Skip to content
వినోదం వార్తలు

Balagam Sudhakar Reddy: అలాంటి పాత్రలు చెయ్యొద్దని నా అన్న బిడ్డ చెప్పింది : ‘ప్రజాపక్షం’ స్పెషల్‌ ఇంటర్వ్యూలో ‘బలగం’ సుధాకర్‌ రెడ్డి

Prajapaksham 24 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
Balagam Sudhakar Reddy: అలాంటి పాత్రలు చెయ్యొద్దని నా అన్న బిడ్డ చెప్పింది : ‘ప్రజాపక్షం’ స్పెషల్‌ ఇంటర్వ్యూలో ‘బలగం’ సుధాకర్‌ రెడ్డి

Balagam Sudhakar Reddy

Balagam Sudhakar Reddy ‘బలగం’ సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరిగి రాసింది. వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా రిలీజ్‌ తరువాత కూడా గ్రామాల్లో ప్రజలందరూ ఒకచోట కూర్చొని ఎల్‌ఈడీలో సినిమా వేసుకుని చూసిన చరిత్ర ‘బలగం’ సినిమా సొంతం. బలగం సినిమా చూసి విడిపోయిన బంధాలు, బంధుత్వాలు కలసిపోయాయి. బలగం సినిమా కథ మొత్తం ఒక ఇంటి పెద్ద చుట్టూ తిరుగుతుంది. ఆ ఇంటి పెద్ద పాత్రను పోషించాడు నటుడు కేతిరి సుధాకర్‌ రెడ్డి. ఈ ఇంటి పెద్ద మనిషి పాత్ర చనిపోవడంతోనే కథ మొదలవుతుంది. ఆ తరువాత బలగం కథ ఎలా సాగింది అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిందే. బలగం సినిమాలో ఇంటి పెద్ద పాత్రను పోషించిన సుధాకర్‌ రెడ్డిని ‘ప్రజాపక్షం’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికర విషయాలను ప్రజాపక్షంతో పంచుకున్నారు. ఆ విశేషాలు పాఠకుల కోసం….

ప్రశ్న : మీ నేపధ్యం ఏమిటి ?

సుధాకర్‌ రెడ్డి : మాది కరీంనగర్‌ జిల్లా. తండ్రి కేతిరి రాజి రెడ్డి, అమ్మ సుశీలమ్మ. జూపాక గ్రామంలో బాల్యం గడిచింది ప్రాథమిక విద్య మొత్తం జూపాకలోనే. నాలుగవ తరగతి వరకు జూపాకలో చదువుకున్న. తరువాత చిలుపూరు గ్రామంలో అయిదవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదుకున్న. ఎనిమిదవ తరగతి నుంచి కాలేజీ చదువుల వరకు హుజురాబాద్‌ సాగింది. కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌లో డిగ్రీ చేసిన. ఆ తరువాత బీఈడీ చదువుకోసం తిరుపతికి వెళ్లిన. శ్రీ వెంకటేశ్వరా స్వామి యూనివర్సిటీలో బీఈడీ పట్టా సాధించిన. బీఈడీ పూర్తి అయినాక సరస్వతి శిశు మందిర్‌లో టీచర్‌గా ఉద్యోగంలో చేరిన. రిటైర్మెంట్‌ అయ్యేవరకు ఉపాధ్యాయుడిగా పని చేసిన. పదవి విరమణ తరువాతే సినిమా రంగానికి వచ్చిన.

ప్రశ్న : మీరు చదువుకునే రోజుల్లో నాటకాలు ఆడేవారా?

సుధాకర్‌ రెడ్డి : అవును నాటకాలు ఆడేవాన్ని. కొన్ని బహుమతులు కూడా వచ్చాయి. కానీ అవి ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. పౌరాణిక నాటకాలు, యక్షగానం, చిడతల రామాయణం, హరికథలు, బుర్రకథలు, వీధి భాగోతాలు, ఏకపాత్ర నాటికలు…, నటించడమే కాదు కొన్ని రాసిన కూడా. నాటకాల పోటీలకు వెళ్తుండేవాణ్ణి. నంది నాటకోత్సవాలకు కూడా జడ్జిగా వెళ్లిన. స్కూల్‌లో పిల్లలకు నాటకాలు నేర్పించేవాన్ని. శిశుమందిర్‌లో ఐచ్చిక రంగస్థల అనే ప్రత్యేక కార్యక్రమం ఉండేది. దీంట్లో నేను ప్రముఖంగా పని చేసిన.

