అంబేద్కర్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యుజిసి అనుమతి…ఇలా అప్లై చేసుకోండి..
అంబేద్కర్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యుజిసి అనుమతి…ఇలా అప్లై చేసుకోండి..
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో (బిఆర్ఎఒయు) కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఆమోదం తెలిపిందని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు.
ఈ ఐదు కోర్సులకు ప్రొఫెషనల్, అకాడమిక్ రంగాల్లో ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. కొత్తగా యుజిసి ఆమోదం తెలిపిన కోర్సుల్లో…
- ఎం.ఎ. ఎడ్యుకేషన్
- ఎం.ఎ. ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్)
- మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్డబ్ల్యూ)
- ఎమ్మెస్సీ (జాగ్రఫీ)
- బిఇడి (స్పెషల్ ఎడ్యుకేషన్) (అనుమతి పునరుద్ధరణ)
ఉన్నాయని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కొత్త కోర్సులకు అనుమతి రావడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు ఉందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, రాష్ట్రంలోని టీచర్లకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కోర్సులను రూపొందించగా, వాటిని యుజిసి ఆమోదించిందని ఆయన వివరించారు.
విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తమ అర్హతలను మెరుగుపర్చుకునేందుకు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు, స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందేందుకు, విధి నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ కోర్సులు ఉపయుక్తంగా ఉంటాయన్నారు.
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణను అందించే విషయమై త్వరలోనే తెలంగాణ విద్యాశాఖతో అవగాహనా ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు.
ఈ కొత్త కోర్సుల కోసం కనీస అర్హత, అడ్మిషన్ విధానం, ఫీజుల వివరాలు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్ల వివరాలతో విశ్వవిద్యాలయం త్వరలో అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఆయన వివరించారు.
తాజా సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్లు www.braou.ac.in, www.braouonline.in లేదా హెల్ప్ డెస్క్ 040-23680333 / 040-23680555 ను సంప్రదించాలని సూచించారు.