Aditya Bihar Protests: ఆరేండ్ల ఆదిత్యను చూసి ప్రభుత్వానికి ఎందుకంత కోపం? బీహార్‌లో నిరుద్యోగ యువత గళంగా మారిన బాలుడు
bihar
Aditya Bihar Protests: సామాన్యంగా సమాజం వినపడని, కనిపించని బ్రహ్మ వాక్కు కంటే—బాల వాక్కును విశ్వసిస్తుంది. పిల్లలు చల్లని వారని, కల్లాకపటం ఎరుగరని, సత్యమే మాట్లాడతారని సమాజం నమ్ముతూ వస్తోంది. బీహార్ రాష్ట్రం పాట్నాలోని ఆదిత్య కుమార్ బాలవాక్కును కూడా సమాజం విశ్వసిస్తుంది.
Aditya Bihar Protests: నేటి యువతను, పిల్లలను ‘జెన్ జడ్’, ‘జెన్ ఆల్ఫా’తో పోల్చుతున్నారు. వీరిని భవిష్యత్తుకు మార్గదర్శకులుగా పేర్కొంటున్నారు. జెన్ జడ్ అంటే? 1997 నుండి 2012 మధ్య కాలంలో పుట్టినవారు. దాదాపు 12 నుండి 16 ఏండ్ల వయస్సులో ఉన్నవారు. వీరు చిన్ననాటి నుండి ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాలో మొదటి సామాజిక తరంగాలను ఉపయోగిస్తున్నారు. ఇక జెన్ ఆల్ఫా అంటే? 2010 నుండి 2025 మధ్య జన్మించారు. వీరి జీవితంలో స్క్రీన్లు, స్మార్ట్ డివైస్‌లు, ఇంటర్నెట్ సహజ భాగమైనవి. కాని ఆరేండ్ల పిల్లవాడిగా మీడియాలో వైరల్ అయిన బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ఆదిత్య కుమార్’ ఇంటర్నెట్ను వినియోగించుకునే ఆర్థిక స్థితిలో లేడు. తండ్రి రంజిత్ కుమార్ దినసరి కూలి. తల్లి మున్నీ కుమారి ఇంటి పనుల కార్మికురాలు. ఒక్క గది ఇంటిలో నివసిస్తారు. ఆదిత్య కుమార్ నాలుగవ తరగతి చదువుతున్నాడని, లెక్కలు, ఇంగ్లీష్, హిందీ పాఠ్యాంశాలతో పాటు ఇతర పుస్తకాలను, భారత రాజ్యాంగాన్ని బాగా చదువుతాడని తెలిసింది. 2026 ఆగస్టు 25న డాక్ బంగ్లా చౌక్ దగ్గర జరుగుతున్న నిరసనల్లో పాల్గొనేందుకు వెళతానని అమ్మానాన్నతో చెప్పాడు. దానితో కుమారుడిని తీసుకుని కవాతులో పాల్గొన్నారు.
కవాతులో పాల్గొన్న ఆదిత్య కుమార్‌పై మీడియా దృష్టి పడింది. న్యూస్ కవరేజీలో భాగంగా ఆదిత్య కుమార్ నిరసనను కూడా ప్రదర్శించారు. “అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాను. లాఠీ ఛార్జ్ జరిగితే దెబ్బలు తినే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. మా తరం ఉన్నత చదువులకు చేరుకునే నాటికి పేపర్ లీకులు, అవినీతి వ్యవహారాలు సమసిపోవాలి. విద్యార్థులపై లాఠీ ఛార్జీకి అనుమతించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి రాజీనామా చేయాలని” చెప్పాడు. మీడియాలో ప్రసారం అయిన ఆదిత్య కుమార్ నిరసనకు దేశవ్యాప్తంగా మద్దతు వచ్చింది. అభినవ భగత్‌సింగ్ అని పొగడ్తలు వచ్చినవి. బీహార్ యువత, విద్యార్థుల పోరాటానికి కూడా మద్దతు పెరిగింది. పోలీసులు భద్రత దృష్ట్యా ఆదిత్య కుమార్‌ను తమ అధీనంలోకి తీసుకుని 6 గంటల అనంతరం విడిచిపెట్టారని తెలిసింది. కాని తండ్రి రంజిత్ కుమార్, తల్లి మున్నీ కుమారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయి లాఠీలతో కొట్టిన సంఘటనలపై చర్యలు తీసుకోవాలని ఆదిత్య కుమార్ గార్డెనీబాగ్లో ధర్నా చేశాడు.
