Taj Banjara Closure: తాజ్ బంజారా హోటల్ ఎందుకు మూతపడింది.. రూ.315 కోట్ల డీల్ వెనుక అసలు కథేంటి.. తాజా రియల్ ఎస్టేట్ న్యూస్ ఏంటి..
Taj Banjara Closure: తాజ్ బంజారా హోటల్ ఎందుకు మూతపడింది.. రూ.315 కోట్ల డీల్ వెనుక అసలు కథేంటి.. తాజా రియల్ ఎస్టేట్ న్యూస్ ఏంటి..
Taj Banjara Closure: హైదరాబాద్ నగర ఆతిథ్య రంగానికి నాలుగు దశాబ్దాల పాటు ప్రతీకగా నిలిచిన బంజారా హిల్స్‌లోని తాజ్ బంజారా హోటల్ చరిత్రలో కలిసిపోతోంది. ఒకప్పుడు దేశ విదేశాల ప్రముఖులు, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు ఆతిథ్యం ఇచ్చిన ఈ ప్రతిష్టాత్మక హోటల్ ప్రస్తుతం కూల్చివేత పనుల చివరి దశలో ఉంది. దాదాపు 40 ఏళ్ల పాటు నగరానికి ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన ఈ భవనం త్వరలో పూర్తిగా నేలమట్టం కానుంది.
ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమైన కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే భవనం లోపలి నిర్మాణాన్ని పూర్తిగా తొలగించిన కార్మికులు.. ప్రస్తుతం ప్రధాన భవనాన్ని కూల్చే పనుల్లో నిమగ్నమయ్యారు. బంజారా సరస్సు ఒడ్డున 3.4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ హోటల్ కూల్చివేత దృశ్యాలు ప్రస్తుతం బయట నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి.
1980ల ప్రారంభంలో హైదరాబాద్ ఆధునిక మహానగరంగా రూపాంతరం చెందుతున్న సమయంలో ఈ హోటల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రకృతి అందాల నడుమ, బంజారా సరస్సును ఎదురుగా చూసేలా నిర్మించిన ఈ హోటల్.. నగరంలో అంతర్జాతీయ ప్రమాణాల విలాసవంతమైన ఆతిథ్యానికి కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చింది. సరస్సు అందాలు, ప్రశాంత వాతావరణం, అత్యున్నత సేవలతో తాజ్ బంజారా హైదరాబాద్‌కు అతి తక్కువ కాలంలోనే ప్రతిష్ఠాత్మక చిరునామాగా మారింది.
ప్రారంభంలో ఐటీసీ గ్రూప్ నిర్వహించిన ఈ హోటల్.. అనంతరం తాజ్-జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో మరింత గుర్తింపు పొందింది. దేశ విదేశాల అతిథులతో పాటు నగరంలోని ఎన్నో కుటుంబ వేడుకలు, వ్యాపార సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ హోటల్ వేదికగా నిలిచింది. దీంతో తాజ్ బంజారా కేవలం ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌గానే కాకుండా.. హైదరాబాద్ సామాజిక, సాంస్కృతిక జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
అయితే కాలక్రమేణా ఐటీ రంగం మాధాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకు విస్తరించడం, కొత్త అంతర్జాతీయ హోటళ్లు నగరంలోకి రావడం వల్ల తాజ్ బంజారా ప్రాధాన్యం క్రమంగా తగ్గింది. అనంతరం లీజు ఒప్పందం ముగియడం.. యాజమాన్య పరమైన సమస్యలు తలెత్తడంతో 2023లో హోటల్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆస్తి పన్ను బకాయిల కారణంగా జీహెచ్‌ఎంసీ భవనాన్ని సీల్ చేయగా.. బకాయిల్లో కొంత చెల్లించిన తర్వాత సీల్‌ను తొలగించారు.
తర్వాత ఈ ప్రీమియం స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆరో రియల్టీ సుమారు రూ.315 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం కూల్చివేత పూర్తయిన తర్వాత కొత్త నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. రియల్ ఎస్టేట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ స్థలంలో సుమారు 40 అంతస్తులతో కూడిన ఆధునిక బహుళ వినియోగ ప్రాజెక్టును అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నప్పటికీ.. దీనిపై డెవలపర్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
ఒకప్పుడు హైదరాబాద్ ఆతిథ్య రంగానికి గుర్తింపుగా నిలిచిన తాజ్ బంజారా భవనం త్వరలో కనుమరుగైనా.. దానికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం నగర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. కొత్త నిర్మాణం ఆ ప్రదేశానికి మరో గుర్తింపును తీసుకొచ్చినా.. నాలుగు దశాబ్దాల పాటు నగర సంస్కృతి, ఆతిథ్యం, విలాసవంతమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచిన తాజ్ బంజారా స్థానాన్ని ప్రత్యేకంగానే గుర్తు చేసుకుంటారు.