Skip to content
తెలంగాణ వార్తలు

Konda Surekha Controversy Explained: ఒక్క సోషల్ మీడియా పోస్ట్.. మంత్రి పదవికి ఎసరు.. కొండా సురేఖ వివాదం వెనుక అసలు కథ ఇదే..

jagan 03 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Konda Surekha Controversy Explained: ఒక్క సోషల్ మీడియా పోస్ట్.. మంత్రి పదవికి ఎసరు.. కొండా సురేఖ వివాదం వెనుక అసలు కథ ఇదే..

Konda Surekha Controversy Explained:

Konda Surekha Controversy Explained: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో వివాదాలు కొత్తేమీ కాదు. వివాదాలు ఆమె చుట్టూ ఎప్పుడూ ఉంటాయనే విమర్శలు వినిపిస్తుంటాయి. అయితే ఈసారి ఆమెను చుట్టుముట్టిన రాజకీయ వివాదం చివరకు మంత్రి పదవి కోల్పోయే వరకు వెళ్లింది. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది పరకాల ఎమ్మెల్యే టికెట్ అంశం వరుస పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తిని పెంచాయి. క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లిన వ్యవహారం చివరకు అధిష్ఠానం స్థాయిలో చర్చకు దారి తీసింది.

పరకాల రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 16న రేవూరి ప్రకాశ్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన జరిగిన కొద్ది రోజులకే కొండా కుటుంబం నుంచి వచ్చిన సోషల్ మీడియా పోస్టులు కొత్త వివాదానికి తెరలేపాయి.

పరకాలకు కాబోయే ఎమ్మెల్యే కొండా సుస్మిత అంటూ కొండా సురేఖ కుమార్తె సుస్మిత తన సోషల్ మీడియా ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు. ‘కొండా టీమ్’ అనే ఖాతాలో వచ్చిన పోస్టును ఆమె తన స్టోరీగా షేర్ చేయడంతో కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. ఇది కేవలం సోషల్ మీడియా పోస్టుగానే ఆగిపోతుందని భావించినప్పటికీ.. మరుసటి రోజు జరిగిన పరిణామాలు వివాదాన్ని మరింత పెద్దదిగా మార్చాయి.

ఆగస్టు 19 సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. కొండా సుస్మిత చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు అనే వ్యాఖ్య రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో కొండా సురేఖ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయవద్దని ఆమె స్పష్టం చేశారు. కానీ అప్పటికే ఈ వ్యవహారం పార్టీ అంతర్గతంగా తీవ్ర అసంతృప్తికి కారణమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగస్టు 21న మీడియా సమావేశం నిర్వహించారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని, రాజీనామా చేయాలని డిమాండ్ అధిష్టానం ముందుకు తీసుకువెళ్లారు. దీంతో వ్యక్తిగత స్థాయిలో మొదలైన వివాదం పూర్తిస్థాయి పార్టీ క్రమశిక్షణ సమస్యగా మారింది.

ఆగస్టు 23న కొండా సురేఖ బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఆగస్టు 24న విదేశీ పర్యటన నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అదే సమయంలో కొండా సురేఖ ఇచ్చిన వివరణపై క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదనే వార్తలు వెలువడ్డాయి. ఇక ఆగస్టు 25న క్రమశిక్షణ కమిటీ నివేదిక కాంగ్రెస్ హైకమాండ్‌కు చేరింది. ఆగస్టు 26న కొండా సురేఖ, కొండా మురళి దంపతులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఆగస్టు 27న ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధికి వెళ్లిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

అయితే వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆగస్టు 28న కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాఖీ కట్టారు. దీంతో వివాదం ముగిసిపోతుందేమోనని భావించారు. కానీ తెరవెనుక పరిణామాలు మాత్రం కొనసాగాయి. సెప్టెంబర్ 2న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో సమావేశమయ్యారు. కొండా సురేఖ వ్యవహారం, పార్టీ క్రమశిక్షణ, భవిష్యత్ పరిణామాలపై చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.

వరుస పరిణామాల అనంతరం సెప్టెంబర్ 3న కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించే నిర్ణయం వెలువడింది. దీంతో దాదాపు రెండు వారాలుగా కొనసాగిన వివాదానికి పుల్ స్టాప్ పడింది. క్లుప్తంగా చెప్పాలంటే ఒక సోషల్ మీడియా పోస్టుతో మొదలైన వివాదం.. కుమార్తె వ్యాఖ్యలు, పార్టీ నేతల ఆగ్రహం, క్రమశిక్షణ కమిటీ నివేదిక, అధిష్ఠానం స్థాయి చర్చల వరకు వెళ్లి చివరకు మంత్రి పదవి కోల్పోయే పరిస్థితికి దారితీసింది. కొండా సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అంశంపై అధిష్ఠానం కఠిన సంకేతాలు ఇచ్చిందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.