Skip to content
ప్రపంచం వార్తలు

China vs US: అమెరికా వేస్ట్..చైనా బెస్ట్ అంటున్న గ్లోబల్ దేశాలు.. ప్రపంచ ప్రజాభిప్రాయ సర్వేలో సంచలనం.. ప్యూ రీసెర్చ్‌ సర్వేలో కీలక విషయాలు..

Prajapaksham 16 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
China vs US: అమెరికా వేస్ట్..చైనా బెస్ట్ అంటున్న గ్లోబల్ దేశాలు.. ప్రపంచ ప్రజాభిప్రాయ సర్వేలో సంచలనం.. ప్యూ రీసెర్చ్‌ సర్వేలో కీలక విషయాలు..

China vs US: అమెరికా వేస్ట్..చైనా బెస్ట్ అంటున్న గ్లోబల్ దేశాలు.. ప్రపంచ ప్రజాభిప్రాయ సర్వేలో సంచలనం.. ప్యూ రీసెర్చ్‌ సర్వేలో కీలక విషయాలు..

China vs US: ప్రపంచవ్యాప్తంగా భూతల స్వరంగా పిలవబడే అగ్రరాజ్యం అమెరికాకు ఉన్న ఆదరణ క్రమంగా తగ్గుతుండగా.. భారత్ దాయాది దేశం చైనా వైపు అంతర్జాతీయ సమాజం మొగ్గు చూపుతోందని తాజా గ్లోబల్ సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయంగా సూపర్ పోలీస్ గా, పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కే ప్రపంచ వేదికపై అత్యధిక ప్రజాదరణ లభించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అమెరికా కేంద్రంగా నిష్పక్షపాతంగా పనిచేసే ప్రముఖ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Center) నిర్వహించిన ఈ తాజా అంతర్జాతీయ సర్వే ఫలితాలు గ్లోబల్ పాలిటిక్స్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలను స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి.

ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలలో దాదాపు 42 వేల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటర్వ్యూ చేసి ఈ నివేదికను రూపొందించింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం, నూటికి 70 శాతానికి పైగా అంటే దాదాపు 25 దేశాల ప్రజలు అమెరికా కంటే చైనా విధానాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తేలింది. అలాగే సుమారు 22 దేశాలలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం కంటే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నాయకత్వంపైనే ప్రపంచ ప్రజలు ఎక్కువ విశ్వాసాన్ని, అభిమానాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా అంతర్జాతీయ నేతలపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరు నాయకులలో ట్రంప్‌తో పోలిస్తే జిన్‌పింగే మెరుగైన స్కోరును సాధించడం విశేషం.

ఈ గ్లోబల్ మార్పుకు ప్రధాన కారణం అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష విదేశాంగ విధానాలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడా, మెక్సికో, ఐరోపా సమాఖ్య వంటి తమ సంప్రదాయ మిత్రదేశాలతో వాణిజ్య, రక్షణ పరమైన విభేదాలు కొని తెచ్చుకున్నారు. దీనివల్ల ఆయా దేశాల ప్రజలలో అమెరికా పట్ల ఉన్న సదాభిప్రాయం ఇటీవలి కాలంలో వేగంగా క్షీణించింది. ఇతర దేశాల అంతర్గత, ప్రాంతీయ వ్యవహారాలలో, భౌగోళిక రాజకీయాల్లో అమెరికా జోక్యం ఎక్కువగా ఉంటుందని.. దానికి భిన్నంగా చైనా ఇతర దేశాల వ్యవహారాల్లో తక్కువగా జోక్యం చేసుకుంటుందని ప్రపంచ ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

అంతేకాకుండా అంతర్జాతీయంగా చైనాను ఒక నమ్మకమైన ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మధ్య-ఆదాయ దేశాల ప్రజలు చూడటం ప్రారంభించారు. ప్రపంచ శాంతికి, అభివృద్ధికి చైనా తన వంతు సానుకూల సహకారం అందిస్తోందనే నమ్మకం ప్రజల్లో బలంగా పెరిగింది. ఈ గ్లోబల్ సర్వేలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వయస్సు రీత్యా చూస్తే పెద్దవారి కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలోనే చైనా పట్ల, షీ జిన్‌పింగ్ నాయకత్వం పట్ల అత్యధికంగా సానుకూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే వ్యక్తిగత స్వేచ్ఛలు, మానవ హక్కులను గౌరవించే విషయంలో చైనా కంటే అమెరికాయే మెరుగ్గా ఉంటుందని ప్రపంచ ప్రజలు ఇప్పటికీ అంగీకరిస్తున్నారు. కానీ గత కొన్నేళ్లుగా అమెరికా తన సొంత దేశంలో పౌరుల హక్కులను కాపాడే విషయంలో, అంతర్గత శాంతిభద్రతల విషయంలో వెనుకబడిందనే నిరాశ కూడా గ్లోబల్ ఆడియన్స్‌లో వ్యక్తమైంది. దీనివల్ల గతంలో స్వేచ్ఛ విషయంలో అమెరికా, చైనాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం కాస్తా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది.

ఈ భౌగోళిక రాజకీయ విభజనలో మరో స్పష్టమైన మార్పు కనిపించింది. చైనాతో నేరుగా సరిహద్దు వివాదాలు లేదా ప్రాంతీయ ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న భారతదేశం, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, పోలాండ్ వంటి కేవలం ఆరు దేశాల ప్రజాభిప్రాయం మాత్రమే ఇప్పటికీ చైనా కంటే అమెరికా వైపే.. జిన్‌పింగ్ కంటే ట్రంప్ వైపే మొగ్గు చూపింది. కానీ, అమెరికాకు పొరుగునే ఉన్న కెనడాతో పాటు ఐరోపాలోని కీలక దేశాలైన స్పెయిన్, ఇటలీ, గ్రీస్, ఆసియాలోని ఇండోనేషియా వంటి దేశాల ప్రజల చూపు చైనా వైపు మళ్లడం అంతర్జాతీయంగా అమెరికా గుత్తాధిపత్యానికి పడుతున్న గండిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.