గత పుష్కర కాలంగా ఈ ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న తీరును విద్యార్థి లోకం ప్రశ్నిస్తూనే ఉంది. విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామిక వాతావరణాన్ని దెబ్బతీసి, వాటిని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలకు అడ్డాలుగా మారుస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ‘అర్బన్ నక్సల్స్’, ‘దేశద్రోహులు’ అని ముద్రవేసి వేధిస్తున్నారు. విద్యార్థుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి రిజర్వేషన్ల పేరుతో కుట్రలు పన్నుతూ, యువతను ‘దిమాగీ నక్సల్స్’ అని పిలుస్తున్న సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది” అని విమర్శించారు.

జీడీపీలో 6 శాతం నిధులు ఏవి?

1968 విద్యావిధానం నాటి నుంచి విద్యారంగానికి జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్‌ఎఫ్ పోరాడుతోందని, కానీ ఈ ప్రభుత్వం కేవలం 0.39 శాతం మాత్రమే ఖర్చు చేస్తోందని దేవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “కరోనా కష్టకాలంలో రైతులపై వ్యవసాయ చట్టాలు, కార్మికులపై లేబర్ కోడ్‌లను ఎలా రుద్దారో, అదే విధంగా విద్యార్థులపై 2020 నూతన జాతీయ విద్యా విధానాన్ని (NEP) బలవంతంగా రుద్దారు. యూజీసీ బడ్జెట్‌ను కోత కోస్తూ, యూనివర్సిటీలకు గ్రాంట్లకు బదులు అప్పులు (లోన్స్) ఇచ్చే విధానాన్ని తెస్తున్నారు. గత పదేళ్లలో ఏకంగా 94 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. మోడల్ స్కూల్స్ పేరుతో 15-20 కిలోమీటర్ల దూరంలో క్లస్టర్ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ, కమ్యూనిస్టుల పోరాటంతో సాధించుకున్న విద్యా హక్కు చట్టాన్ని (RTE) నిర్వీర్యం చేస్తున్నారు” అని ఆరోపించారు.

80 ఏళ్లలో లేనంత నిరుద్యోగం

దేశంలో గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం ప్రబలిందని విరాట్ దేవాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్, ఉపాధ్యాయ, యూనివర్సిటీ పోస్టులు సహా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్నీ భర్తీ చేయడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. యూపీఏ-1 ప్రభుత్వంలో వామపక్షాల మద్దతుతోనే దేశంలో విద్యా హక్కు, సమాచార హక్కు, ఉపాధి హామీ లాంటి చట్టాలు వచ్చాయని, నేడు బీజేపీ వాటిని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు.

భయపడుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్

ఇటీవల జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది విద్యార్థులు, యువత చేసిన ఆందోళనతో ఢిల్లీ పాలకుల వెన్నులో వణుకు పుట్టిందని దేవాంగ్ అన్నారు. “అధికారం చేజారిపోతుందన్న భయంతోనే ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ ఇప్పుడు మాట మారుస్తున్నారు. దేశ యువతను దేశద్రోహులు అనొద్దని, విద్యారంగానికి 6 శాతం నిధులు కేటాయించాలని ఆయన మాట్లాడాల్సి రావడం మన విద్యార్థి ఉద్యమ విజయమే. బ్రిటిష్ వారితో పోరాడిన ఘన చరిత్ర కమ్యూనిస్టులది. ఈ దేశ యువత, విద్యార్థులు, రైతులు, కార్మికులు అంతా ఏకమై ‘బద్లావ్ జరూరీ హై’ అనే నినాదాన్ని తమ సొంత నినాదంగా స్వీకరించారు. హిట్లర్ వారసులైన ఈ నియంతృత్వ, ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు యువత విశ్రమించదు” అని ఆయన ఉద్ఘాటించారు.