Google: గూగుల్‌లో అసలేం జరుగుతోంది.. వరుసగా గుడ్ బై చెబుతున్న సీనియర్ ఏఐ నిపుణులు.. ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐలోకి జంప్..
Google: గూగుల్‌లో అసలేం జరుగుతోంది.. వరుసగా గుడ్ బై చెబుతున్న సీనియర్ ఏఐ నిపుణులు.. ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐలోకి జంప్..
Google: ప్రపంచ ఏఐ (AI) దిగ్గజం గూగుల్ డీప్‌మైండ్‌కు వరుసగా షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. కంపెనీలో వరుసగా చేస్తున్న రాజీనామాలు టెక్ రంగంలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. గత కొన్ని వారాల వ్యవధిలోనే నలుగురు సీనియర్ అంతర్జాతీయ ఏఐ నిపుణులు డీప్‌మైండ్‌ను వీడటం సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది లండన్ వేదికగా పనిచేస్తున్న అగ్రశ్రేణి పరిశోధకులు కావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
ఇటీవల గూగుల్‌కు రాజీనామా చేసిన వారిలో జోనాస్ అడ్లర్, అలెగ్జాండర్ ప్రిట్జెల్ అత్యంత కీలకమైన నిపుణులుగా ఉన్నారు. వీరిద్దరూ గూగుల్ ప్రతిష్టాత్మక ‘జెమినీ ఏఐ’ (Gemini AI) మోడల్ అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించారు. వీరు త్వరలోనే ఆంథ్రోపిక్ (Anthropic) లో చేరబోతున్నట్లు సమాచారం. వీరితో పాటు, డీప్‌మైండ్‌లో ప్రోటీన్ల నిర్మాణాన్ని అంచనా వేసే విప్లవాత్మక ఆల్ఫాఫోల్డ్ (AlphaFold) సాంకేతికతకు సహ-నేతృత్వం వహించి నోబెల్ బహుమతి సాధించిన ప్రముఖ శాస్త్రవేత్త జాన్ జంపర్, అలాగే ఏఐ టెక్నాలజీకి పునాది లాంటి ట్రాన్స్‌ఫార్మర్ సాంకేతికత రూపకర్తలలో ఒకరైన నోమ్ షజీర్ వంటి దిగ్గజాలు కూడా గూగుల్‌ను వీడారు. జాన్ జంపర్ సైతం ఆంథ్రోపిక్ వైపే మొగ్గు చూపినప్పటికీ.. బ్రిటన్ నిబంధనల ప్రకారం ఉన్న నాన్-కంపీట్ ఒప్పందం వల్ల ఆయన వచ్చే ఏడాది మాత్రమే అక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ వరుస వలసల వెనుక భౌగోళిక, ఆర్థిక పరమైన బలమైన కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే కీలకమైన ప్రీ-ట్రైనింగ్ పరిశోధనలు, కంప్యూటింగ్ వనరుల కేటాయింపులు క్రమంగా అమెరికాలోని కాలిఫోర్నియా వైపు మళ్లుతున్నాయి. దీంతో లండన్ పరిశోధకులు కూడా సహజంగానే అమెరికా కేంద్రంగా నడిచే అగ్రశ్రేణి స్టార్టప్‌ల వైపు అడుగులు వేస్తున్నారు.
దీనికి తోడు ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ (OpenAI) వంటి అగ్రశ్రేణి సంస్థలు త్వరలోనే స్టాక్ మార్కెట్‌లోకి (IPO) వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో.. ఇప్పుడు వాటిలో చేరితే భవిష్యత్తులో షేర్ల రూపంలో భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చనేది ఈ నిపుణుల ఆలోచనగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఏఐ నిపుణుల కోసం మార్కెట్లో ఎంత పోటీ ఉన్నా.. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించే విషయంలో గూగుల్‌కు ఇప్పటికీ తిరుగులేని బలమైన స్థానం ఉందని డీప్‌మైండ్ అధిపతి డెమిస్ హసాబిస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.