Skip to content
జాతీయం వార్తలు

Third Language Must Stop: 9వ తరగతిలో మూడో భాష వద్దు.. CBSE త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Prajapaksham 16 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Third Language Must Stop: 9వ తరగతిలో మూడో భాష వద్దు.. CBSE త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Third Language Must Stop: 9వ తరగతిలో మూడో భాష వద్దు.. సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

Third Language Must Stop: 9వ తరగతి స్థాయిలో మూడో భాషను ప్రవేశపెట్టడం.. బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులపై అనవసరమైన మానసిక ఒత్తిడిని పెంచుతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగారత్న తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్‌వీ) ఏర్పాటుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన అప్పీలును జస్టిస్ బీవీ నాగారత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలోని త్రిభాషా విధానంపై ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

విచారణ సందర్భంగా తమిళనాడు తరఫు న్యాయవాది స్పందిస్తూ.. 9వ తరగతి నుంచి మూడో భాష తప్పనిసరి అవుతోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జస్టిస్ నాగారత్న అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. 9వ తరగతి అనేది విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న సమయం. అలాంటి దశలో కొత్త భాషను పరిచయం చేయడం తప్పు. మూడో భాషను 6వ తరగతిలోనే ప్రారంభించాలి. ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిదని వ్యాఖ్యానించారు. 1970లలో తన విద్యాభ్యాసాన్ని గుర్తుచేసుకుంటూ.. 8వ తరగతి చివరి నుంచే బోర్డు పరీక్షల ఒత్తిడి మొదలవుతుందని.. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 9వ తరగతిలో మూడో భాషను పెట్టవద్దని సూచించారు.

త్రిభాషా విధానంపై తమిళనాడు వ్యతిరేకతను ప్రస్తావిస్తూ.. ఈ విధానం హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇందులో రాష్ట్ర భాష, ఇంగ్లీషుతో పాటు ఏదైనా ఒక మూడో భాషను బోధించాలని మాత్రమే ఉంది తప్ప హిందీ అని ప్రత్యేకంగా చెప్పలేదని గమనించిన జస్టిస్ నాగారత్న.. మీకు హిందీ వద్దు సరే, మరి సంస్కృతం బోధిస్తే సమస్య ఏమిటని రాష్ట్రాన్ని ప్రశ్నించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను కేవలం కేంద్రం నుండి వచ్చాయనే నెపంతో తిరస్కరించవద్దని.. రాష్ట్ర విద్యా వ్యవస్థను కొనసాగిస్తూనే కేంద్ర ప్రభుత్వ పాఠశాలలను అడ్డుకోవద్దని తమిళనాడుకు హితవు పలికారు.

తమిళనాడు ప్రభుత్వం.. జేఎన్‌వీల ఏర్పాటును నిరంతరం వ్యతిరేకిస్తోంది. ఈ పథకం తమ రాష్ట్రంలోని చట్టబద్ధమైన ద్విభాషా విధానం (తమిళం, ఆంగ్లం) తో సరిపడదని కోర్టుకు తెలిపింది. జేఎన్‌వీల లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సొంతంగా ఏర్పాటు చేసిన 38 మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సమగ్ర శిక్షా పథకం కింద కేంద్రం నుండి రావలసిన రూ. 3,548.22 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్రం పేర్కొంది.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ మార్పు చోటుచేసుకుంది. డీఎంకే (DMK) స్థానంలో కొత్తగా టీవీకే (TVK) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఈ విద్యా విధానంపై నూతన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు కొనసాగుతున్నందున.. తదుపరి చర్యలపై ప్రభుత్వాల నుండి తుది సూచనలు పొందేందుకు కోర్టు ఆరు వారాల సమయం ఇచ్చింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది.