Skip to content
జాతీయం వార్తలు

No Bride After 9 Years: 9 ఏళ్లయినా పెళ్లి కాలేదని మ్యారేజ్‌ బ్యూరోపై కేసు.. పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు

Prajapaksham 16 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
No Bride After 9 Years: 9 ఏళ్లయినా పెళ్లి కాలేదని మ్యారేజ్‌ బ్యూరోపై కేసు.. పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు

No Bride After 9 Years: 9 ఏళ్లయినా పెళ్లి కాలేదని మ్యారేజ్‌ బ్యూరోపై కేసు.. పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు

No Bride After 9 Years: పెళ్లి సంబంధం కుదురుస్తుందని నమ్మి మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేసుకున్న ఓ వ్యక్తికి.. తొమ్మిదేళ్లు గడిచినా సంబంధం కుదరకపోవడంతో వినియోగదారుల కమిషన్ ఆ మ్యారేజ్ బ్యూరోకు గట్టి షాక్ ఇచ్చింది. సేవా లోపానికి బాధ్యతగా నష్టపరిహారం చెల్లించాలంటూ సంచలన తీర్పును వెలువరించింది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.

కన్నూర్‌కు చెందిన ఒక నర్సింగ్ కాలేజీ ప్రొఫెసర్ తన వివాహం కోసం 2016 నవంబర్‌లో శ్రీచక్ర మ్యారేజ్ బ్యూరోను సంప్రదించారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 3 వేలు చెల్లించిన ఆయనకు.. కాసరగోడ్‌కు చెందిన ఒక అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చుతామని సదరు బ్యూరో హామీ ఇచ్చింది. అయితే దాదాపు 9 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ ప్రొఫెసర్‌కు తగిన పెళ్లి సంబంధాన్ని కుదర్చడంలో మ్యారేజ్ బ్యూరో పూర్తిగా విఫలమైంది. ఆయన ప్రొఫైల్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. తగిన సంబంధం త్వరలోనే వస్తుందంటూ కాలయాపన చేస్తూ వచ్చింది.

ఈ సుదీర్ఘ నిరీక్షణ కాలంలో ఆ ప్రొఫెసర్ కుటుంబంలో తీవ్ర విషాదాలు నెలకొన్నాయి. కొడుకు పెళ్లి చూడాలనే ఆశతో ఎదురుచూసిన ఆయన తండ్రి 2025 అక్టోబర్‌లో క్యాన్సర్‌తో మరణించారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న ఆయన తల్లి.. కొడుకు పెళ్లి కోసం ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు. మరోవైపు 9 ఏళ్లుగా పెళ్లి కాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ప్రొఫెసర్.. చివరకు సేవా లోపం కింద సదరు మ్యారేజ్ బ్యూరోపై కన్నూర్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి రూ. 15 వేలు నష్టపరిహారం డిమాండ్ చేశారు.

వినియోగదారుల కమిషన్ జారీ చేసిన నోటీసులకు మ్యారేజ్ బ్యూరో యాజమాన్యం స్పందించకపోవడంతో.. కమిషన్ ఈ కేసుపై ఏకపక్షంగా విచారణ జరిపి తీర్పునిచ్చింది. మ్యారేజ్ బ్యూరో వైపు సేవా లోపం ఉన్నట్లు నిర్ధారించిన కమిషన్.. ప్రొఫెసర్ నుండి తీసుకున్న రూ. 3 వేలు రిజిస్ట్రేషన్ రుసుమును తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. దీనితో పాటు ఆయన అనుభవించిన మానసిక వేదనకు పరిహారంగా రూ. 3 వేలు, న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం రూ. 2 వేలు (మొత్తం రూ. 8 వేలు) చెల్లించాలని స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వు అందిన 30 రోజులలోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని.. ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే రిజిస్ట్రేషన్ రుసుము రూ. 3 వేలుపై ఏడాదికి 9 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ ఆదేశించింది. ఒకవేళ మ్యారేజ్ బ్యూరో ఈ ఆదేశాలను అమలు చేయని పక్షంలో.. వినియోగదారుల రక్షణ చట్టం కింద తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే వెసులుబాటును కూడా ఫిర్యాదుదారుడికి కల్పించింది.