Skip to content
తెలంగాణ వార్తలు

Konda Surekha Controversy: నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, మారే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన కొండా సురేఖ..సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని వినతి..

jagan 04 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Konda Surekha Controversy: నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, మారే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన కొండా సురేఖ..సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని వినతి..

Konda Surekha

Konda Surekha Controversy: తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి కొండా సురేఖ, తన పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఊహాగానాలపై తీవ్రస్థాయిలో స్పందించారు. తన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని వ్యాఖ్యలను, పోస్టులను కొందరు ఉద్దేశపూర్వకంగా సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. “త్వరలోనే బిగ్ అప్‌డేట్”, “ఉత్కంఠకు తెరపడనుంది” వంటి శీర్షికలతో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ‘ఎక్స్’ (X) వేదికగా శుక్రవారం స్పష్టం చేశారు. ఇటువంటి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని కోరుతూ, తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పంచుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన మేరకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గురువారం రాత్రి అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. క్రమశిక్షణా రాహిత్యం, బహిరంగ వ్యాఖ్యల నేపథ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరమే ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్లతో సహా పలువురు అగ్రనేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ చర్యలు పూర్తయ్యాయి.

ఈ రాజకీయ పరిణామానికి ప్రధాన కారణం వరంగల్ జిల్లాలో సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలేనని తెలుస్తోంది. గత నెలలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సుస్మిత తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, రాబోయే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున తానే పోటీ చేస్తానని ఆమె ప్రకటించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై పీసీసీ క్రమశిక్షణా సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సురేఖ ఇచ్చిన వివరణపై అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బర్తరఫ్ వైపే మొగ్గు చూపింది.

మంత్రి పదవి ఊడినప్పటికీ, కొండా సురేఖ ప్రభుత్వ నిర్ణయంపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని బ్లాక్‌మెయిల్ చేసి తనను బర్తరఫ్ చేయించారని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఈ రాజకీయ కుట్ర వెనుక ఉన్నారని విమర్శించారు. అయితే, ఏ పరిస్థితుల్లోనూ తాము కాంగ్రెస్ పార్టీని వీడబోమని కొండా సురేఖ స్పష్టం చేశారు. బిజెపిలో చేరుతున్నారని లేదా నూతన ప్రాంతీయ పార్టీ పెడుతున్నారని వస్తున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ “నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను, ఎక్కడికీ వెళ్లడం లేదు” అని తేల్చిచెప్పారు.