Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Mudragada Padmanabham: ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదు. ముద్రగడ కుటుంబం సంచలన నిర్ణయం.. అలుపెరగని పోరాటాల మధ్య ముగిసిన కాపు ఉద్యమ నాయకుడి ప్రస్థానం..

Prajapaksham 15 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Mudragada Padmanabham: ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదు. ముద్రగడ కుటుంబం సంచలన నిర్ణయం.. అలుపెరగని పోరాటాల మధ్య ముగిసిన కాపు ఉద్యమ నాయకుడి ప్రస్థానం..

Mudragada Padmanabham: ప్రభుత్వ లాంచనాలు మాకు అవసరం లేదు. ముద్రగడ కుటుంబం సంచలన నిర్ణయం.. అలుపెరగని పోరాటాల మధ్య ముగిసిన కాపు ఉద్యమ నాయకుడి ప్రస్థానం..

Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్న కాలంలో ఆయన పడిన ఇబ్బందులు.. ఎదుర్కొన్న అవమానాల దృష్ట్యా ఇప్పుడు ప్రభుత్వం చూపే అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన సుదీర్ఘ ప్రజా సేవకు గుర్తింపుగా అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అయితే కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ కుటుంబ సభ్యులు ఈ ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేత జక్కంపూడి రాజా ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ బతికున్నప్పుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా వేధించారని.. ఇప్పుడు మరణించిన తర్వాత ప్రభుత్వం మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని విమర్శించారు.

అధికారం కోసం కాకుండా కేవలం ప్రజా సమస్యలు, సమాజ శ్రేయస్సు కోసమే పోరాడిన ఒక నిబద్ధత కలిగిన నాయకుడికి ఈ తాత్కాలిక అధికారిక గౌరవాలు తగవని కుటుంబం భావించింది. కుటుంబ సభ్యుల నిరాకరణ నేపథ్యంలో.. ఎలాంటి ప్రభుత్వ లాంఛనాలు లేకుండానే వారి సంప్రదాయాల ప్రకారం కిర్లంపూడిలోనే ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో.. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఒక మహోన్నత నాయకుడి చివరి ప్రస్థానం కూడా ఈ విధంగా రాజకీయ వివాదాల మధ్య ముగియడం విషాదకరం..

గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కాపు నేత హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ముద్రగడ పద్మనాభం.ఆయనకు ఇద్దరు కుమారులు ముద్రగడ వీరరాఘవరావు (బాలు), ముద్రగడ గిరిబాబు, అలాగే కుమార్తె క్రాంతి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు.

ముద్రగడ పద్మనాభం రాజకీయ, జీవిత ప్రస్థానం..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సామాజిక వర్గం హక్కుల పోరాటానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపంగా నిలిచిన అరుదైన నాయకుడు ముద్రగడ పద్మనాభం. 1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వీరరాఘవరావు, సత్యవతి దంపతులకు జన్మించిన ఆయనకు రాజకీయ నేపథ్యం సొంత కుటుంబం నుంచే అబ్బింది. మునసబుగా పనిచేసిన తాతయ్య పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రెండుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన తండ్రి వీరరాఘవరావుల అడుగుజాడల్లోనే ముద్రగడ కూడా ప్రజాసేవ వైపు అడుగులు వేశారు.

ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేసి.. రాజమహేంద్రవరంలోని తన్నీరు బుల్లియ్య గురుకులంలో ఎల్‌ఎల్‌సీ చదివిన ఆయన, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించడమే కాకుండా రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించి నిష్పక్షపాత, నిర్మొహమాట నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

ముద్రగడ రాజకీయ ప్రస్థానంలో 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నుండి సాధించిన తొలి విజయంతో శాసనసభ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత 1983, 1985 ఎన్నికల్లోనూ వరుస విజయాలు అందుకుని ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ హయాంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో అర్హులందరికీ 3 సెంట్ల స్థలంలో గృహ నిర్మాణాలు చేపట్టి, గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపారు.

అనంతరం 1989లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాలు, చేనేత జౌళి శాఖల మంత్రిగా సేవలు అందించిన ఆయన.. 1999లో కాకినాడ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పలు పార్టీలతో అనుబంధం ఏర్పడినా.. చివరగా 2024 మార్చి 15న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.

మంత్రిగా కంటే కూడా ముద్రగడ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన నడిపిన కాపు రిజర్వేషన్ ఉద్యమం. కాపులను వెనుకబడిన వర్గాల (BC) జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో 1994 జూలై 1న తన సతీమణి పద్మావతితో కలిసి ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి గట్టి పునాది వేసింది. ఆ తర్వాత 2014, 2016లలో కిర్లంపూడి వేదికగా సాగిన దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య మద్దతును కూడగట్టాయి.

ముఖ్యంగా జనవరి 31, 2016న తునిలో నిర్వహించిన కాపు గర్జన బహిరంగ సభ.. ఆ తదనంతర రైల్‌రోకో, తుని రైలు దహనం ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అణచివేతలు, ప్రభుత్వాల ఆంక్షలు, బలవంతపు ఆసుపత్రి తరలింపులు, అక్రమ కేసులు వంటి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. పోస్టుకార్డుల ఉద్యమం నడుపుతూ కాపు రిజర్వేషన్ అనే ఏకైక లక్ష్యం కోసమే తన జీవితమంతా లేఖల ద్వారా పోరాడుతూనే ఉన్నారు.

ముద్రగడ పద్మనాభం కేవలం కాపు ఉద్యమానికే కాకుండా ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరులోనూ ప్రత్యేకత చాటుకున్నారు. 1988లో తన అనుచరులపై పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ముందు ఆమరణ దీక్ష చేసి విజయం సాధించారు. అలాగే 1993లో రావులపాలెం లాఠీచార్జ్ ఘటనపై, 2005లో పోలవరం, పుష్కరం ఎత్తిపోతల పథకాల వల్ల భూములు కోల్పోతున్న రైతుల కోసం సొంత ఇంట్లోనే తలకు రివాల్వర్ పెట్టుకుని ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.

వీటన్నింటికీ భిన్నంగా ఆయన ఆతిథ్యానికి కిర్లంపూడి నివాసం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం లేదా అల్పాహారం చేయకుండా వెళ్లనివ్వని గొప్ప సంస్కారం ఆయనది. పదుల సంఖ్యలో వచ్చే సందర్శకులు అందరూ తృప్తిగా తినే వరకు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించే ఆయన వ్యక్తిత్వం అందరి హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసింది. విజయాపజయాలతో సంబంధం లేకుండా సాగిన ఆయన జీవిత ప్రస్థానం రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పుకోవచ్చు.