ప్రశ్న : మీకు రచన ఎలా అలవాటు అయింది ?

సుధాకర్‌ రెడ్డి : ఆరుట్ల రంగాచార్య అని ఉపాధ్యుడు ఉండేవారు. వారు మాకు సంస్కృతం భోదిస్తుండేవారు. ఆయన రచనలు చెయ్యమని ప్రోత్సహించారు. దీంతో మొట్ట మొదలు ఇందిరా గాంధీ గురించి ఒక పాట రాసిన. ఆ తర్వాత ఆమెకు వ్యతిరేకంగా కూడా పాట రాసిన. పాట ఎలా రాయాలో చెప్పిండు. అట్లా రచయితనైనా.

ప్రశ్న : తొలిసారిగా కెమెరా ముందుకు ఎప్పుడు వచ్చారు?

సుధాకర్‌ రెడ్డి : నిజానికి సినిమాలంటే దూరమే. మైకేల్‌ అన్వేష్‌ అనే దర్శకుడు ‘కొత్త పోరడు’ అనే వెబ్‌ సిరీస్‌ చేశారు. దాంట్లో ఫస్ట్‌ టైం నటించిన. అప్పుడే మొట్ట మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన. సినిమాగా చెప్పుకుంటే ‘మల్లేశం’ నా తొలి సినిమాగా చెప్పవచ్చు.

ప్రశ్న : బలగం సినిమాలో ఎలా అవకాశం వచ్చింది ?

సుధాకర్‌ రెడ్డి : ‘కొత్త పోరడు’ సినిమా దర్శకుడు అన్వేష్‌కు బలగం వేణు స్నేహితుడు. నా గురించి వేణుకు చెప్పాడట. వెబ్‌ సిరీస్‌, నాటకాలు చాలా బాగా యాక్టింగ్‌ చేస్తాడు అని ఇలా నా గురించి వేణుకు తెలిసింది. దీంతో ఆయన పిలిపించి బలగం సినిమాకు సెలక్ట్‌ చేశాడు.

ప్రశ్న : బలగం సినిమాలో మీరు చనిపోయే పాత్ర ? ఎలా ? ఒప్పుకున్నారు

సుధాకర్‌ రెడ్డి : మనం నిజంగానే చనిపోతాం కదా… సినిమాలో చనిపోయే పాత్ర చేస్తే ఏమైతది అనుకున్న. మా అన్నయ్య బిడ్డ ఇటువంటి పాత్ర చేయొద్దని. మా ఆవిడా ఇటువంటి పాత్ర అయితే సినిమా చూడను అన్నది. మనం నిజంగా కూడా చచ్చిపోతాం.. ఏమైతది ఈ క్యారెక్టర్‌ చేస్తే అని చేసేసిన.

ప్రశ్న : నటుడిగా మీరు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటారు ?

సుధాకర్‌ రెడ్డి : నేను ఎవరిని అనుకరణ చేసేవాన్ని కాదు. అలా అని ఎవరిని స్ఫూర్తిగా కూడా ఎవరిని స్వీకరించలేదు. ఎందుకంటే సినిమా అంటేనే మాకు దూరం. కానీ సినిమాల్లోకి వచ్చాను. నాకు ఉన్న పరిధిలో నేను ఎలా చెయ్యగలను, ఎలా ఉన్నాను అనేది చూసుకుంటా. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. అందుకని నాకు ఏం తెలుసో అది చెప్తా. అదే చేస్తా. కాబట్టి ఎవరిని స్ఫూర్తిగా స్వీకరించలేదు. ఎవరిని జ్ఞాపకం కూడా పెట్టుకోలేదు.

ప్రశ్న : ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏంటి?

సుధాకర్‌ రెడ్డి : ఇప్పుడు కొంచెం బిజీగానే ఉన్న ’పళ్ళబురుసు’ అనే సినిమా చేసిన. ఇందులో చాలా మంచి పాత్ర. తండ్రి కొడుకుల మధ్య సాగే డ్రామా ఈ సినిమా కథ. నాగార్జున సార్‌ వాళ్ళు ఈ సినిమాను తీశారు. ’ఎల్లమ్మ’ సినిమాలో కూడా నటిస్తున్న. ఇందులో కూడా చాలా మంచి పాత్ర. ఇది దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇది బలగం లాగానే సూపర్‌ అవుతుంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.