Skip to content
జాతీయం వార్తలు

సీఎం సీటు.. ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు..రీల్స్ నుంచి రియాలిటీకి ఎప్పుడు..? విజయ్ పై మొదలైన అసంతృప్తి…

Prajapaksham 14 Jul 2026 0 నిమిషాల పఠనం జాతీయం
సీఎం సీటు.. ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు..రీల్స్ నుంచి రియాలిటీకి ఎప్పుడు..? విజయ్ పై మొదలైన అసంతృప్తి…

గ్లామర్ ప్రపంచం నుంచి గవర్నెన్స్ ప్రపంచంలోకి తమిళనాడు సీఎం విజయ్ అడుగు పెట్టాల్సిన అవసరం వచ్చేసిందా. వైరల్ వీడియోలతో కాదు, నిర్ణయాలతో పాలన సాగించాలని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయా.. లైక్స్, వ్యూస్ దాటి నిజ ప్రపంచంలోకి రావాలని ఆయన సన్నిహితులు కోరుతున్నారా.. హీరో ఇంట్రో అయిపోయింది సీఎం సార్.. ఇది సినిమా కాదు ప్రభుత్వం.. రీల్స్ కాదు, రిజల్ట్స్ చూపించండి అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

హీరో విజయ్ పార్టీ స్థాపించడం, ఎన్నికల్లో విజయం సాధించడం, సీఎం పదవి చేపట్టడం అన్నీ చకచకా సినీ పక్కిలో అన్ని జరిగిపోయాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. సినిమా భాషలో చెప్పాలంటే హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. కానీ ఇంకా హీరో ఎంట్రీ దగ్గరే చిక్కుకు పోతే కథనం నడిచేది ఎలాగా… సినిమా హిట్ అయ్యేది ఎలాగా అని ఆయన సన్నిహితులు సైతం చేస్తున్న విమర్శలుగా వినిపిస్తున్నాయి.

ఎందుకు ఆ ఇటీవల సీఎం విజయ్ చేస్తున్న ప్రతి పని కూడా సోషల్ మీడియాను టార్గెట్ చేసుకొని పాలన కొనసాగిస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఆయన సీఎం కంటే ఎక్కువగా సోషల్ మీడియా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శ కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాల కన్నా కూడా ఆయన సోషల్ మీడియా రీల్స్, షార్ట్ వీడియోలు, వైరల్ కంటెంట్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి.

నిజానికి హీరో విజయ్ నేరుగా ముఖ్యమంత్రి పదవితోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇదంతా కూడా సాఫీగా జరిగిపోయినప్పటికీ కూడా సినిమా ఇమేజ్ను పాలనలో కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పైన విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికారిక కార్యక్రమాలను, పబ్లిసిటీ స్టంట్ ఈవెంట్లుగా మార్చేస్తున్నారని విమర్శలు కూడా గట్టిగా వినిపించడం గమనించవచ్చు. ఇక పరిపాలనలో అనుభవం లేని కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.

దీనికి తోడు క్యాబినెట్ పైన ముఖ్యమంత్రి విజయ్ కు పూర్తిస్థాయిలో పట్టులేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కరూర్ లో ఇటీవల జరిగిన ఓ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది అని చెప్పవచ్చు. ఈ అంశం పైన ప్రతిపక్ష డిఎంకె తీవ్ర ఎత్తున విమర్శలు చేసింది.

సీఎం విజయ్ ఇంకా సినీ రంగంలోని హీరో గానే వ్యవహరిస్తున్నారని, ఆయన పార్టీ నిర్వహణను ఒక సినీ అభిమాన సంఘం శైలి తరహాలోనే నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. ఆయన పాలన కన్నా కూడా వ్యక్తిగత ప్రజాధరణ పైన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని, సోషల్ మీడియాపై ఆయన చూపిస్తున్న మక్కువను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.

సీఎం విజయ్ పిఆర్ టీం చెప్పిన సూచనలు మాత్రమే కాకుండా రాజకీయ అనుభవజ్ఞులు చెప్పిన సూచనలను పాటించాలని, వీలైతే మంచి సుశిక్షితులైన ఆఫీసర్లను ఏర్పాటు చేసుకొని వారి సలహాలను తీసుకోవాలని, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లను సలహాదారులుగా నియమించుకొని పరిపాలన సాఫీగా కొనసాగించాలని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇలాగే సోషల్ మీడియా కోసమో, వ్యక్తిగత ప్రజాధరణ పెంపుదల కోసమో పరిపాలన సాగితే మాత్రం ప్రతిపక్షాలకు త్వరలోనే సీఎం విజయ్ అడ్డంగా దొరికిపోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ట్యాగ్‌లు: TamilNadu Politics Vijay