Skip to content
ఎడిట్ పేజి వార్తలు

Editorial On Konda Surekha Issue: కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు అంకురార్పణ

Prajapaksham 04 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial On Konda Surekha Issue: కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు అంకురార్పణ

Konda Surekha

Editorial On Konda Surekha Issue: తన వాదనను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వినిపించేందుకు తనకుతానుగా ఢిల్లీ వెళ్లిన సురేఖ ఖర్గేతోపాటు, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌నేగాక కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌ సోనియాగాంధీని కూడా కలుసుకున్నారు. రాహుల్‌గాంధీ, కె.సి. వేణుగోపాల్‌ను కలుసుకునే అవకాశం లభించలేదు.

Editorial On Konda Surekha Issue: మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌, రాష్ట్ర ప్రణాళికా కమిషన్‌ ఉపాధ్యక్ష పదవి నుంచి వనపర్తికి చెందిన సీనియర్‌ నాయకుడు జి.చిన్నారెడ్డి ఉద్వాసనతో 15 రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో పొడచూపిన అసంతృప్తి, అసమ్మతి గణాలపై గురువారం క్రమశిక్షణ కొరడా ఝుళిపించింది కాంగ్రెస్‌ అధిష్టానవర్గం. వారిరువురూ ఏఐసీసీ సభ్యులు కావటంవల్ల రాష్ట్ర కాంగ్రెస్‌ క్రమశిక్షణా సంఘం నివేదిక అందిన తదుపరి అధిష్టానవర్గం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ తదితరులతో చర్చించి నిర్ణయం తీసుకుంది.

తన వాదనను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వినిపించేందుకు తనకుతానుగా ఢిల్లీ వెళ్లిన సురేఖ ఖర్గేతోపాటు, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌నేగాక కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌ సోనియాగాంధీని కూడా కలుసుకున్నారు. రాహుల్‌గాంధీ, కె.సి. వేణుగోపాల్‌ను కలుసుకునే అవకాశం లభించలేదు.

ఆగస్టు 19న కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల సందర్భంగా గీసుకొండలో ఆమె కూతురు సుశ్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయటం వివాదానికి అగ్గి రాజేసింది. మంత్రిగా ఉన్న సురేఖ తల్లిగా స్పందించారేగాని మంత్రివర్గ సహచరిగా తమ ముఖ్యమంత్రిపై కూతురు దూషణలను, దుర్భాషలను ఖండించలేదు. దాదాపు పాతికమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సురేఖ కుమార్తె నోటిదురుసును తల్లి ఖండించకపోవటాన్ని తప్పు పట్టారు. ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు.

కొండా సురేఖ వాదన ఆరోజు నుంచి బుధవారం ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టివరకు ఒకటే—‘నా కుమార్తె స్వతంత్రురాలు. ఆమె అభిప్రాయాలు ఆమె సొంతం. మాకు సంబంధం లేదు. ఆమె వ్యాఖ్యలకు నన్నెలా శిక్షిస్తారు’ అనేదే. తన బిడ్డ ‘రేవంత్‌రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయి… ఆయన అయ్య, తాత ఎవడైనా రానీ…’లాంటి బజారు మాటలతోపాటు, అవినీతి ఆరోపణలు చేయటం ఆమెకు తప్పుగా అనిపించలేదు. అందుకే వాటిని ఆమె ఖండించలేదు.

బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో చర్చల అనంతరం ఆమె తనకు పదవీ గండం తప్పదని గ్రహించినట్లున్నారు. అందుకే బెదిరింపు ప్రకటన చేశారు. తన తొలగింపునకు కుట్ర జరుగుతోందని అంటూ ‘నేను బీసీ మహిళను, నేను పద్మశాలిని. తెలంగాణలో 16 శాతం ఉన్నారు. నా భర్త మున్నూరు కాపు’ అంటూ మహిళ, బీసీ, కులం కార్డులు తీశారు.

అధిష్టానవర్గం గురువారం ఆమె బర్తరఫ్‌కు సీఎంకు అనుమతించాక మరీ చిత్రంగా మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ అధిష్టానవర్గం నా పట్ల సానుభూతితోనే ఉంది. అయితే రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేశారు. సురేఖను తొలగించకపోతే నేను తొలగుతా’ అని అన్నారట!

