Skip to content
జాతీయం వార్తలు

Birth Certificate Case: చిన్నారి జనన ధ్రువీకరణ పత్రంపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు.. తండ్రి వివాదానికి DNAతో ముగింపు..

Prajapaksham 16 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Birth Certificate Case: చిన్నారి జనన ధ్రువీకరణ పత్రంపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు.. తండ్రి వివాదానికి DNAతో ముగింపు..

Birth Certificate Case: చిన్నారి జనన ధ్రువీకరణ పత్రంపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు.. తండ్రి వివాదానికి DNAతో ముగింపు..

Birth Certificate Case: పితృత్వం, పౌర రికార్డుల (సివిల్ రికార్డులు) సవరణకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. శాస్త్రీయంగా డీఎన్‌ఏ (DNA) సాక్ష్యం పితృత్వాన్ని నిర్ధారించినందున.. ఒక మైనర్ బాలిక జనన ధృవీకరణ పత్రంలో (Birth Certificate) అప్పటికే తండ్రిగా నమోదైన వ్యక్తి పేరును తొలగించి.. ఆమె అసలు తండ్రి పేరుతో కొత్త సర్టిఫికెట్‌ను జారీ చేయాలని BMCని ధర్మాసనం ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర వి ఘుగే, జస్టిస్ రంజిత్‌సిన్హా ఆర్ భోంసాలేలతో కూడిన ధర్మాసనం దీనిని విలక్షణమైన వాస్తవాలతో కూడిన అసాధారణ కేసుగా అభివర్ణించింది.

కోర్టు రికార్డుల ప్రకారం.. ముంబైకి చెందిన ఒక మహిళకు 2006లో మొదటి భర్తతో వివాహమైంది. అయితే పిల్లలు లేని ఆ దంపతులు మనస్పర్థల వల్ల విడివిడిగా జీవిస్తూ 2013లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కాగా మొదటి భర్తతో విడిపోయి ఉన్న కాలంలోనే ఆ మహిళ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని.. 2009 డిసెంబర్‌లో ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఆమె చట్టబద్ధంగా మొదటి భర్తతో వివాహితగానే ఉన్నందున.. మున్సిపల్ నిబంధనల ప్రకారం జనన ధృవీకరణ పత్రంలో ఆమె మొదటి భర్త పేరే తండ్రిగా నమోదైంది. అనంతరం విడాకులు మంజూరయ్యాక.. ఆ మహిళ సదరు బిడ్డకు జన్మనిచ్చిన జీవసంబంధమైన తండ్రినే రెండో వివాహం చేసుకుంది.

ఆ తర్వాత తామే ఆ బిడ్డకు అసలైన తల్లిదండ్రులమని.. మొదటి భర్తకు ఆ బిడ్డకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు ముందు దంపతులిద్దరూ ప్రమాణ స్వీకార వాంగ్మూలం ఇచ్చారు. తమ వాదనను శాస్త్రీయంగా నిరూపించడానికి 2025 అక్టోబర్ 27 నాటి డీఎన్‌ఏ పితృత్వ పరీక్ష నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఆ నివేదికలో సదరు వ్యక్తికి..బిడ్డకు మధ్య పితృత్వ సంభావ్యత 99.99 శాతంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ బలమైన శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన హైకోర్టు.. పాత రికార్డులను సవరించి కొత్త జనన ధృవీకరణ పత్రాన్ని వచ్చే నెలలోగా జారీ చేయాలని బీఎంసీని ఆదేశించింది.