CPI Badlav Zaroori Hai Rally: ఎర్రసంద్రంలా మారిన రాంలీలా మైదానం…బద్లావ్ జరూరీ బహిరంగ సభ విజయవంతం…కేంద్రంలో అధికార మార్పిడి అత్యవసరం: డి రాజా పిలుపు..
CPI Badlav Zaroori Hai Rally
CPI Badlav Zaroori Hai Rally: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) సమరశంఖం పూరించింది. న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన భారీ “బద్లావ్ జరూరీ” బహిరంగ సభకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు, శ్రామికులు, యువత తరలివచ్చారు. ఈ బహిరంగ సభను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రారంభించి ప్రసంగించారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సంక్షోభాల నుంచి విముక్తి కలగాలంటే కేంద్రంలో అధికార మార్పిడి అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.
పదేళ్ల మోదీ పాలనలో దేశం ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయిందని రాజా విమర్శించారు. విదేశాంగ విధానంలో అమెరికా, ఇజ్రాయెల్ లబ్ధి కోసం భారత్ పాత మిత్రదేశాల బంధాలను దెబ్బతీసుకుంటోందని, రష్యా నుంచి చమురు కొనవద్దని అమెరికా ఆదేశించడం భారత సార్వభౌమాధికారంపై జరుగుతున్న దాడి అని మండిపడ్డారు.
కార్పొరేట్ల సేవలకే ‘మోదీ గ్యారంటీ’:
‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ అనేది ఉత్తుత్తి నినాదమని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ అదానీ, అంబానీల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. మైనింగ్ చట్టం సవరణల ద్వారా రాష్ట్రాల ఫెడరల్ హక్కులతో పాటు ఆదివాసీల ‘జల్-జంగల్-జమీన్’ హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.
దళితులు, మహిళలపై తీవ్ర దాడులు:
దేశంలో దళితులు, ఆదివాసీలభద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పర్యటించిన ప్రాంతాన్ని ఉత్తరాఖండ్‌లో ‘శుద్ధి’ చేయడం దేశానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత అని చెబుతూనే, 33% మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో వాయిదా వేస్తున్నారని విమర్శించారు.
మతోన్మాదం, రాజ్యాంగ పరిరక్షణ:
గాంధీజీ బోధించిన మత సామరస్యాన్ని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిర్మించిన లౌకిక రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు దెబ్బతీస్తున్నాయని రాజా ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఒకలా, దేశంలో మరోలా మాట్లాడుతూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
భవిష్యత్ కార్యాచరణకు పిలుపు:
మోదీ ప్రభుత్వ అణచివేత ధోరణులకు భయపడేది లేదని, ఎర్రజెండా నిరంతరం ప్రజల పక్షాన నిలబడుతుందని రాజా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి సీపీఐ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. అక్టోబర్ 2 (గాంధీ జయంతి) సందర్భంగా దేశవ్యాప్తంగా లౌకికత్వం, మత సామరస్య పరిరక్షణ దినంగా పాటించడం. నవంబర్ 7 (అక్టోబర్ విప్లవ దినోత్సవం): దోపిడీ రహిత, సోషలిస్ట్ సమాజ నిర్మాణం కోసం కార్మిక, శ్రామిక వర్గాల ఐక్యతా ప్రచారం. డిసెంబర్ 1 – 3: కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా “జైల్ భరో” ఆందోళనలకు పిలుపునిచ్చారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను అధికారానికి దూరంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పి. సంతోష్ కుమార్, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ అమర్‌జీత్ కౌర్, ఢిల్లీ సీపీఐ కార్యదర్శి ప్రొఫెసర్ దినేష్ వర్షే తో పాటు వివిధ రాష్ట్రాల సీపీఐ ముఖ్య నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Teachers’ Day 2026 Speech Ideas: నేడు టీచర్స్ డే సందర్భంగా మంచి స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారా..అయితే చక్కటి స్పీచ్ మీకోసం..
- Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…
- Happy Teachers Day 2026 Telugu Wishes: మీ బంధుమిత్రులు, స్నేహితులకు టీచర్స్ డే విషెస్ షేర్ చేయండి..
- Happy Teachers Day 2026 Wishes In Telugu: మీ టీచర్లు, స్నేహితులు, బంధు మిత్రులకు Messages, Quotes, Images రూపంలో Whatsapp Status, Facebook కోసం గ్రీటింగ్స్ మీకోసం..
- El Niño 2027 Alert: ప్రపంచానికి పెనుముప్పు తీసుకొస్తున్న చిన్న బాలుడు.. భారీ వర్షాలు, కరువు, తీవ్ర వేడి ముప్పు.. WMO తీవ్ర హెచ్చరిక