అనుభవాలకు అక్షర రూపం
Jorge Luis Borges
(ఆగస్టు 24న బోర్హెస్ జయంతి)
జార్జ్ లూయిస్ బోర్హెస్‌ను చదవడం అంటే ఒక కథలోకి ప్రవేశించడం కాదు. ఆ కథ అనే మన భావననే ప్రశ్నించే ఒక మేధో ప్రపంచంలోకి అడుగుపెట్టడం. అర్జెంటీనాలో, 1899 ఆగస్టు 24న జన్మించిన బోర్హెస్ ఇరవయ్యో శతాబ్దపు ప్రపంచ సాహిత్యాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన రచయితల్లో ఒకడు. ఆయన సాహిత్యంలో కథ కంటే ఆలోచన ముందుంటుంది. కాలం, అనంతం, జ్ఞాపకం, గుర్తింపు, భాష, దేవుడు, స్వేచ్ఛ, విధి వంటి మహత్తర ప్రశ్నలను ఆయన కొన్ని పేజీల కథలోనే విశ్వవ్యాప్త అనుభవాలుగా మలిచాడు. ‘ఫిసియోనెస్’ (1944), ‘ది అలెఫ్’ వంటి సంకలనాలు ఆ ప్రయోగానికి శిఖరాలు. బోర్హెస్ ప్రత్యేకత ఆయన కథ చెప్పే పద్ధతిలోనే ఉంది. సాధారణ కథలో పాత్రలు సంఘటనలను ముందుకు నడిపిస్తాయి. బోర్హెస్ దగ్గర ఒక ఆలోచన కథను నడిపిస్తుంది. ఒక కల్పిత పుస్తకం. ఉనికిలో లేని రచయిత… కనిపించని గ్రంథాలయం.. అంతులేని అద్దాల వరుస.. ప్రపంచంలోని ప్రతి పుస్తకాన్నీ కలిగి ఉన్న గ్రంథాలయం.. విశ్వంలోని ప్రతి బిందువునూ తనలో దాచుకున్న ఒక బిందువు. ఇవన్నీ కలబోసిన విత్తనాలుగా మారడంతో, కథలకు ప్రత్యేకత చేకూరుతుంది. అందుకే, ఆయన కథలు ఒకేసారి కథలుగానూ, తాత్విక ప్రయోగాలుగానూ కనిపిస్తాయి. అనంతత్వాన్ని కథా రూపంలో పరిశీలించే రచనగా ‘ది అలెఫ్’ను విమర్శకులు చూస్తారు. బోర్హెస్ సాహిత్యంలో ‘మెటాఫిక్షన్’ అనే లక్షణం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. రచయిత కథలోకి ప్రవేశిస్తాడు. కథలోని పుస్తకం నిజమా? కల్పితమా? అన్న సందేహాన్ని పాఠకుడిలో కలిగిస్తాడు. ఒక కల్పిత రచయిత గురించి నిజమైన జీవితచరిత్ర రాస్తున్నట్టు నటిస్తాడు. ఫుట్‌నోట్లు, గ్రంథసూచికలు, చారిత్రక వివరాల్లాంటి రూపాలను ఉపయోగించి కల్పనకు వాస్తవికత ముసుగు తొడుగుతాడు. ‘పియరె మెనార్డ్, ఆథర్ ఆఫ్ ది క్విక్సోట్’లో ఒకే నవలను వేరే కాలంలో, వేరే రచయిత రాస్తే దాని అర్థం మారుతుందా? అనే ప్రశ్నను ముందుకు తెచ్చాడు. ఇక్కడ రచయిత ఎవరు అన్న ప్రశ్న కంటే పఠనం ఎలా అర్థాన్ని సృష్టిస్తుంది అన్న ప్రశ్న కీలకమవుతుంది. బోర్హెస్‌కు సాహిత్యం గతాన్ని పునరావృతం చేయడం కాదు.. గతాన్ని కొత్తగా చదవడం. కాఫ్కాను చదివిన తరువాత మనం అతనికంటే ముందు వచ్చిన కొంతమంది రచయితలను కొత్త దృష్టితో చూడగలమని ఆయన ప్రతిపాదించాడు. అంటే ఒక గొప్ప రచయిత తన పూర్వీకులను కూడా మార్చేస్తాడు. సాహిత్య చరిత్రను ఒకే దిశలో ప్రవహించే నదిగా కాకుండా, పరస్పరం ప్రభావితం చేసుకునే కాలాల వలయంగా ఆయన చూశాడు. ఈ ఆలోచన తరువాతి పోస్ట్‌మోడర్న్ విమర్శలో విస్తృతంగా చర్చకు వచ్చింది. ‘లాబిరింత్’ బోర్హెస్‌కు