ఆమె పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో ఆయన అభిమానురాలిగా మండలాధ్యక్ష పదవితో రాజకీయ జీవితం ప్రారంభించిన సురేఖ ఆయన మరణానంతరం కొంతకాలం జగన్మోహన్‌రెడ్డితో ప్రయాణించారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. రేవంత్‌రెడ్డితో ఘర్షణ పడటానికి ఆమె తన మనసులోని బాధను బయటపెట్టారు.

‘నా బిడ్డ 10 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీకి టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తోంది. కడియం శ్రీహరి తన బిడ్డను ఎంపీ చేసుకున్నారు. డి.ఎస్‌. ఇంట్లో రెండు పార్టీలున్నాయి, అరవింద్‌ బీజేపీలో ఉన్నారు’ అన్నారు. తన బిడ్డ పోటీ చేయాలనుకుంటున్న పరకాల నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని గెలిపించాలని నియోజకవర్గ పర్యటనలో ముఖ్యమంత్రి ఓటర్లకు విజ్ఞప్తి చేయటం సురేఖ కూతురు సుశ్మిత ఆగ్రహానికి హేతువైంది.

అందుకే పచ్చ కాంగ్రెస్‌ (టీడీపీలో నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులను ఉద్దేశించి) అని ఆమె దూషించారు. టీడీపీ రక్తం ప్రవహించేవారే అటువంటి నిర్ణయాలు తీసుకోగలరని సురేఖ తాజాగా వ్యాఖ్యానించారు. పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ప్రకటిస్తుండటం, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించటం క్రమశిక్షణ ఉల్లంఘన కాదా అని ఆమె ఫిర్యాదు చేశారు.

కొండా సురేఖ అంచనా రెండు విషయాల్లో తప్పింది. బిడ్డపై ప్రేమతో ముఖ్యమంత్రితో ఢీకొనటం మొదటి తప్పు. రెండు, కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ముఖ్యమంత్రినే కాదు, అధిష్టానవర్గం నేతలను దూషించినా పెద్దగా పట్టించుకోరన్న ధీమా. రాహుల్‌గాంధీ జమానాలో కాంగ్రెస్‌లో కనీస క్రమశిక్షణ పాటించేటట్లు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ఆమే కాదు, చిన్నారెడ్డి కూడా గ్రహించలేదు.

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి డి.కె. శివకుమార్‌ మంత్రివర్గంలో ఉండగా అతనిపై గత కాలపు పనులకు అవినీతి ఆరోపణలు రాగా, పార్టీ అధిష్టానవర్గం ఆయన చేత రాజీనామా చేయించింది. ఇదంతా నెలరోజులలోపే జరిగింది.

చిన్నారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డితో వైరం ఉంది. అతడు డబ్బిచ్చి పార్టీ టిక్కెట్‌ తెచ్చుకున్నాడని ఆరోపించారు. అది అధిష్టానానికి పరోక్షంగా తగిలింది. ఆ ఎమ్మెల్యే ఢిల్లీ దాకా వెళ్లి ఫిర్యాదు చేశాడు. ముఖ్యమంత్రిపై పరోక్ష విమర్శలు, ఆరోపణలతో పదవులకోసం ఒత్తిడి చేసేవారు మరికొందరున్నారు.

సురేఖ, చిన్నారెడ్డిపై అధిష్టానవర్గం చర్య, క్రమశిక్షణ హద్దులు దాటి పార్టీ ప్రతిష్టకు హానిచేసేవారు ఎంతటివారైనా చర్య తప్పదని హెచ్చరిస్తున్నది. కొండా సురేఖ ప్రయోగించిన బీసీ మహిళ, తమ భార్యాభర్తల కులం కార్డులకు ముఖ్యమంత్రి దీటైన సమాధానం ఇచ్చారు.

బీసీ మహిళ గుండు సుధారాణి (మాజీ ఎంపీ)ని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, హైదరాబాద్‌ మాజీ మేయర్‌, ప్రభుత్వ సలహాదారు కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని (మున్నూరుకాపు) ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా, గౌడ మహిళ నేరెళ్ల శారదను రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌గా నియమించారు. ఈ మొత్తం ఉదంతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు.

ట్యాగ్‌లు: editorial