సహజ వనరుల రీత్యా బీహార్ సుసంపన్న రాష్ట్రం. దక్షిణ భాగమైన రాంచీ, జంషెడ్పూర్, బొకారో, ధన్‌బాద్ పారిశ్రామిక ప్రాంతాలతో 2000 నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రంగా విడిపోయింది. అయినప్పటికీ విభక్త బీహార్ భూభాగంలో 7.84 శాతం అడవుల నుండి సాల్, శీషమ్, ఖైరు, వెదురు లాంటి ఉత్పత్తులకు అవకాశం ఉంది. సిమెంటు పరిశ్రమకు కీలకమైన సున్నపురాయి రోహతాస్, కైమూర్ జిల్లాలలో ఉంది. దేశంలోనే అత్యధిక పైరైట్స్, మైకా నిక్షేపాలు రోహతాస్ జిల్లా అమోజుర్లో ఉన్నవి. జముయి జిల్లాలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. క్వార్జైట్, స్టీయటైట్, చైనాక్లే (కలిమట్టి) ఇసుక పుష్కలంగా ఉన్నవి. బంగారం కంటే విలువైన 14 రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బ్లాక్‌లు గుర్తించబడినవి. పల్లాడియం, టైటానియం, గ్లాకొనైట్, కోబాల్ట్ ఖనిజాలు ఉన్నవి. బంకా జిల్లాలో కోబాల్ట్ నిక్షేపాలు ఉన్నవి. భాగల్పూర్ జిల్లాలోని బటేశ్వర్ స్థాన్లో 17 రకాల రసాయన మూలకాలు ఉన్నవి. ఇవి ప్రకృతిలో తక్కువ పరిమాణంలో లభిస్తాయి. ఆధునిక రక్షణ రంగంలో క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, టీవీ స్క్రీన్లు, కెమెరా లెన్స్, స్పీకర్ తయారుకు ఉపయోగిస్తారు. ఇప్పుడు చైనా అగ్రస్థానంలో ఉంది. ఇక వ్యవసాయ పంటలకు సారవంతమైన ఒండ్రు నేలలు ఉన్నవి. గంగా, కోసి, గండక్, సోన్, భాగమతి, ఘాగ్రా లాంటి జీవనదులు, నిండుగా ఉన్న భూగర్భ జలాలతో వరి, గోధుమ, చెరకు, జనపనార, పప్పుధాన్యాలు పండుతాయి.
బీహార్‌లో గత 15 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు లేవని తెలుస్తుంది. 2006 నుండి 2021 వరకు రాష్ట్ర నిధులను ఆదా చేయడానికి ఉపాధ్యాయులను, ఆరోగ్య కార్యకర్తలను, జూనియర్ ఇంజనీర్ నియామకాల భర్తీలను కాంట్రాక్ట్ (నియోజన్) పద్ధతులలో కొనసాగిస్తున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (బీపీఎస్సీ సీసీఈ) నోటిఫికేషన్‌ను 2024 సెప్టెంబర్ 23న విడుదల చేశారు. అభ్యర్థుల ఎంపికకై ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలను ఎన్నుకున్నారు. ఇందులో సహాయక పట్టణ సంక్షేమ, రిజిస్ట్రేషన్ ఆఫీసర్, జ్యుడీషియల్ సర్వీసెస్, సివిల్ కోర్టు ప్యూన్ & అటెండెంట్స్, సహాయక ప్రజా పారిశుద్ధ్య & వ్యర్థాల నిర్వహణ అధికారి, సహాయ విద్య అభివృద్ధి అధికారి పోస్టుల ఖాళీలను ప్రకటించారు. సంబంధించిన పరీక్షలు 2024 ఏప్రిల్ 25 నుండి 30 వరకు జరిగినవి. అలాగే డిసెంబర్ 13, 14 తేదీలలో కూడా జరిగినవి. 2026 మే 3, 4 తేదీలలో పాట్నాలో 12 పరీక్షా కేంద్రాలలో జరిగిన పరీక్షలలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు రాగా పోలీసులు పరీక్షా కేంద్రాలపై దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. దానితో ఉద్యోగ నియామకాల పరీక్షలను కొన్నింటిని వాయిదా వేశారు. కొన్నింటిని రద్దు చేశారు. బీపీఎస్సీ సీసీఈ పరీక్షలను రాసిన దాదాపు 11 లక్షల మంది యువత తీవ్ర ఆందోళనలకు గురై నిరసనలకు దిగారు. ఆగస్టు 25న జరిగిన నిరసనలో బారికేడ్లను తొలగించారు. వాటర్ కెనాన్లకు ఎదురొడ్డి ముందుకు సాగారు. ఈ నిరసనలో కూడా ఆరేండ్ల ఆదిత్య కుమార్ పాల్గొని దేశ ప్రజల ఆసక్తికి, ప్రభుత్వ కోపానికి కారణమైనాడు.
ప్రజాస్వామిక సంస్థలను, ప్రజల భావ వ్యక్తీకరణలను ప్రభుత్వం గౌరవించినప్పుడే ప్రజాస్వామిక సౌధం పరిఢవిల్లుతుంది. బ్యాలెట్ మెజారిటీ తీర్పునే ప్రజల ఆమోదంగా పరిగణించడం సరికాదు. ప్రతి ఎన్నికల ఫలితాలలో గెలిచిన పార్టీ ఓట్ల కంటే ఓడిన పార్టీల ఓట్లే అధికంగా ఉంటున్నవి. ప్రతి పక్షాలకు పోలైన ఓట్లకు జవాబుదారీగా అధికార పార్టీ పాలన సాగాలి. కాని ప్రభుత్వ తప్పిదాలను వ్యతిరేకించిన ప్రతివారినీ పలురకాల ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా జరుగుతుంది. బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 2014 నుండి కొత్త కొత్త ప్రయోగాలతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వివేక్ అగ్నిహోత్రి అనే దర్శకుడు తీసిన ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా 2022 మార్చి 9న విడుదల అయింది.
మార్చి 15న ప్రధాని నరేంద్ర మోదీ సినిమాను చూసినట్లుగా, బీజేపీ ఎమ్మెల్యేలను ‘కాశ్మీర్ ఫైల్స్’ చూడాలని సిఫార్సు చేసిన వార్త పత్రికలలో కూడా వచ్చింది. ఆ సినిమాలోనే ‘అర్బన్ నక్సల్స్’ అనే పద ప్రయోగం మొదటగా వచ్చింది. ఇది ఉత్తమ చిత్రంగా కూడా ఎన్నికైంది. 2018లో జరిగిన భీమా కోరేగావ్ కేసుతో ప్రాచుర్యంలోకి వచ్చి రాహుల్‌గాంధీ కూడా అర్బన్ నక్సల్ అనే దాకా ఎదిగింది.
80వ భారత స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం దేశ ప్రజల ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యతిరేక స్వరాలను ‘దిమాగీ నక్సల్’గా సంబోధించాడు.
2022 నాటికి జాతీయ సగటు 3.2 శాతంతో పోలిస్తే బీహార్ రాష్ట్ర నిరుద్యోగ రేటు 3.9 శాతంగా ఉంది. జాతీయ బహుముఖ పేదరిక సూచిక ప్రకారం రాష్ట్ర జనాభాలో దాదాపు 34 శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారు. బతుకుదెరువు కోసం ప్రతి మూడు కుటుంబాలలో రెండింటిలో కనీసం ఒక సభ్యుడు వలసపోయాడు. ప్రతి ఉదయం బీహార్‌లో ఒక కుటుంబం పెట్టె తాళం తీసి అందులోంచి ప్రయాణ సంచిని బయటకు తీసి వెళ్లే రైలు ఎక్కుతున్న మరో యువకుడిని చూస్తుంది బీహార్ రాష్ట్రం.
1981లో 10 నుండి 15 శాతం కుటుంబాలలో వలస కార్మికులు ఉండేవారు. కాని 2020 నాటికి 65 శాతం పెరిగిందన్న అంచనాలు ఉన్నవి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు దాదాపు 15 సంవత్సరాలుగా లేవు. గత రెండు సంవత్సరాల నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగి రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపిన వారిని కక్ష సాధింపు చర్యలకు గురి చేస్తున్నారు. బ్రహ్మను నమ్మేవారు ఉన్నారు. అలాగే నమ్మని వారు కూడా ఉన్నారు. కాని “బ్రహ్మ రాతను చెరపలేరన్న” నానుడైతే ఉంది. మేజర్ చంద్రకాంత్ సినిమాలో ప్రాణాంతక జబ్బుతో బాధపడుతున్న నానమ్మను ఉద్దేశించి మనుమడు మనుమరాలు పాట పాడుతారు.
‘సుఖీభవ సుమంగళీ సుఖీభవా, ఆ, ఆ..
సుశీలవై చిరాయువై సుఖీభవా, ఆ, ఆ, చరణం విన్న
తాత ‘ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేననీ,
నిండుగా, నూరేళ్లుగా ఉండి పొమ్మనీ వంతపాడతారు.
సామాన్యంగా సమాజం వినపడని, కనిపించని బ్రహ్మ వాక్కు కంటే—బాల వాక్కును విశ్వసిస్తుంది. పిల్లలు చల్లని వారని, కల్లాకపటం ఎరుగరని, సత్యమే మాట్లాడతారని సమాజం నమ్ముతూ వస్తోంది. బీహార్ రాష్ట్రం పాట్నాలోని ఆదిత్య కుమార్ బాలవాక్కును కూడా సమాజం విశ్వసిస్తుంది.
అందుకే దేశవ్యాప్తంగా వైరల్ అయినాడు. కాబట్టి ప్రభుత్వం అక్కసును వీడి, తల్లిదండ్రులపై కక్ష సాధింపు చర్యలకు స్వస్తి చెప్పి ఆ కుటుంబానికి ఉపాధిని చూపి ఆదిత్య కుమార్‌కు మెరుగైన విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పించాలి. అలాగే పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణపరమైన తప్పిదాలను సమీక్షించుకుని ప్రజలకు మేలు చేసే పాలనను సాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.