Skip to content
జాతీయం వార్తలు

Sexual Assault Case: లైంగిక నేరాలపై న్యాయవ్యవస్థ వైఖరిపై మరోసారి చర్చ.. పాట్నా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సీరియస్..

Prajapaksham 15 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Sexual Assault Case: లైంగిక నేరాలపై న్యాయవ్యవస్థ వైఖరిపై మరోసారి చర్చ.. పాట్నా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సీరియస్..

Sexual Assault Case: లైంగిక నేరాలపై న్యాయవ్యవస్థ వైఖరిపై మరోసారి చర్చ.. పట్నా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సీరియస్..

Sexual Assault Case: మహిళలపై జరిగే లైంగిక నేరాల కేసులను విచారించేటప్పుడు.. తీర్పులు ఇచ్చేటప్పుడు న్యాయమూర్తులకు మరింత సామాజిక, మానసిక సున్నితత్వం అవసరమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ తరహా కేసుల్లో అనుసరించాల్సిన విధానాలపై నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ కమిటీ రూపొందించిన సమగ్ర నివేదికను సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని అన్ని హైకోర్టుల అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల అలహాబాద్, పట్నా హైకోర్టులు ఇచ్చిన కొన్ని వివాదాస్పద తీర్పుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ వివాదానికి ప్రధాన కేంద్రం 2025 మార్చి 17న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. ఒక బాలిక పైజామా తాడు లాగడం, ఛాతీపై పట్టుకోవడం వంటి చర్యలను అత్యాచారయత్నం కిందకు తీసుకురావచ్చా లేదా అనే కోణంలో ఆ కోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా (స్వయంగా) స్వీకరించి.. లైంగిక నేరాల కేసుల్లో న్యాయమూర్తుల అవగాహనను పరిశీలించడానికి నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ లోపే జూలై 2025లో పట్నా హైకోర్టు ఇచ్చిన మరో తీర్పు ఈ చర్చను మరింత తీవ్రతరం చేసింది.

పట్నా హైకోర్టు తీర్పు వివరాల ప్రకారం.. 2008లో బిహార్‌లోని అమర్‌పూర్‌లో ఒక ఫోటో స్టూడియో యజమాని మహిళపై తలుపులు మూసి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలి కేకలు విని తండ్రి రావడంతో నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్ కోర్టు నిందితుడిని అత్యాచారయత్నం, అక్రమ నిర్బంధం కింద దోషిగా తేల్చింది. అయితే దీనిపై నిందితుడు పాట్నా హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు భిన్నమైన వ్యాఖ్యలు చేసింది. వైద్య ఆధారాలు లేవని, దర్యాప్తు అధికారిని సరిగ్గా విచారించలేదని చెబుతూ.. బాధితురాలి సల్వార్ తొలగించడానికి ప్రయత్నించడం, ఛాతీపై నొక్కడం వంటి చర్యలను అత్యాచారయత్నంగా పరిగణించలేమని పేర్కొంది. ఇవి కేవలం మహిళ గౌరవానికి భంగం కలిగించే నేరాల కిందకే వస్తాయని వ్యాఖ్యానిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన శిక్షను తగ్గించింది.

ఈ తీర్పులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. లైంగిక నేరాల తీవ్రతను తక్కువ చేసి చూపేలా ఉన్న ఇలాంటి తీర్పులు ఇచ్చేటప్పుడు హైకోర్టులు తమ గత మార్గదర్శకాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయమూర్తులు కూడా తీర్పులు ఇచ్చే ముందు సంబంధిత కేసుల తీవ్రతను.. బాధితుల మానసిక స్థితిని లోతుగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కేవలం కోర్టులే కాకుండా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే దశ నుంచి ఛార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు ప్రతిచోటా న్యాయపరంగా సున్నితత్వాన్ని, కచ్చితమైన మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల మహిళలపై జరిగే లైంగిక నేరాల విచారణలో చట్టపరమైన ప్రమాణాలు.. బాధితుల వాంగ్మూలాలకు ఇచ్చే ప్రాధాన్యత, నేర తీవ్రతను అంచనా వేసే విధానాలపై న్యాయ వ్యవస్థలో సరికొత్త సంస్కరణల చర్చకు తెరలేచిందని చెప్పవచ్చు.