కేవలం ఒక ప్రతీక మాత్రమేకాదు, ఆయన సాహిత్య నిర్మాణానికి ఒక నమూనాగా కూడా ఆవిష్కృతమవుతుంది. ‘ది గార్డెన్ ఆఫ్ ఫోర్కింగ్ పాథ్’, ‘ది లైబ్రరీ ఆఫ్ బబెల్’, ‘ది సర్క్యులర్ రూయిన్స్’ వంటి కథల్లో దారులు వేర్వేరు. ప్రతి దారిలో మరో అవకాశం తెరుచుకుంటుంది. ఒక నిర్ణయం మరొక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఒక మనిషి మరొక మనిషి కలలోని పాత్ర కావచ్చు. ఒక వ్యక్తి తనకే మరో రూపంగా కనిపించవచ్చు. ఈ విధంగా బోర్హెస్ ‘నేను’ అనే భావనకే స్థిరత్వం లేదని సూచిస్తాడు. ఆయన కథల్లో గుర్తింపు తరచూ ప్రతిబింబంలా మారుతుంది. ‘ ది అలెఫ్’లోని కేంద్ర భావన మరింత విస్తృతమైనది. ఒక చిన్న బిందువులో విశ్వంలోని అన్ని బిందువులు ఏకకాలంలో కనిపిస్తాయి. కానీ మనిషి భాష మాత్రం వరుసగా మాత్రమే చెప్పగలదు. ఒకేసారి కనిపించిన అనంతాన్ని భాష ఒక్కొక్క పదంగా మాత్రమే వ్యక్తం చేయగలదు. ఇక్కడ బోర్హెస్ ఒక అద్భుతమైన సాహిత్య సమస్యను సృష్టిస్తాడు. అనంతాన్ని వర్ణించడానికి పరిమితమైన భాషను ఎలా ఉపయోగించాలి? ఈ ప్రశ్నకు సమాధానాన్ని జోడించి, అత్యుత్తమంగా తీర్చిదిద్దగలగడమే అతని కథలకు సౌందర్యాన్ని ఇస్తుంది. ఈ కథలోని విశ్వదర్శనాన్ని డాంటే రాసిన ‘ప్యారడిసో’తో పోల్చిన విమర్శకులు కూడా ఉన్నారు. అదే విధంగా, కొంతమంది పేర్కొంటున్నట్టు బోర్హెస్ ప్రభావాన్ని ‘మ్యాజికల్ రియలిజం’ అనే ఒకే పదంతో పరిమితం చేయడం సరైంది కాదు. లాటిన్ అమెరికన్ సాహిత్య పరిణామంలో ఆయనకు కీలక స్థానం ఉన్నప్పటికీ, ఆయన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. తరువాతి పోస్ట్‌మోడర్న్ రచయితలు, ప్రయోగాత్మక కథకులు, సైన్స్ ఫిక్షన్ రచయితలు ఆయన నుంచి కథా నిర్మాణం, కాలం, వాస్తవికత, రచయిత-పాఠక సంబంధాలపై కొత్త ఆలోచనలను స్వీకరించారు. ‘ది లైబ్రరీ ఆఫ్ బబెల్’ నేటి సమాచార విశ్వాన్ని గుర్తు చేస్తుంది. ‘పియరె మెనార్డ్’ పాఠ్యానికి అర్థం ఎవరు నిర్ణయిస్తారనే ప్రశ్నను ముందుకు తెస్తుంది. అయితే, బోర్హెస్ గొప్పతనం ఆయన సంక్లిష్టమైన ఆలోచనలను మరింత సంక్లిష్టమైన భాషలో చెప్పడంలో లేదు. అందుకు విరుద్ధంగా, ఆయన గద్యంలోని పొదుపే దాని బలం. కొద్ది పేజీల్లో ఒక తాత్విక గ్రంథం విస్తీర్ణాన్ని సృష్టించగలిగాడు. అందుకే బోర్హెస్ కథ పూర్తయిన తరువాత కూడా ముగియదు. కథ ముగిసిన చోట పాఠకుడి ఆలోచన మొదలవుతుంది. ఒక కథను చదివి దాని అర్థాన్ని తెలుసుకోవడం కాకుండా, ఆ కథ మనం ‘వాస్తవం’, ‘నేను’, ‘కాలం’, ‘సాహిత్యం’ అనే పదాలకు ఇచ్చిన అర్థాలనే మార్చుకోవాల్సి వస్తుంది. ప్రపంచ సాహిత్యంలో బోర్హెస్ వేసిన అసలు ముద్ర ఇదే. ఆయన అనంతాన్ని కథగా రాయలేదు. కథ అనే చిన్న రూపంలో అనంతాన్ని ఆలోచించే అవకాశాన్ని మనకు అందించాడు.