Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన లోకేష్ బృందం…రాజకీయాల్లోకి రామని ప్రకటించినా ఎందుకంత ఉలికిపాటు..?

Prajapaksham 14 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన లోకేష్ బృందం…రాజకీయాల్లోకి రామని ప్రకటించినా ఎందుకంత ఉలికిపాటు..?

జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన లోకేష్ బృందం...రాజకీయాల్లోకి రామని ప్రకటించినా ఎందుకంత ఉలికిపాటు..?

జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఇటీవల ఊరు వాడ కార్యక్రమం చేపడుతున్నామని, జూలై 18వ తేదీన తిరుపతిలో సభ నిర్వహిస్తున్నామని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ప్రకటన అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం సృష్టించింది అని చెప్పవచ్చు.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన సన్నిహితులు, ఆయన కార్యాలయం నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రకటన ప్రకారం ఈ సభకు జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని, ఈ సభకు జూనియర్ ఎన్టీఆర్ రావడంలేదని స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ట్రోలింగ్ మాత్రం ఆగలేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎప్పుడూ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కొత్తగా వస్తున్నారు అనుకుంటే పొరపాటే. 2009 ఎన్నికల్లో తన ప్రాణాలకు తెగించి మరీ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే జరిగిన యాక్సిడెంట్ లో తృటిలో తప్పించుకొని మృత్యుంజయుడుగా తిరిగి వచ్చారు. ఇంతలా రిస్కు తీసుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆయనను గుర్తించలేదన్న బాధ ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది అని చెప్పవచ్చు.

తెలుగుదేశం పార్టీ సభలు ఎక్కడ జరిగినా జూనియర్ ఎన్టీఆర్ కటౌట్స్ కనిపించడం గమనించవచ్చు. చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ ఇలా ఎవరి సభ జరిగినా అక్కడ ఫ్లెక్సీలు పట్టుకొని ఆయన అభిమానులు సందడి చేస్తుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు తారక్ ఫ్లెక్సీ పట్టుకున్న వారిని పిలిచి మందలించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ రెండు ఆకులు ఎక్కువ చదివి ఆ ఫ్లెక్సీలను చింపివేసి, పక్కనుంచి తారక అభిమానులను తరిమికొట్టిన సంగతి గుర్తుంచుకోవాలి.

ఇక గుడ్డిలో మెల్ల అన్నచందంగా లోకేష్ గతంలో ఫ్లెక్సీ పట్టుకొని వారి అభిమానులు సభలో నిలబడితే నిరుత్సాహపరచకుండా “జై ఎన్టీఆర్” అని ఉత్సాహపరిచారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ తారక్ నిజంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అంటే అది నారా వారికి ఏమాత్రం రుచించదు అని పార్టీలోని సీనియర్ నేతలు కూడా చెబుతుంటారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తోంది. బాలకృష్ణ మినహా నందమూరి కుటుంబానికి చెందిన వారు ఎవరు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో లేరు. గతంలో తెలంగాణ ఎన్నికల్లో అప్పటికి ఆమె కూడా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బిజెపిలో కొనసాగుతున్నారు.

ఇలా నారావారి కంట్రోల్ లోనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉంది. భవిష్యత్తులో నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో తెలుగుదేశంలోకి జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరు ఆహ్వానిస్తారు అనేది పెద్ద ప్రశ్న. రెండు పవర్ సెంటర్లు ఉండడం అనేది దాదాపు అసాధ్యం. కనుక తెలుగుదేశం పార్టీ కచ్చితంగా నారావారి కంట్రోల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తప్పనిసరిగా కొత్త పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి ప్రవేశించాల్సి ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి జూలై 18వ తేదీ వ్యవహారానికి వస్తే, ఇప్పటికే లోకేష్ కు అనుకూలంగా ఉండే సోషల్ మీడియా హ్యాండిల్స్ జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తుంటే, ఇక తెలుగుదేశం పార్టీకి నిత్యం భజన చేసే ఎల్లో మీడియాగా పిలవబడే ఛానల్ కూడా భుజాలు తడుముకుంటున్నాయి.

ఎల్లో మీడియాకు చెందినటువంటి ఒక న్యూస్ ఛానల్ అధినేత ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రారని ఆయన ఘంటాపరంగా చెబుతున్నారు. దీన్నిబట్టి జూనియర్ ఎన్టీఆర్ రాకను వారు జీర్ణించుకోలేకపోతున్నారని సోషల్ మీడియా వేదికగా తారక అభిమానులు మండిపడుతున్నారు.

నిజానికి జూలై 18న జరిగేది చిన్న ఫ్యాన్స్ మీట్ అయినప్పటికీ కూడా తెలుగుదేశం సంబంధించిన ఎకోసిస్టం ఈ స్థాయిలో స్పందించింది. ఇక నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కనుక పొలిటికల్ గా టార్గెట్ పెట్టుకొని సేవా కార్యక్రమాలను గనుక ప్రారంభం చేస్తే, ఇక నారా వారు ఏ స్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారో అర్థం చేసుకోవచ్చు.

మొత్తానికి ప్రస్తుతానికైతే ఒక చిన్న టీజర్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే అని సోషల్ మీడియా వేదికగా తారక అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

ట్యాగ్‌లు: jr ntr Lokesh visit TDP