Skip to content
తెలంగాణ వార్తలు

Vijayashanti’s Silence: ఎక్కడున్నావ్ రాములమ్మా.. సీనియర్లను కాదని పెద్దల సభకు.. అయినా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే విజయశాంతి..

Prajapaksham 15 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Vijayashanti’s Silence: ఎక్కడున్నావ్ రాములమ్మా.. సీనియర్లను కాదని పెద్దల సభకు.. అయినా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే విజయశాంతి..

Vijayashanti's Silence: ఎక్కడున్నావ్ రాములమ్మా.. సీనియర్లను కాదని పెద్దల సభకు.. అయినా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే రాములమ్మ..

Vijayashanti’s Silence: రాజకీయాల్లో కొందరు నాయకుల వ్యవహారశైలి ఎవరికీ అంతుపట్టని రీతిలో ఉంటుంది. అలాంటి వారిలో ప్రముఖ నటి, మాజీ ఎంపీ విజయశాంతి (రాములమ్మ) ఒకరని చెప్పవచ్చు. ఒకప్పుడు వెండితెరపై లేడీ అమితాబ్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించినప్పటికీ, సుదీర్ఘ కాలంగా ఆమె ప్రదర్శిస్తున్న మౌనం, తరచూ పార్టీలు మారే వైఖరి రాజకీయ వర్గాల్లో ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ పార్టీలో ఉన్నా ఆమె అసంతృప్తిగా.. సైలెంట్ మోడ్‌లోనే ఉంటారనే విమర్శలు ఉన్నాయి.

బిజెపితో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి.. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడారు. ఆపై తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి కేసీఆర్‌కు దేవుడిచ్చిన చెల్లెలిగా పేరు తెచ్చుకున్నారు. ఆ నమ్మకంతోనే మెదక్ లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా గెలిచినప్పటికీ.. ఆ తర్వాత గులాబీ పార్టీలో తలెత్తిన విభేదాల వల్ల అవమానాలు భరించి బయటకు వచ్చారు. అక్కడ నుండి కాంగ్రెస్‌లోకి, ఆ తర్వాత తిరిగి బీజేపీలోకి, మళ్లీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌లోకి మారుతూ ఆమె రాజకీయ ప్రయాణం సాగింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆమె పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించలేదు. ఒకానొక దశలో ఆమె రాజకీయ ప్రస్థానం ముగిసిందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఎమ్మెల్యే కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే 2017 నుండి నిలకడగా పార్టీలో ఉన్నవారికే పదవులని కాంగ్రెస్ నిబంధనలు పెట్టినప్పటికీ.. పార్టీలు మారి వచ్చిన విజయశాంతికి ఈ పదవి ఇవ్వడంపై సీనియర్లలో ఇప్పటికీ అసంతృప్తి ఉంది. పదవి వచ్చిన కొత్తలో బాధ్యతలు ఇస్తేనే పని చేస్తానని చెప్పిన రాములమ్మ.. ఆ తర్వాత కూడా ప్రభుత్వ పథకాలపై కానీ, ప్రతిపక్షాల విమర్శలపై కానీ ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం.

గతంలో మెదక్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయిన ఆమె.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఆశించినప్పటికీ.. సామాజిక సమీకరణాల వల్ల అది దక్కలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాలో ఉన్నప్పటికీ ఆమె అటు పార్టీ కార్యక్రమాల్లోనూ.. ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ చురుగ్గా పాల్గొనకుండా పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.