Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Aqua Farmers’ Meeting: వైఎస్ జగన్‌ను తోసేసిన అభిమానులు.. ఆక్వా రైతుల సభలో గందరగోళం.. కూటమి పాలనపై ధ్వజమెత్తిన మాజీ సీఎం..

Prajapaksham 15 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Aqua Farmers’ Meeting: వైఎస్ జగన్‌ను తోసేసిన అభిమానులు.. ఆక్వా రైతుల సభలో గందరగోళం.. కూటమి పాలనపై ధ్వజమెత్తిన మాజీ సీఎం..

Aqua Farmers' Meeting: వైఎస్ జగన్‌ను తోసేసిన అభిమానులు.. ఆక్వా రైతుల సభలో గందరగోళం.. కూటమి పాలనపై ధ్వజమెత్తిన మాజీ సీఎం..

Aqua Farmers’ Meeting: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణ, ఆయన పర్యటనల్లో అభిమానులు చూపే అత్యుత్సాహం కొన్నిసార్లు ఎలాంటి భద్రతా పరమైన ఇబ్బందులకు దారితీస్తాయో భీమవరం ఘటన నిరూపిస్తోంది. అక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి సభ ముగిసిన తర్వాత వేదికపై చోటుచేసుకున్న ఈ తోపులాట, గందరగోళ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది.

జగన్‌ను చూసేందుకు, ఆయనతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఒక్కసారిగా వేదికపైకి దూసుకురావడంతో భద్రతా సిబ్బందికి పెద్ద పరీక్షే ఎదురైంది. తీవ్రమైన తోపులాట మధ్య జగన్‌ కిందపడిపోయేంత పరిస్థితి తలెత్తడం భద్రతా వైఫల్యాలను, జనం గుమికూడే సమయాల్లో పాటించాల్సిన నియంత్రణ లోపాలను స్పష్టం చేస్తోంది. అత్యంత ప్రజాదరణ ఉన్న ఇలాంటి మాస్ లీడర్ల పర్యటనల్లో అభిమానుల తాకిడి సహజమే అయినప్పటికీ, భద్రతా సిబ్బందితో పాటు నాయకులు కూడా మరింత అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.

భీమవరం సభలో భద్రతా వలయాన్ని దాటుకుని అంతమంది వేదికపైకి రావడం శాంతిభద్రతల సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సభా వేదికల వద్ద బారికేడ్ల ఏర్పాటు, పరిమిత సంఖ్యలోనే వేదికపైకి అనుమతించడం, అత్యవసర నిష్క్రమణ మార్గాలను పటిష్టం చేయడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రమాదకర ఉదంతం రాజకీయ నాయకుల వ్యక్తిగత భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్రాధాన్యతను మరోసారి గుర్తుచేస్తోంది.

చంద్రబాబు సిండికేట్లను కూకటివేళ్లతో పెకలిస్తాం: భీమవరం ఆక్వా రైతుల సభలో వైఎస్‌ జగన్‌

ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని రైతాంగం, ముఖ్యంగా అక్వా రంగం తీవ్ర అవస్థలు పడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అక్వా రంగం తీవ్ర సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిందని.. ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆయన సానుభూతిపరులంతా సిండికేట్‌గా ఏర్పడి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని.. ఈ సిండికేట్లే ఇష్టానుసారంగా ఫీడ్, సీడ్ ధరలను నిర్ణయిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. గత నాలుగు నెలల్లోనే కేజీ ఫీడ్‌పై 14 నుండి 16 రూపాయల వరకు పెంచేసి.. ఇప్పుడు నామమాత్రంగా రెండు రూపాయలు తగ్గించి మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ రొయ్యల ధర 230 రూపాయలు కూడా దాటని దారుణమైన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ గత ప్రభుత్వ హయాంలో అక్వా రంగాన్ని రక్షించేందుకు ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా జగన్ గుర్తుచేశారు. ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని నియంత్రించడానికి అప్సడా (APSADA) బోర్డును ఏర్పాటు చేసి, ఫీడ్, సీడ్ మార్కెటింగ్‌లో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించామన్నారు. అప్పట్లో అక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను కేవలం రూపాయిన్నరకే అందించామని.. రొయ్యలకు గిట్టుబాటు ధర దక్కేలా నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు.

తమ ఐదేళ్ల పాలనలో సబ్సిడీల కింద 3,306 కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన 401 కోట్ల రూపాయల బకాయిలను కూడా తామే చెల్లించామని వివరించారు. అలాగే ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించి.. 35 అక్వా ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం వల్లే నాటి తమ పాలనలో అక్వా ఎగుమతులు 20 వేల కోట్ల రూపాయలకు చేరి, రాష్ట్రానికి ‘బెస్ట్ మెరైన్ స్టేట్’ అవార్డు దక్కిందని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము తెచ్చిన చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని జగన్ విమర్శించారు. తాము కల్పించిన రూపాయిన్నర విద్యుత్ సబ్సిడీకి కోత పెట్టడమే కాకుండా, రైతులకు ఇవ్వాల్సిన 12 వేల కనెక్షన్లను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వకపోవడంతో రైతులు జనరేటర్లపై ఆధారపడి అదనపు ఖర్చుతో సాగు చేయాల్సి వస్తోందని మండిపడ్డారు.

చివరకు నరసాపురంలో తాము తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని, భీమవరం మెడికల్ కాలేజీ పనులను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసిందని ఫైర్ అయ్యారు. అక్వా రైతుల కష్టాలను తీర్చడానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. రైతుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమబాట పడతామని ఆయన భరోసా ఇచ్చారు. మరో మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ తమ రైతు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అప్పుడు అప్సడా బోర్డుకు పూర్వవైభవం తీసుకువచ్చి చంద్రబాబు సిండికేట్‌ను కూకటివేళ్లతో సహా పెకిలిస్తామని జగన్ స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు: andhra pradesh Aqua Farmers' Meeting