Tamil Nadu: మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి యత్నం.. కామాంధుడిని తరిమి తరిమి కొట్టిన వీధి కుక్కలు.. వీడియో ఇదిగో..
Tamil Nadu
Tamil Nadu: తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళపై జరిగిన లైంగిక దాడి యత్నాన్ని వీధి కుక్కల గుంపు సమయస్ఫూర్తితో అడ్డుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తుడియలూరు సమీపంలోని ఎన్జీజీఓ కాలనీ-అశోకపురం రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైనట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం, తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో బాధిత మహిళ రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చుని ఉంది. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ యువకుడు ఆమె వద్దకు చేరుకున్నాడు. మహిళ చుట్టుపక్కల తరచూ తిరిగే రెండు వీధి కుక్కలు యువకుడి ప్రవర్తనను గమనించి గట్టిగా మొరగడం ప్రారంభించాయి. దీంతో వాటిని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు అతడు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
మొదట కుక్కలపై రాళ్లు విసిరి వాటిని భయపెట్టేందుకు ప్రయత్నించిన యువకుడు, ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆపదలో ఉన్న మహిళ కేకలు వేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సమీపంలో ఉన్న కుక్కలు ఆమె అరుపులు విని వెంటనే అక్కడికి చేరుకున్నాయి.
కొద్ది క్షణాల్లోనే కుక్కల గుంపు నిందితుడిపైకి దూసుకెళ్లింది. ఒక కుక్క అతడిపైకి దూకి దాడి చేయగా, మరో కుక్క అతడి కాళ్లను పట్టుకుని మహిళ నుంచి దూరంగా లాగేందుకు ప్రయత్నించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించినట్లు సమాచారం. కుక్కల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో యువకుడు తన ప్రయత్నాన్ని విరమించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కుక్కలు అతడిని కొంత దూరం వరకు వెంబడించినట్లు తెలుస్తోంది.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తుడియలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దృశ్యాలను పరిశీలించి నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. బాధిత మహిళకు అవసరమైన సహాయం అందించడంతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో మహిళను రక్షించేందుకు వీధి కుక్కలు చూపిన చొరవ స్థానికులను కదిలించింది. సాధారణంగా వీధి కుక్కల గురించి ఫిర్యాదులు, వివాదాలు వినిపించే సందర్భాల్లో, ఈ ఘటనలో అవే కుక్కలు ఆపదలో ఉన్న మహిళకు రక్షణగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు వాటి సమయస్ఫూర్తిని ప్రశంసిస్తుండగా, సోషల్ మీడియాలోనూ ఈ ఘటనపై విస్తృతంగా స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
- ఢిల్లీలో శక్తివంతమైన రాజ్యం, పౌరుల మధ్య పోరాటం
- ఇలాంటి వారు గవర్నర్‌లా!?
- Abhijeet Dipke Thanks Jagan: సీజేపీ నేతల అరెస్టులపై జగన్ స్పందన.. కృతజ్ఞతలు తెలిపిన అభిజిత్ దీప్కే
- YSRCP Candidates List: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మేయర్, ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ (Andhra Pradesh Municipal Elections)
- Jantar Mantar Protest: నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపుపై.. కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం