Skip to content
జాతీయం వార్తలు

సుప్రీంకోర్టు తీర్పు కార్మికులకు శరాఘాతం

Prajapaksham 30 Aug 2026 0 నిమిషాల పఠనం జాతీయం
సుప్రీంకోర్టు తీర్పు కార్మికులకు శరాఘాతం

Supreme Court of India

వి.యస్. బోస్, ఏఐటీయుసి మాజీ పూర్వ ప్రధాన కార్యదర్శి

2026 ఆగస్టు 20న, భారత సుప్రీంకోర్టుకు చెందిన తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, కొత్త కార్మిక వివాదాలకు సంబంధించి ‘పరిశ్రమ’ అనే పదాన్ని పునర్నిర్వచిస్తూ ఒక తీర్పును వెలువరించింది. ఈ కొత్త నిర్వచనం అనిశ్చితిని సృష్టించడమే కాకుండా, అనేక మంది కార్మికులకు ఉన్న కీలకమైన రక్షణలను బలహీనపరిచే అవకాశం ఉంది. ఈ తీర్పు, సాంకేతిక గారడీని చాకచక్యంగా ఉపయోగించి, ‘పరిశ్రమ’ అనే నిర్వచనాన్నే మార్చివేసింది. ప్రభుత్వ ఆధీనంలోని పారిశ్రామిక నిట్లను పరిశ్రమలుగా పరిగణించలేమని, అందువల్ల 1947 పారిశ్రామిక వివాదాల చట్టం ద్వారా హామీ ఇవ్వబడిన మరియు తరువాత 1978 సుప్రీంకోర్టు తీర్పులో ధృవీకరించబడిన అనేక రక్షణలు ప్రభుత్వ పారిశ్రామిక యూనిట్లలో పనిచేసే కార్మికులకు ఇకపై వర్తించవని (5:4 తేడాతో) తీర్పు ఇచ్చింది. దీనర్ధం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలు (బిహెచ్‌ఇఎల్‌, హెచ్‌ఎంటి, ఇసిఐఎల్‌ లాంటి పరిశ్రమలు) అలాగే ప్రభుత్వం నడుపుతున్న ఎన్‌ఎఫ్‌సి, డిఫెన్స్‌ లాంటి పరిశ్రమలు, విద్య, వైద్యం లాంటి సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఈ తీర్పు మూలంగా దాదాపు అన్ని ప్రయోజనాలను, హక్కులు కోల్పోయే భయంకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నది. కార్మిక వ్యతిరేక 2020 పారిశ్రామిక సంబంధాల కోడ్‌ అమలును మరింత బలోపేతం చేస్తుంది. దీనితో కార్మికుల శ్రమను దోపిడి చేస్తున్న పారిశ్రామిక వేత్తలకు మరింత వెసులుబాటు కలుగజేస్తున్నది.
1978లో కృష్ణ అయ్యర్‌, ఇతరుల నేతత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం, భారత కార్మిక చట్టం 1947 పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 2(జె) ప్రకారం “పరిశ్రమ”గా దేనిని పరిగణించవచ్చో నిర్వచించే ‘త్రివిధ పరీక్ష’ను రూపొందించింది. ఈ నిర్వచనం ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, నీటిపారుదల, అటవీ వంటి అనేక సంస్థలకు, వాటి ఉద్యోగులకు పారిశ్రామిక వివాదాల చట్టం కింద రక్షణ పొందేందుకు వీలు కల్పించింది. గత వారం జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతత్వంలోని 9 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం, 1978 నాటి బెంగళూరు నీటి సరఫరా కేసును పునఃసమీక్షిస్తూ… బెంగళూరు (వాటర్‌ సప్లు సీవరేజ్‌ బోర్డ్‌ వర్సెస్‌ ఆర్‌.రాజప్ప ఇతరులు) కేసులో, త్రివిధ పరీక్షలోని కొన్ని అంశాలు మరియు బెంగళూరు వాటర్‌ సప్లు కేసులో రూపొందించిన మార్గదర్శకాలకు మరింత లోతైన పరిశీలన అవసరమని తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా, ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు మరియు ఆసుపత్రులలో పనిచేసే కార్మికులకు ఇప్పటికీ ‘పరిశ్రమ’ అనే పదం వర్తిస్తుంది. సెక్షన్‌ 2(జె)లో ఉపయోగించిన విస్తత పదాలను వివరిస్తూ ‘పరిశ్రమ’ నిర్వచనం యొక్క పరిధిని మార్చుతూ కార్మికులకు సమ్మె, ఇతర హక్కులు అనుమతించబడవు, ఎందుకంటే అవి ‘సమాజ సేవ’ అనే విధానంతో పనిచేసే సంస్థలు కావున అందుకోసం మేము ట్రిపుల్‌ టెస్ట్‌ను పునఃరూపకల్పన చేయాలని ప్రతిపాదిస్తున్నాము,” అని సిజెఐ కాంత్‌ ట్రిపుల్‌ టెస్ట్‌ను పునఃరూపకల్పన చేయవలసిన అవసరాన్ని నొక్కిచెబుతూ, సామాజిక సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు సమాజ సేవ ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటాయని, వాటి విధులు వాణిజ్య సంస్థలను పోలిన సంస్థాగత లేదా కార్యాచరణ అంశాలను కలిగి ఉన్నప్పటికీ, వాటిని “పారిశ్రామిక కార్యకలాపాలు”గా పరిగణించలేమని అభిప్రాయపడ్డారు. అయితే, 5:4 మెజారిటీతో, పారిశ్రామిక సంబంధాల కోడ్‌ కింద “పరిశ్రమ”ను నిర్వచించడానికి “ట్రిపుల్‌ టెస్ట్‌”ను మెరుగుపరుస్తూ నలుగురు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తులు బి.వి.నాగరత్న, దీపాంకర్‌ దత్తా, ఉజ్జల్‌ భూయాన్‌, జయమల్య బాగ్చి తమ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కొత్త నిర్వచనం, 1947 పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 2 (జె) పరిధిని విస్మరించటమే కాకుండా, సంక్షేమ, ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము. అందుకే వారి తీర్పును అమలు చేయరాదని కోరుతున్నాము’ అని పేర్కొన్నారు.
చట్టాల సాధన కోసం గత కాలంలో కార్మికవర్గ పోరాటాలు, చట్టాలు రూపొందించిన సమయంలో ఉన్న పారిశ్రామిక, సామాజిక పరిస్థితులను పక్కనపెట్టి మారుతున్న సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకోకుండా న్యాయమూర్తులు తీర్పులు చెప్పటం మన దేశానికి పట్టిన దుర్గతి, కొత్తగా సమాజంలో ఏర్పడ్డ ఫ్లాట్‌ఫాం, యాప్‌ ఆధారిత లాంటి కొత్త రంగాలలో పనిచేస్తున్న కార్మికులు తమకు ఉద్యోగ భద్రత, సామాజిక సంక్షేమ పథకాలు వాటికి అనుగుణంగా చట్టాలు రూపొందించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేయటం, సామూహిక సమ్మెలు చేయటంతో ప్రభుత్వాలు దిగివచ్చి వారి డిమాండ్‌లను పరిష్కారం చేయటానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను సుప్రీం కోర్టు న్యాయమూర్తులను పరిగణలోకి తీసుకోలేదు.
భారతదేశంలో కార్మిక సంఘాలు వాటి సామూహిక పోరాటాలు చారిత్రకంగా 1926 నాటి కార్మిక సంఘాల చట్టం, 1947 నాటి పారిశ్రామిక వివాదాల చట్టం ద్వారా సాధించబడ్డాయి. స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన అనేక తీవ్రమైన పోరాటాల ఫలితంగా, కార్మిక సంఘాలు సమ్మె హక్కు, కనీస వేతనాలు, పెన్షన్‌, బోనస్‌లు, పని ప్రదేశంలో గాయాలకు పరిహారం, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు వంటి చట్టాలలో హామీ ఇవ్వబడిన కొన్ని ప్రయోజనాలను సాధించాయి. అయితే, ఈ ప్రాథమిక చట్టాలను రద్దు చేసి, పారిశ్రామిక సంబంధాల కోడ్‌, 2020గా ఏకీకృతం చేశారు. ఇది అధికారికంగా 2025 చివరిలో అమల్లోకి వచ్చింది.
పారిశ్రామిక సంబంధాల కోడ్‌, 2020 పైన పేర్కొన్న రక్షణలను తగ్గిస్తుంది, వారి హక్కులను పరిమితం చేస్తుంది; స్టాండింగ్‌ ఆర్డర్లు, పారిశ్రామిక వివాద పరిష్కార యంత్రాంగాల వంటి ఆదేశాలను తప్పించుకోవడానికి సంస్థలను అనుమతిస్తుంది. తద్వారా అధికారాన్ని ఫ్యాక్టరీ లేదా సంస్థాగత యాజమాన్యాల వైపు మళ్లిస్తుంది.
ప్రధాన కార్మిక సంఘాలైన ఎఐటియుసితో పాటు ఇతర కార్మిక సంఘాలు ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది యాజమాన్య, కార్పొరేట్‌ ప్రయోజనాల వైపు మొగ్గు చూపే ఒక నిర్మాణాత్మక ధోరణి అని, దశాబ్దాలుగా స్థిరపడిన హక్కులను ఇది నిర్వీర్యం చేస్తున్నదనేది వాస్తవం. ఈ తీర్పు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్‌ అనుకూల, నయా ఉదారవాద, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిబింబిస్తున్నది. కార్మికులను యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు మరింతగా నెట్టివేస్తుంది. గతంలో న్యాయమూర్తులు ప్రకటించిన అభిప్రాయాలను వక్రీకరించటంతో కార్మికులలో అసహనం పెరిగి పారిశ్రామిక శాంతికి ముప్పు ఏర్పడుతుందని పాలకులు గమనించాలి. కార్మికులు కష్టపడి సాధించుకున్న తమ ప్రాథమిక, ప్రజాస్వామ్య హక్కులు, గౌరవం, సామూహిక బేరసారాలను తిరిగి పొందేందుకు కార్మిక వర్గం చారిత్రక పోరాటాలలోకి తిరిగి వెళ్ళవలసి వస్తుంది.

ట్యాగ్‌లు: Labours national Supreme Court