India Raises Taxes on Diesel: డీజిల్, జెట్ ఫ్యూయల్ ఎగుమతులు ఇక మరింత ఖరీదు.. పన్నులు పెంచిన కేంద్రం
India Raises Taxes on Diesel: డీజిల్, జెట్ ఫ్యూయల్ ఎగుమతులు ఇక మరింత ఖరీదు.. పన్నులు పెంచిన కేంద్రం
India Raises Taxes on Diesel: పశ్చిమ ఆసియాలో రోజు రొజుకు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత భయాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్ క్రమబద్ధీకరణ కోసం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నులను లీటరుకు రూ. 7 చొప్పున పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే సమయంలో పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న సుంకాన్ని కొంతమేర తగ్గించడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
ఈ తాజా సవరణల ప్రకారం.. డీజిల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 8.5 నుండి రూ. 15.5కు పెంచగా.. విమాన ఇంధనమైన ఏటీఎఫ్ సుంకాన్ని లీటరుకు రూ. 7.5 నుండి రూ. 14.5కు పెంచారు. మరోవైపు పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 4 నుండి రూ. 2.5కు తగ్గిస్తూ రాయితీ ఇచ్చారు. సవరించిన ఈ కొత్త ధరలు జూలై 16 నుండి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల హెచ్చుతగ్గులు.. రిఫైనింగ్ మార్జిన్‌ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి జరిపే సమీక్షలో భాగంగానే ఈ తాజా మార్పులు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా అమెరికా- ఇరాన్‌ల మధ్య క్షిపణులు, డ్రోన్‌ల దాడులు కొనసాగుతుండటం.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికా దిగ్బంధనాన్ని తిరిగి విధించడంతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ భయాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు కూడా ముడిచమురు ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 85.28 డాలర్లకి చేరగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 80.02 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల నుండి దేశీయ అవసరాలను కాపాడుకునేందుకే భారత్ ఈ విండ్‌ఫాల్ పన్నుల సవరణ చేపట్టింది.