Skip to content
క్రైమ్ వార్తలు

Hyderabad: అమెరికాలో ఉద్యోగం రాలేదని తెలుగు యువకుడు ఆ*త్మహత్య.. జాబ్ కోసం నాలుగు నెలలు వెతికి..

jagan 24 Aug 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Hyderabad: అమెరికాలో ఉద్యోగం రాలేదని తెలుగు యువకుడు ఆ*త్మహత్య.. జాబ్ కోసం నాలుగు నెలలు వెతికి..

US Job Search Turns Tragic as Hyderabad Youth Dies by Suicide

Hyderabad: కోటి ఆశలతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడి జీవితం తీవ్ర విషాదాంతమైంది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దక్కకపోవడం, పెరిగిపోతున్న ఆర్థిక ఒత్తిడి , భవిష్యత్తుపై అనిశ్చితే కారణాలుగా హైదరాబాద్‌కు చెందిన పోరెడ్డి సాయిప్రదీప్ (28) అమెరికాలో ఆ*త్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, శోకాన్ని రేపింది. సాయిప్రదీప్ హైదరాబాద్‌లోని దమ్మాయిగూడ శ్రీనివాసనగర్ కాలనీకి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.

సాయిప్రదీప్ 2024లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ఇటీవల ఆయన ‘యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ శాన్ ఆంటోనియో’ (UTSA) నుంచి మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశాడు. ఆయనకు సప్లై చైన్ అనలిస్ట్‌గా (Supply Chain Analyst) గతంలోనే దాదాపు 5 సంవత్సరాల పని అనుభవం ఉంది. మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత గత నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమించాడు. వందలాది కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సరైన అవకాశం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి, ఆందోళనకు గురయ్యాడు.

రోజూ పెరిగిపోతున్న ఆర్థిక భారం, వీసా గడువు నిబంధనల ఒత్తిడితో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన సాయిప్రదీప్, ఆగస్టు 21న తన నివాసంలో ఆ*త్మహత్య చేసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. సాయిప్రదీప్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి, అంత్యక్రియల ఖర్చులను భరించడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు నిధుల సేకరణ (Crowdfunding) ప్రారంభించారు. సాయిప్రదీప్ అకాల మరణంతో దమ్మాయిగూడలోని ఆయన కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.

ప్రస్తుతం అమెరికాలో ఐటీ, కార్పొరేట్ రంగాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం, లేఆఫ్‌లు (Layoffs) మరియు కఠినమైన వలస విధానాలు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. లక్షలాది రూపాయల రుణాలు చేసి మాస్టర్స్ పూర్తి చేసినప్పటికీ.. సరైన ఉద్యోగాలు లభించక వేలాది మంది తెలుగు విద్యార్థులు తీవ్ర భవిష్యత్తు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు.